చెరువు నిండాలి.. చేను పండాలి


Tue,February 19, 2019 03:24 AM

cm kcr order To submit a comprehensive report on irrigation

- వాగులు, వంకలు పునర్జీవం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
- చిన్న నీటి వనరుల్లో 265 టీఎంసీల నీటిని వాడే పరిస్థితి రావాలి
- తూముల నిర్మాణం, ఫీడర్ ఛానెళ్ల పునరుద్ధరణకు వెంటనే అంచనాలు
- రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలోని ప్రతి చెరువు ఏడాదిలో కనీసం 10 నెలలపాటు జలకళతో ఉట్టిపడటంతోపాటు వాగులు, వంకల పునర్జీవానికి కృషిచేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం వెంటనే కార్యాచరణ మొదలుపెట్టాలని ఇంజినీర్లకు స్పష్టంచేశారు. మైనర్ ప్రాజెక్టులు, చెరువుల అనుసంధానం, వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణం తదితరల అంశాలపై క్షేత్రస్థాయిలో ఇంజినీర్లకు అవగాహన కల్పించాలని, వారంరోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జలసౌధలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ జయప్రదం కావాలంటే చెరువుల్లో కనీసం పది నెలల పాటు నీరు నిల్వ ఉండాలని, భూగర్భజలాలు పైకిరావాలని, రెండు పంటలకు నీరందాలని చెప్పారు. చెరువులను భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేసినపుడే ఇది సాధ్యమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారన్నారు. తెలంగాణ జీవధార అయిన కాళేశ్వరం ప్రాజె క్టు నుంచి ఈ ఏడాదిలోనే నీరు విడుదలవుతుందని, ఏడాది చివరినాటికి మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పా రు. వీటిని చెరువులతో అనుసంధానం చేయ డం ద్వారా రెండు పంటలకు నీరవ్వవచ్చ ని పేర్కొన్నారు. గోదావరి బేసిన్‌లో 175 టీఎంసీలు, కృష్ణా బేసిన్‌లో 90 టీఎంసీలు మొత్తం 265 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేశారని వివరించారు. ప్రాజెక్టుల ద్వారా భూములకు నీరందుతుందని, వాటినుంచి వచ్చే పడవాటి నీరు తిరిగి వాగుల్లోకి చేరుతుందని చెప్పారు. వీటిని నిల్వ చేసుకోగలిగితే వాగులు పునర్జీవం చెంది, భూగర్భజలాలు రీచార్జి అవుతాయని, అనేక రకాలుగా వినియోగంలోనికి వస్తాయన్నారు. ఈ పడవాటి నీటిని, వర్షపు నీటిని ఒడిసిపట్టడానికిచెక్‌డ్యాంలు నిర్మించాలని ఆదేశించారు.

ఎక్కడికక్కడ తూములు

భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వలతో చెరువులకు అనుసంధానించే ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ విజయప్రకాశ్ సాంకేతిక అంశాలను వివరించారు. సీఎం సూచించిన ఈ రెండు కార్యక్రమాల అమలుకోసం ఎన్‌ఆర్‌ఎస్‌ఏ ఉపగ్రహ చిత్రాల సహకారంతో విస్తృత అధ్యయనం చేశామన్నారు. రాష్ట్రంలో 559మండలాల్లో సుమారు 48,845 చిన్న నీటి వనరులున్నట్టు గుర్తించామని, వీటిలో 27,814 చెరువులు, కుంటలు 12,154 గొలుసుకట్లు ఉన్నట్టు తేలిందన్నారు. ఈ చెరువులను నింపడానికి ప్రాజెక్టుల కాల్వలకు ఎక్కడికక్కడ తూములు నిర్మించాలని, వీటిపై స్పష్టతకు రావాలని ఇంజినీర్లకు సూచించారు. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానానికి సమగ్ర మార్గనిర్దేశాలు తయారుచేసి త్వరలోనే క్షేత్రస్థాయి ఇంజినీర్లకు అందజేస్తామన్నారు. ఇప్పటికే ప్రతి మండలానికి ఒక ఇరిగేషన్ చిత్రపటాన్ని రూపొందించి అందించామని, వాటి ఆధారంగా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయానికి రావాలని సూచించారు. ముందుగా తూముల నిర్మాణానికి, ఫీడర్ చానళ్ల పునరుద్ధరణకు అంచనాలు రూపొందించే పని చేపట్టాలన్నారు. ప్రతి చెరువుకు ఫీడర్‌ఛానెల్ ఉన్నందున వీటికి భూసేకరణ అవసరం లేదని, అంచనాల్లో చేర్చవద్దని స్పష్టంచేశారు. రాష్ట్రం మొత్తంలో ఉండే నదులు, వాగులు, వంకలను ఎనిమిది స్థాయిల్లో వర్గీకరించామని, 4-8 స్థాయి కలిగిన వాగులు రాష్ట్రంలో 683 ఉన్నాయని, వాటి పొడవు 12,183 కి.మీలుగా ఉన్నదన్నారు. ముందుగా ఈ వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదించాలని సూచించారు. స్థల ఎంపిక దగ్గరి నుంచి ప్రతి దశలోనూ భూగర్భజల శాఖతో సమన్వయం చేసుకోవాలని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కాడా డిప్యూటీ డైరెక్టర్ స్నేహ, మైనర్ ఇరిగేషన్ డీసీఈ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

1440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles