-గోదావరిలో అడ్డుగోడ నిర్మాణంతో కాల్వ సృష్టి
-1891-92లో నిర్మించిన ఫ్రెంచ్ ఇంజినీర్ ఊట్లే
నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామ సమీపంలో నేటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన గోదావరి నదిపై 437.388 మీటర్ల పొడవున సదర్మాట్ ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట నుంచి 4.129 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు వీలుంది. కేవలం సాగునీటి కోణంలో 26 గ్రామాల పరిధిలోని 13,100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకుగాను 1891-92లో ఫ్రెంచ్ ఇంజినీర్ కేకే ఊట్లే దీనిని నిర్మించారు. ఖానాపూర్కు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిలో పొడగాటి ఆడ్డుగోడను నిర్మించి సదర్మాట్ కాల్వను సృష్టించారు. సహజసిద్ధంగా గోదావరిలో నీరుంటే సదర్మాట్ కాల్వ ఏటా రెండు పంటలకు సాగునీరు అందిస్తుంది. అందుకే ఖానాపూర్ ప్రాంతానికి కాలువ పట్టె అనే పేరు కూడా వచ్చింది. ఈ ఆనకట్ట నుంచి ఖానాపూర్, కడెం మండలాల్లోని 13,100ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు.
ఆనకట్ట ఎడమవైపున 21.530 కిలోమీటర్ల పొడవున నిర్మించిన కాల్వ కింద ఒక డిస్ట్రిబ్యూటరీ ఉండగా, ఎడమ కాల్వ 5700 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. 7.500 కిలోమీటర్ల పొడవున నిర్మించిన కుడి కాల్వ కింద 3400 ఎకరాలు సాగవుతున్నాయి. సదర్మాట్ డిస్ట్రిబ్యూటరీ కింద మిగిలిన నాలుగువేల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. ఈ ఆనకట్ట వద్ద గరిష్ఠ వరద ప్రవాహం 7.76 లక్షల క్యూసెక్కులు. సుమారు 127 ఏండ్లుగా సేవలు అందిస్తున్న సదర్మాట్ ఆనకట్ట ఆయకట్టు పరిధిలో 80% వరి, మిగిలిన 20%లో మొక్కజొన్న, పసుపు పండిస్తున్నారు. పన్నెండు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఈ ఆనకట్ట నిర్మాణం సాగునీటిని అందిస్తుండటం రికార్డు.
ఈ నిర్మాణానికి జాతీయ గుర్తింపు రావడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 1962లో నిర్మించాక గోదావరి నది ప్రవాహం తగ్గింది. నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు రైతులకు రెండు పంటలు పండించే పరిస్థితి లేకుండాపోయింది. సదర్మాట్ ఆనకట్ట వద్ద నీటి నిల్వ లేకపోవడంతో సదర్మాట్ బరాజ్ నిర్మాణం జరుగుతున్నది. ఆనకట్ట ఎగువన మామడ మండలం పొన్కల్, నల్దుర్తి మధ్యలో రూ.315.58 కోట్లతో ఈ బరాజ్ చేపట్టారు.