బోనమెత్తిన లష్కర్


Mon,July 22, 2019 02:49 AM

CM KCR offers prayers at Sri Ujjaini Mahankali Temple

-భక్తుల సందడితో ఉప్పొంగిన మహంకాళి ఆలయం
-అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు అల్లోల, తలసాని
-కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు
-అమ్మవారికి బోనం సమర్పించిన కవిత

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బోనాలమ్మ బోనాలు.. మహంకాళి బోనాలు.. ఆదివారం అన్ని తొవ్వలూ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం వైపే అన్నట్లు భక్తుల సందడితో లష్కర్ ఉప్పొంగిపోయింది. జాతర, బోనాల ఉత్సవాలు భక్తజన సందోహం నడుమ కన్నుల పండువగా జరిగాయి. సీఎం కేసీఆర్, మంత్రులు అల్లోల, తలసాని.. అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఒగ్గుడోలు, కురుమ డప్పుల దరువులకు పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో లష్కర్ పరిసరాలన్నీ మార్మోగిపోయాయి. జాతర స్వాగత తోరణాలు ఆకర్షణగా నిలిచాయి.

భక్తుల రాకపోకలు, ఫలహారబండ్లు, ఘటాలు, ఊరేగింపులతో ఆలయ పరిసర వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆలయాన్ని పూలతో.. విఘ్నేశ్వరుడు, డమరుకం, అమ్మవారి కండ్లు, శూలం కనిపించేలా ప్రత్యేకరీతిలో అలంకరించారు. లోపలిభాగాన్నంతా అమ్మవారికి ఇష్టమైన వేలాడే బోనాలు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. సికింద్రాబాద్ పరిధి లోని భక్తులంతా అమ్మవారికి బంగారు, వెండి, మట్టి కుండలలో బోనాలను సమర్పించారు. కొందరు భక్తులు బోనంపై బోనం (మూడు మెట్లు, రెండు మెట్ల బోనాల్ని) పెట్టుకొని నృత్యం చేసుకుంటూ వచ్చి అమ్మవారికి అత్యంత భక్తితో సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తూనే ఉన్నారు. ఆదివారం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. సికింద్రాబాద్‌లోని వ్యాపారులు తమ కార్యకలాపాలను బంద్ చేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా సహకరించారు.

అమ్మవారిని దర్శించుకున్న సీఎం

ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, హైకోర్టు న్యాయమూర్తి అమర్‌నాథ్‌గౌడ్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ రాంచందర్, మాజీ ఎంపీలు బండారు దత్తాత్రేయ, కల్వకుంట్ల కవిత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కాం గ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. దేవాదాయ కమిషనర్ వీ అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషన్ ఎం రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఎండోమెంట్ అధికారి అన్నపూర్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

k-kavitha

అమ్మవారికి బోనం సమర్పించిన మాజీ ఎంపీ కవిత

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఆమె సాయంత్రం నాలుగు గంటలకు మోండా డివిజన్ ఆదయ్యనగర్‌లోని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసం నుంచి మట్టి కుండతో తయారుచేసిన బోనాన్ని తీసుకెళ్ళారు. ఆదయ్యనగర్ గ్యాస్ మండి నుంచి మహంకాళి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి బోనం సమర్పించారు. ఈ బోనంతోపాటు 1008 బోనాలను కూడా అమ్మవారి ఆలయానికి తీసుకొని వెళ్లారు. మహిళలందరూ తలపై బోనాలతో ఆలయానికి తరలివచ్చారు. ఆదయ్యనగర్ నుంచి బంగారు బోనాన్ని ఊరేగింపుగా తీసుకొనిరాగా కార్పొరేటర్ ఆకుల రూప ఆ బోనాన్ని తలపై ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.

డిప్యూటీ స్పీకర్ ఇంటికి సీఎం కేసీఆర్

ఉజ్జయిని మహంకాళికి పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖ ర్‌రావు.. డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావుగౌడ్ ఇంటికి వెళ్లారు. టకార బస్తీ పరిధిలోని స్థానిక ముత్యాలమ్మ దేవాలయంలో పద్మారావుగౌడ్‌తో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్ టకార బస్తీలోని తన నివాసంలో పద్మారావుగౌడ్ ఏర్పాటుచేసిన విందు లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులకు పద్మారావుగౌడ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు సాదర స్వాగతం పలికారు. పద్మారావు కుటుంబసభ్యులు, మనుమండ్లతో సీఎం కేసీఆర్ కొద్దిసేపు మాట్లాడారు. విందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
G-KISHAN-REDDY

1043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles