పెద్దన్నగా సహకరిస్తా


Tue,August 13, 2019 03:39 AM

cm kcr offers prayer at Athi Varadaraja Swamy temple

-రాయలసీమకు గోదావరి తరలింపు అవసరం
-పట్టుదల ఉన్న సీఎం జగన్‌తో అది సాధ్యం
-రతనాలసీమగా మార్చేందుకు సహకరిస్తాం
-రెండు రాష్ట్రాల అభివృద్ధికి పనిచేస్తాం
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-నగరిలో కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం
-కుటుంబసమేతంగా కంచి అత్తివరదరాజస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
-తిరుగుప్రయాణంలో ఎమ్మెల్యే రోజా ఆతిథ్యం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి పెద్దన్నగా సహకరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాయలసీమ కష్టాలు తనకు తెలుసునని, గోదావరి జలాలు రాయలసీమకు రావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పట్టుదల ఉన్న యువ నాయకుడు జగన్‌తో అది సాధ్యమేనని చెప్పారు. రెండు రాష్ర్టాల అభివృద్ధికి ఇద్దరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. సోమవారం తమిళనాడు కాంచీపురంలోని అత్తివరదరాజస్వామివారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలుచేశారు. ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో కుటుంబసభ్యులతో సహా బయలుదేరి తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో కంచి వెళ్లారు.

cm-kcr2
నగరి నియోజకవర్గం మీదుగా వెళ్లేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా మార్గమధ్యంలో సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. దారిపొడవునా స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పెద్దసంఖ్యలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలిచి.. కేసీఆర్‌ను స్వాగతించారు. కేసీఆర్‌వెంట రోజా కూడా కాంచీపురం వెళ్లారు. అత్తివరదరాజస్వామి ఆలయంలో కేసీఆర్ దంపతులను ఆలయఅధికారులు, వేదపండితులు ఘనంగా స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం కేసీఆర్‌ను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. తిరుగుప్రయాణంలో నగరిలో ఎమ్మెల్యే రోజా.. సీఎం కేసీఆర్‌కు ఆతిథ్యం ఇచ్చారు.
cm-kcr3
ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమకు నీటితరలింపులో తన పూర్తిసహకారం ఉంటుందని చెప్పారు. ఏపీలో క్రియాశీలకంగా, పట్టుదలతో పనిచేసే జగన్ సీఎంగా ఉన్నందున గోదావరి తరలింపు తప్పక సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం గోదావరి నుంచి వెయ్యికిపైగా టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసిపోయాయన్నారు. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఇప్పటికే నిండాయని చెప్పారు. గోదావరి జలాల తరలింపుపై తాను, జగన్ ఇప్పటికే చర్చలు జరిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విషయం కొందరికి జీర్ణం కాకపోవచ్చని అన్నారు. ప్రజల మద్దతు, దీవెన ఉన్నంతకాలం ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని, రాలయసీమను రతనాలసీమగా మారుస్తామని స్పష్టంచేశారు.

cm-kcr4
60, 70 ఏండ్ల తెలుగునేల చరిత్రలో జగన్, తాను కలిసి కొత్త చరిత్రను సృష్టించబోతున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పనిచేస్తామన్నారు. అనంతరం రోడ్డుమార్గంలో రేణిగుంట చేరుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమా ర్తె, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి తదితరులున్నారు. కాంచీపురం పర్యటనలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి కూడా ఉన్నారు. రోజా నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సీఎం కేసీఆర్‌ను కలిశారు. తిరుమల స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీలో చేపడుతున్న సంస్కరణలను వివరించారు.
cm-kcr5

అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

IK-REDDY
రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం కంచి అత్తివరదరాజస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆల య అధికారులు, పూజారులు అల్లోలకు స్వాగతం పలికారు. సతీమణి విజయలక్ష్మితో కలిసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంత్రి కుటుంబసభ్యులను వేదపండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రివెంట ఆయన కుమారుడు గౌతంరెడ్డి, కోడలు దివ్యారెడ్డి ఉన్నారు.

2349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles