ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలు


Fri,April 29, 2016 12:24 AM

CM KCR orders of the authorities

-అంచనావ్యయం రూ.828.16 కోట్లు
-80 స్నానఘట్టాలకు భారీ ఏర్పాట్లు
-వర్షరుతువు ప్రారంభానికే పనులు పూర్తిచేసేలా కార్యాచరణ
-తీరమంతటా ఆలయాల పునరుద్ధరణ
-అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వం ఈ పుష్కరాలకోసం రూ.828.16 కోట్లు కేటాయించింది. తెలంగాణలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కలిపి కృష్ణానది 281 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నది. ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కృష్ణానది ప్రవహిస్తున్న తీర ప్రాంతాల్లోనున్న పుణ్యక్షేత్రాలన్నింటినీ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఆదేశాల ప్రకారం కృష్ణా తీరప్రాంత ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నారు. జూన్ మొదటివారంనాటికి వర్షరుతువు ప్రవేశించినాటికే ముందే 90శాతం పనులను పూర్తి చేయాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచనలు చేశారు. దేవగురువు బృహస్పతి కన్యారాశిలోకి ప్రవహించిన తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. నల్లగొండ తీరంలో 28 స్నానఘట్టాలు, మహబూబ్‌నగర్‌తీరంలో 52 స్నానఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. జూలై చివరి నుంచి ఆగస్టు 11వ తేదీవరకు గోదావరికి అంత్యపుష్కరాలు జరుగనున్నాయి. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మే మొదటివారంలో క్షేత్రపర్యటన చేయనున్నారు. స్నానఘట్టాల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలను పర్యవేక్షించనున్నారు. గోదావరి అంత్యపుష్కరాలు, కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని 14 శాఖలు ఈ పుష్కరాల నిర్వహణలో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కృష్ణా పుష్కరాల పనులను పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు గోదావరి పుష్కరాల సందర్భంగా రూ.100 కోట్లు గ్రాంటు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణపై వివక్ష చూపింది. ఈ నేపథ్యంలో ఈసారి పుష్కరాలకు నిధులు దక్కించుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మహిమాన్వితమైనదిగావిరాజిల్లుతున్న జోగులాంబ దేవస్థానాన్ని ఈ పుష్కరాల సందర్భంగా వైభవోపేతంగా తీర్చిదిద్దనున్నారు. కర్ణాటక -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోనున్న కృష్ణ గ్రామంలోని శైవక్షేత్రంలో మరమ్మతులు చేపట్టారు. వాడపల్లి సంగమస్థానంలోని నరసింహస్వామి, శైవక్షేత్రాలు, మట్టపల్లి నరసింహస్వామి దేవాలయాన్ని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు.

2377
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS