గ్రామస్వరాజ్యమే లక్ష్యం


Wed,June 12, 2019 03:13 AM

CM KCR Meet with Newly Elected ZP Chairman and Chairpersons In Pragathi Bhavan

-ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్ కావాలి
-ఆరునెలల్లోనే ఈ మార్పు రావాలి
-అందుకు మీరు ప్రతిజ్ఞ తీసుకోవాలి
-ప్రగతిసాధనలో మీదే క్రియాశీల పాత్ర
-జిల్లాపరిషత్ చైర్మన్లు, వైస్‌చైర్మన్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
-గ్రామీణాభివృద్ధికి దోహదంచేసిన పంచాయతీరాజ్, సహకార ఉద్యమాలు
-మళ్లీ ఆ పూర్వవైభవం సాధించాలి
-లక్ష్యాలు సాధించిన జెడ్పీకి రూ.10 కోట్లు
-32 జిల్లాలూ ఆ నిధులు అందుకోవాలి
-జెడ్పీ చైర్మన్లందరికీ కార్లు కొనిస్తాం
-జెడ్పీ చైర్మన్లు, వైస్‌చైర్మన్లకు త్వరలో శిక్షణ
-పారిశుద్ధ్యం, హరితహారంపై దృష్టిపెట్టాలి
-స్థానికసంస్థల పటిష్టానికి ఆలోచిస్తున్నాం
-మీరు సాధించిన ఏకపక్ష విజయాలు మీ బాధ్యతలను మరింత పెంచాయి: కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అభివృద్ధిలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్‌గా తయారుకావాలని, ఈ మార్పు ఆరునెలల్లో రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తితో గ్రామస్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతిసాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ ఉద్యమం, సహకార ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని గుర్తుచేసిన సీఎం.. ఆ ఉద్యమానికి పూర్వవైభవం రావాలని ఆకాంక్షించారు. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషిచేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్తులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరుచేయనున్నట్లు ప్రకటించారు. జెడ్పీ చైర్‌పర్సన్లకు కొత్త కార్లు కొనిస్తామని చెప్పారు.
CMKCR3
కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, వైస్‌చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణాకార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం జిల్లాస్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కూడా శిక్షణనిస్తామని చెప్పారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్ధిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులో పరిషత్ ప్రజాప్రతినిధులు ముఖ్యభూమిక పోషించాలని కోరారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను ముఖ్యమంత్రి కూలంకషంగా వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. జిల్లా పరిషత్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు పనిచేయబోయే ఈ ఐదేండ్లకాలంలో మంచిపేరు తెచ్చుకోవాలని, మీకు పనిచేసే ధైర్యాన్ని, అభినివేశాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరింకా ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు లభించిన పదవిని ఎంత గొప్పగా నిలబెట్టుకుంటే అంతమంచిది. ఎవరూ పుట్టినప్పుడే అన్నీ నేర్చుకోలేదు. పరిస్థితులనుబట్టి నేర్చుకుంటూపోతారు. మనిషి చివరిశ్వాస విడిచేవరకు కూడా జ్ఞానసముపార్జన చేసుకుంటూపోవాలి. మన జీవితం చాలా చిన్నది. ఆ కాస్త సమయంలోనే మంచిపేరు తెచ్చుకోవాలి. అజ్ఞాని ఏ రోజైనా జ్ఞాని కాగలుగుతాడు కానీ, మూర్ఖుడు జ్ఞానికాలేడు. వాడు తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు. అలాకాకుండా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నవారే తాము ఎంచుకున్న రంగంలో ముందడుగు వేయగలరు. అన్ని విషయాల్లాగానే పంచాయతీరాజ్ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి అని సీఎం ఉద్బోధించారు.

పెట్టుడు గుణాలకంటే, పుట్టుడు గుణం మంచిది

పదవి వచ్చిన తర్వాత మన సహజత్వాన్ని కోల్పోకూడదు. అలాచేస్తే మన వెనుకనున్న జనం నవ్వుతారు. లేనిపోని దర్పం తెచ్చుకోకూడదు. పదవిరాగానే మీరు మారిపోకూడదు. మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. పెట్టుడు గుణాల కంటే, పుట్టుడు గుణం మంచిది అంటారు పెద్దలు. మన వ్యవహారశైలే మనకు లాభం చేకూరుస్తుంది. ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వారు వాటి పరిష్కారంకోసం మీదగ్గరికి వస్తారు. నాయకుల మంచి లక్షణం ఒకరు చెప్పింది వినటం. అదే మీరు చేయండి. వారి సమస్యలను ఓపికగా, సావధానంగా వినండి. వాళ్లను కూచోబెట్టి మర్యాదచేయండి. అప్పుడే వాళ్లకు రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రయత్నం చేయండి. సహజత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తే మంచిపేరు వస్తుంది. మంచిపేరుతోనే ఉన్నతస్థాయి వస్తుంది అని సీఎం అన్నారు.

ప్రజలతో నిత్య సంబంధాలు ఉండాలి

మీలో ప్రతివారు మీమీ సామర్థ్యాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి ఈ పదవుల్లోకి వచ్చారు. ఇదంతా మీమీ సత్ప్రవర్తన వల్లే. మంచిపనులు చేయడానికి పెట్టుబడులు అవసరంలేదు. సరళంగా మాట్లాడటమే ఏ రోజునైనా మనకు పెట్టని కోట. ప్రజాసమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. దీనివల్ల మనకు ఇంకా ఉన్నతావకాశాలు వస్తాయి. విజయాలు, అపజయాలు సర్వసాధారణం. కానీ, రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండటం ప్రాథమిక లక్షణం అని సీఎం చెప్పారు.
CMKCR1

మీ బాధ్యత పెంచిన ఫలితాలు

గతంలో జెడ్పీ చైర్మన్లకు పెద్దగా పనిలేదు. ఇటీవల కేంద్ర ఆర్థికసంఘాన్ని కలిసినప్పుడు మన వ్యవస్థ గురించి వివరించాను. ఇక్కడ జెడ్పీ చైర్మన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఇచ్చామని చెప్పాను. వాళ్లు ఇకముందు క్రియాశీలకంగా పనిచేస్తారని కూడా చెప్పాను. అవసరమైన సహాయం చేస్తామని ఆర్థిక సంఘం అధ్యక్షుడు మాట ఇచ్చారు. ఏ విధంగానైనా మీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆలోచన చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అన్ని అధికారాలు సంక్రమింపజేస్తాం. ఇంత ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ రాలేదు. దాంతోపాటే మీకు బరువు బాధ్యతలు పెరిగాయి. మీ పాత్ర ఉన్నతంగా ఉండాలి. జిల్లాపరిషత్ క్రియాశీలకం కావాలి. మీ విధులు, బాధ్యతలు పటిష్టం కావాలి అని కేసీఆర్ వివరించారు.

కొరవడిన పంచాయతీరాజ్ స్ఫూర్తి

చాలాకాలం పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తితో స్థానికసంస్థలు పనిచేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా ఉండేది. దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్ర వాతావరణం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. గ్రామాల్లో మంచిగా ఏదీ జరుగడంలేదు. పల్లెలు పెంటకుప్పల్లా తయారయ్యాయి. ఎందుకీ క్షీణత? మంచినీళ్ల గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు.. గ్రామాల్లోనే ఉన్నది. గ్రామాలను మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. మీరంతా విద్యాధికులు. పరిస్థితులను అర్థంచేసుకోగలరు. మీరు గ్రామాలను అభివృద్ధిచేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. భయంకరమైన గ్రామాల పరిస్థితుల్లో మార్పురావాలి. అది గుణాత్మక మార్పుకావాలి అని సీఎం ఉద్బోధించారు.

మీ శిక్షణకు కోర్స్ డిజైన్ చేస్తాం

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ విషయంలో అవగాహనకు రావడానికి స్వయంగా ఎన్‌ఐఆర్డీలో శిక్షణకు పోయాను. అక్కడే హాస్టల్లో ఆరురోజులుండి ఏడురోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యాను. అలాపోవడంవల్ల నాకు పూర్తి అవగాహన వచ్చింది. మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరంతా జూలై నెలలో పదవీబాధ్యతలు స్వీకరిస్తారు. ఈలోపు మీరంతా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణకు పోవాలి. దానికి అధికారులు ఒక మంచి కోర్స్ డిజైన్ చేస్తారు అని సీఎం తెలిపారు.

ఆర్నెళ్లలో పూర్తి మార్పు కనపడాలి

గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయతీరాజ్ చట్టం చాలా కఠినంగా ఉన్నది. కార్యదర్శి చక్కగా పనిచేస్తేనే, అనుకున్న ఫలితాలను సాధిస్తేనే, మూడేండ్ల తర్వాత ఆయన సేవలను క్రమబద్ధీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శుల మీద పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోలతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, ఆజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆర్నెళ్లలో పూర్తి మార్పు కనపడాలి. డీపీవోను పరిషత్తుల కిందకు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. గతంలో మాదిరిగా కాకుండా అధికారాలు ఇచ్చే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జెడ్పీలు గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారంపై బాగా దృష్టిపెట్టాలి. పారిశుద్ధ్యంపై అవగాహన కలిగించాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం బాగాలేదు. దృష్టి కేంద్రీకరించి సమస్య పరిష్కారం అయ్యేలాచేయాలి. వందల కోట్లు సంపాదించినా పీల్చుకునే గాలి లేకపోతే ప్రయోజనం లేదు. హరితహారంపై దృష్టిపెట్టాలి. చెట్లు పెంచాలి. గ్రామాల్లో బాగా తిరుగాలి, కష్టపడి పనిచేయాలి అని సీఎం చెప్పారు.

హైదరాబాద్ నుంచే యావత్‌దేశానికి పంచాయతీరాజ్ ఉద్యమం

CMKCR4
పంచాయతీరాజ్ ఒక అద్భుత ఉద్యమం. స్వాతంత్య్రం వచ్చిన ఆరంభ రోజుల్లో దీనికి రూపకల్పనచేశారు. రాష్ర్టాలకు పాలనలో స్వతంత్రత ఉండాలని, అది వికేంద్రీకరణ జరుగాలని స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. కేంద్రీకృత పాలన క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి జరుగాలని ఒక అద్భుతమైన ఉద్యమానికి ప్రాణం పోశారు. దీని మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్‌మెంట్. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న కొత్తరోజుల్లో అమెరికా వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ఐసన్‌హోవర్ ఆయనకు ఎస్కే డే అనే వ్యక్తిని పరిచయంచేశారు. ఆయన భారతీయుడని, గ్రామీణ అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, అవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని నెహ్రూకు చెప్పాడు. ఆయనను అమెరికా అధ్యక్షుడు పొగడటంపట్ల సంతోషం వ్యక్తపరిచిన నెహ్రూ.. భారతదేశానికి రావాలంటూ ఎస్కే డేను ఆహ్వానించారు. నెహ్రూ ప్రథమ పంచవర్షప్రణాళికలో భారతదేశ అవసరాలకు భిన్నంగా సత్వర పారిశ్రామీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం తనకు అభ్యంతరమని, అది తప్పని, మొదలు సాగునీటిరంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్కే డే సూచించారు. ఆహారరంగంలో స్వయంసమృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

నెహ్రూ ఆహ్వానాన్ని తిరస్కరించారు. నెహ్రూ స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత మంత్రి మండలిలో, పార్టీలో ఎస్కే డే సలహాపై చర్చించాడు. ఫలితంగా రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యక్రమం మారింది. ఆధునిక దేవాలయాల పేరిట భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అప్పటి ఆ మార్పువల్ల ఈ రోజున ఆహారరంగంలో స్వావలంబన వచ్చింది. నెహ్రూ తీసుకువచ్చిన మార్పులతో సంతోషించిన ఎస్కే డే భారతదేశానికి వస్తానని నెహ్రూకు లేఖ రాశాడు. అలా ఆయన ఇండియాకు వచ్చాడు. ఆయనను తక్షణమే రాజ్యసభ సభ్యుడిగా, క్యాబినెట్ మంత్రిగా నెహ్రూ నియమించారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ శాఖను కేటాయించి, గ్రామీణ భారతాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. ఎస్కే డే సరాసరి హైదరాబాద్ నగరానికి వచ్చి ఎన్‌ఐఆర్డీలో నివాసం ఏర్పాటుచేసుకున్నారు. హైదరాబాద్ నుంచే యావత్ భారతదేశానికి పంచాయతీరాజ్ ఉద్యమాన్ని విస్తరింపజేశారు. అప్పట్లో ఆయన దేశంలోనే మొట్టమొదటి సమితి (పటాన్‌చెరువు) అధ్యక్షుడిగా పీ రామచంద్రారెడ్డిని నియమించారు. అలా మొదలైంది పంచాయతీరాజ్ ఉద్యమం అని కేసీఆర్ వివరించారు.

అగ్రభాగాన నిలిచే పరిషత్తులకు పదికోట్లు

ఏ జిల్లా పరిషత్ అగ్రభాగాన ఉంటే, ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రు.10 కోట్లు మంజూరుచేస్తాం. ఒకటికంటే ఎక్కువ పరిషత్తులు ముందుకుపోతే వాళ్లకూ మంజూరుచేస్తాం. 32 జిల్లాలు కూడా అగ్రభాగాన నిలువాలి. దీనికి కొన్ని బెంచ్ మార్క్ ప్రమాణాలు ఏర్పాటుచేస్తాం. అందరూ కలిసి మొత్తం రు.320 కోట్లు పొందాలనేది నా కోరిక. ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్‌కు కొత్త కారు కొనిస్తాం. మీరు చాలా మంచి మార్పు తీసుకురాగలమన్న భావన ప్రజల్లో తీసుకురాగలిగితే అంతకన్నా గొప్ప లేదు. ప్రజల్లో బాగా తిరిగి పంచాయతీరాజ్ సంస్థను బలోపేతం చేయాలి. క్రియాశీలకంగా ఏ గ్రామానికి ఆ గ్రామమే అభివృద్ధి జరుగాలంటే మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు నాయకత్వం వహించాలి. మీ కిందివారికి స్ఫూర్తి కావాలి. ఎలాగైతే తెలంగాణ సాధించామో అలాగే గ్రామాల అభివృద్ధి జరుగాలి అని సీఎం జెడ్పీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు ఉద్బోధించారు.
CMKCR2

ప్రజల రుణం తీర్చుకోవాలి

మన ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఆదరణ పొంది, ఎన్నికల్లో మన విజయానికి కారణమయ్యాయి. అందుకే మనం వాళ్ల రుణం తీర్చుకోవాలి. దీనికి ఎక్కువ పాత్రధారులు మీరే. మండలాధ్యక్షులను మీలాగే తయారుచేయండి. నాలాగా మీరు కూడా వారికి అవగాహన కలిగించాలి. మీరు సందేశాత్మకంగా మాట్లాడాలి. ఆ స్థాయి రావడానికే మీకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ఏ ఉద్యమస్ఫూర్తితో ఎస్కే డే పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రారంభించాడో, దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. 60% జనాభా ఉన్న గ్రామీణ ప్రజలకు మీరు నాయకత్వం వహించాలి. గ్రామాలను పట్టుగొమ్మల్లాగా చేయడంలో నిమగ్నమైపోవాలి. అలాచేసి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. గొప్పపేరు సంపాదించుకోండి. అందులో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. గ్రామీణ తెలంగాణను అన్ని రకాలుగా బాగుచేయడానికి మీ శక్తియుక్తులను ఉపయోగించండి. ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి, ఒక అంకాపూర్, ఒక ముల్కనూర్ కావాలి అని సీఎం ఆకాంక్షించారు. సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పరిషత్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను వారి స్థానాల దగ్గరికిపోయి కలిసి, ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించారు. వారందరితో కలిసి భోజనంచేశారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఏ జీవన్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, నల్లాల ఓదెలు, ఉమామాధవరెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

పదవి వచ్చిన తర్వాత మన సహజత్వాన్ని కోల్పోకూడదు. పెట్టుడు గుణాల కంటే, పుట్టుడు గుణం మంచిది అంటారు పెద్దలు. మన వ్యవహారశైలే మనకు లాభం చేకూరుస్తుంది. ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వారు ఆ సమస్యల పరిష్కారానికి మీ దగ్గరకు వస్తారు. వారి సమస్యలను ఓపికగా, సావధానంగా వినండి. వాళ్లను కూచోబెట్టి మర్యాద చేయండి. ఆ తర్వాత వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రయత్నం చేయండి.
-జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల సమావేశంలో సీఎం కేసీఆర్

3045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles