పంచాయతీలపై గులాబీ జెండా


Sun,January 13, 2019 02:39 AM

CM KCR plans for the development of villages

-మొదటి విడుతలో టీఆర్‌ఎస్ ఖాతాలో ఏకగ్రీవమైన 310 గ్రామాలు
-పంచాయతీలపై గులాబీ జెండా
-రెండో విడుతలో కొనసాగుతున్న ఏకగ్రీవాల పర్వం
-పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక
-కొత్త చట్టంతో మరింత పెరిగిన మద్దతు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీలపై గులాబీ జెండా ఎగురుతున్నది. పార్టీలతో సంబంధంలేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులకు ప్రజలు అండగా నిలుస్తున్నారు. స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికతో రూపుదిద్దుకున్న కొత్త పంచాయతీరాజ్ చట్టం గ్రామ రాజకీయాలను మలుపు తిప్పుతున్నది. అన్నిరంగాల్లో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామనే నినాదంతో ప్రజలు ఒక్కటవుతున్నారు. ప్రభుత్వంతో అనుబంధంగా ఉండేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు.

కొత్త చట్టంతో మారనున్న రూపురేఖలు

నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. ప్రతి గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, ప్రజారోగ్యం, రోడ్ల అభివృద్ధితోపాటు పేదవర్గాల సంక్షేమానికి కొత్త చట్టంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. తెలంగాణ తరహాలోనే ఆయా రాష్ర్టాలు పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసుకోవాలని ఇటీవలే కేంద్ర మంత్రి ఓరమ్ సైతం సూచించారు. కొత్త చట్టంలో పంచాయతీల పాలకవర్గాలకు చాలా బాధ్యతలను అప్పగించడమే కాకుండా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు. ప్రతినెలా గ్రామసభలు నిర్వహించాలని స్పష్టంచేశారు. వరుసగా మూడుసార్లు గ్రామసభ నిర్వహించకుంటే సర్పంచ్‌పై వేటు వేయనున్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికను గ్రామసభల్లో తేటతెల్లం చేసి, ఆమోదించాల్సిందే. ప్రతి ఒక్కరినీ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా గ్రామసభల్లో కోరం ఉండేలా చట్టంలో నిర్ణయించారు. ఇక గ్రామాభివృద్ధి కమిటీలకు ప్రాధాన్యం ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంస్థలను భాగస్వాములను చేశారు. దీంతో కొత్త చట్టం చాలా రోజుల నుంచి పార్టీల పేరుతో విడిపోయినవారిని కూడా అభివృద్ధి కోసం ఒక్కటిగా చేసింది. ఇన్నేండ్లు వెనుకబడి ఉన్న గ్రామాన్ని ఆదర్శంగా మార్చుకొనేందుకు పల్లెవాసులు ఏకతాటిపైకి వస్తున్నారు.

కూటమి నాయకులను తిరస్కరిస్తున్న ప్రజలు

ఇప్పటికే కోర్టులను ఆశ్రయించి పంచాయతీ ఎన్నికలు జరుగకుండా అడ్డుకొని రూ.కోట్ల నిధులు రాకుండా చేసిన కాంగ్రెస్, టీడీపీ కూటమి నేతలకు.. గ్రామాల్లో ఇప్పుడు విషమ పరీక్ష మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు గత ఏడాది ఆగస్టులోనే పూర్తికావాల్సి ఉండగా.. కాంగ్రెస్, కూటమి నేతలు కోర్టుకెక్కి కేసులు వేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లను తగ్గించక తప్పని పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ కారణంగా గ్రామాల అభివృద్ధి ఆగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం 50 శాతంలోపు రిజర్వేషన్లు చేసింది. ఈ విషయాన్ని ప్రజలు మొదట్నుంచీ గమనిస్తూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కండువాలు వేసుకొని రాజకీయాలు చేసేవారికి ప్రజలు కూడా సరైన గుణపాఠమే చెప్తున్నారు. అభివృద్ధిని అడ్డుకొనే నేతలు మీరు అంటూ కాంగ్రెస్, టీడీపీ నాయకులపై మండిపడుతున్నారు. ఏకగ్రీవాల్లో ఆ పార్టీ మద్దతుదారుల ఊసే లేకుండా పోయింది. ఈ పరిణామాల్లో కాంగ్రెస్, టీడీపీ మద్దతుదారులమంటూ చెప్పుకునేందుకు కూడా అభ్యర్థులు జంకుతున్నారు.

టీఆర్‌ఎస్ మద్దతుదారులకే అండగా ప్రజలు

గ్రామాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులకు ప్రజలు అండగా నిలుస్తున్నారు. పార్టీ తరఫున ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి నిధులు తీసుకొస్తారనే ఆశతో వారివెంట నడుస్తున్నారు. మొదటి విడుతలో రాష్ట్రంలో దాదాపు 340 పంచాయతీలకుపైగా ఏకగ్రీవం కాగా, ఇందులో 310 గ్రామాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులే ఏకగ్రీవమయ్యారు. ఇప్పటికే పార్టీలో తిరుగుతున్నవారికి ఈసారి పంచాయతీల బాధ్యతలను అప్పగిస్తున్నారు. రాజకీయాలన్నీ పక్కనపెట్టి టీఆర్‌ఎస్‌వాదులను ఎన్నుకుంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల గ్రామాల అభివృద్ధి సాధించవచ్చని భావిస్తున్నారు. రెండో విడుతలోనూ ఇదే పర్వం కొనసాగుతున్నది.

1968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles