ప్రాజెక్టుల యాత్ర


Sun,December 16, 2018 02:18 AM

CM KCR Says Complete all irrigation projects within two years

-స్వయంగా పరిశీలించనున్న సీఎం కేసీఆర్
-మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన
-మరోరోజు ఎస్సారెస్పీ పునర్జీవ పనుల పరిశీలన
-మరింత వేగంగా కాళేశ్వరం పనులు
-యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
-జూన్, జూలైనాటికి కాళేశ్వరం నీళ్లు
-రెండేండ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తికావాలి
-కోటి ఎకరాలకు సాగునీరు అందించాలి
-పనుల్లో జాప్యాన్ని సహించేదిలేదు
-సేకరించిన భూములకు వెంటనే పరిహారం చెల్లించాలి
-అవసరమైన నిధులు సత్వరమే విడుదలచేయాలి
-ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
-ఎస్సారెస్పీ పునర్జీవ పనులు మే కల్లా పూర్తి
-ముఖ్యమంత్రికి వర్క్ ఏజెన్సీల హామీ
-ఏడుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమీక్ష
-త్వరలో మరోసారి విస్తృతస్థాయిలో భేటీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే జూన్, జూలై నాటికి సాగునీరందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే మంగళవారం ప్రాజెక్టు పరిధిలోని బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణ ప్రాంతాలను సందర్శిస్తానని తెలిపారు. మరోరోజు ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలిస్తానని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేండ్లలో పూర్తిచేసి, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో శనివారం ఏడుగంటలపాటు సుదీర్ఘంగా, సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై చేపడుతున్న బరాజ్‌లు, పంపుహౌజ్‌లతోపాటు మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు పనుల పురోగతిని ఆయన ప్యాకేజీలవారీగా సమీక్షించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం జరుగుతున్న చోట అందుకు కారణాలు ఏమిటని ప్రశ్నించారు. నిధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేవని, త్వరితగతిన ప్రాజెక్టుల నుంచి నీళ్లందించాలని స్పష్టంచేశారు. రైతాంగం సాగునీటి కోసం వేచిచూస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు రెండ్రోజులపాటు నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బరాజ్‌లు, పంపుహౌజ్‌లను సీఎం మంగళవారం సందర్శిస్తారు. అనంతరం మరోరోజు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలిస్తానని చెప్పారు.

పరిహారానికి రూ.80 కోట్లు విడుదలచేయండి

ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా అలసత్వం, జాప్యంలేకుండా యుద్ధప్రాతిపదికన పనులుచేయాలని సీఎం అధికారులను కోరారు. సీతారామ, శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం పనులు మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం.. వర్క్ ఏజెన్సీలు, సంబంధిత అధికారులతో మాట్లాడి, సత్వరం పనులు పూర్తిచేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం వెంటనే చెల్లించాలని, ఇందుకోసం అవసరమైన నిధులను సత్వరమే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా ఉన్న గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల భూ నిర్వాసితులకు చెల్లించడానికి రూ.80 కోట్లు విడుదలచేయాలని ఆర్థికశాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి, భువనగిరి జిల్లా కలెక్టర్లకు కూడా వెంటనే పరిహారానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా చేపట్టిన పనులవల్ల వరదకాల్వలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. వరదకాల్వ నుంచి ఆఫ్‌టేక్ (ఓటీ) తూముల ద్వారా అన్ని చెరువులకు నీరందించాలి. కాకతీయకాల్వ- వరదకాల్వ మధ్య ఉన్న ఆయకట్టు అంతా నీరందించేలా ఆ ప్రాంతంలోని అన్ని చెరువులను నింపాలి అని ముఖ్యమంత్రి సూచించారు.
KCR-IRRIGATION1

పనుల్లో ఇంకా వేగం పెరుగాలి

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరుగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం అనుకున్నంత వేగంగా జరుగడం లేదు. మేడిగడ్డతోపాటు అన్నా రం, సుందిళ్ల బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణాల్లో వేగం పెంచాలి అని సీఎం ఆదేశించారు. పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని హెచ్చరించారు. సింగూరుకు రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున నీరందించాలని, ఈ ప్రతిపాదనలను వెంటనే సిద్ధంచేయాలని సీఎం సూచించారు. కౌలాస్‌నాలాను పటి ష్ఠం చేయడంతోపాటు నాగమడుగు ద్వారా జుక్కల్ సెగ్మెంట్‌కు నీరందించాలని చెప్పారు. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. సీతారామ లిఫ్టుతోపాటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరుగడంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సీతారామ లిఫ్ట్‌కు అవసరమైన రూ.11వేల కోట్ల నిధుల సేకరణ పూర్తయిందని, పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సీఎం అన్నారు. వర్క్ ఏజెన్సీల బాధ్యులతో సీఎం స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులను మే నెలకల్లా పూర్తిచేస్తామని వర్క్ ఏజెన్సీలు సీఎంకు మాటిచ్చాయి. పాలమూరు- రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై మరోసారి విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. సమీక్షలో హోం మంత్రి మహమూద్‌అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

2924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles