కాల్వలను సిద్ధం చేయాలి


Sat,May 25, 2019 02:57 AM

CM KCR holds review meeting on Kaleshwaram project

-తెలంగాణలో ఇక నిరంతర నీటి ప్రవాహం
-కాల్వల నిర్వహణకు సమగ్రవ్యూహం కావాలి
-అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
-జూలై నుంచే కాళేశ్వరం నీటి ఎత్తిపోత ప్రారంభం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఇప్పటిదాకా కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఇకపై నిరంతరం నీటి ప్రవాహం ఉంటుందని, దీనికి తగినట్లుగానే కాల్వల నిర్వహణ కోసం సమగ్రవ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బరాజ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, తూములను నిర్వహించడానికి సర్వసన్నద్ధం కావాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఇప్పటివరకు కరువు ప్రాంతం. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల. శ్రీరాంసాగర్ ప్రా జెక్టు కాల్వలతోపాటు, ఇతర కాల్వలలో మూడునాలుగేండ్లకు ఒకసారి నామమాత్రంగా నీళ్లు వచ్చేవి.

దీంతో నీటి ప్రవాహాన్ని పంటపొలాల వరకు తరలించేందుకు అనుగుణంగా కాల్వల నిర్వహణను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పట్నుంచి పరిస్థితి పూర్తిగా మారుతుంది. తెలంగాణలో వర్షం పడకున్నా సరే, ప్రాణహిత ద్వారా గోదావరిలోకి పుష్కలంగా నీళ్లు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవుతుంది. మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం ద్వారా మిడ్‌మానేరు, ఎల్లంపల్లి.. అక్కడి నుంచి అటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, ఇటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు నీరు పంపింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తం కావాలి అని సీఎం అన్నారు.
KCR-REVIEW
మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు నింపుతామని, ఆ జలాశయాల్లో గేట్లు, తూములు ఎలా ఉన్నాయో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని చెప్పారు. ఎప్పుడంటే అప్పుడు గేట్లు తీసి.. మళ్లీ మూసేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వరద కాలువతోపాటు కాకతీయ, లక్ష్మీ, సరస్వతి, గుత్ప, అలీసాగర్ కాల్వలన్నింటినీ సిద్ధంచేయాలని సూచించారు. ఈ కాల్వల తూములు, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు ఎలా ఉన్నాయో పరిశీలించి, అవసరమైన మరమ్మతులను వచ్చే 20 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు.

దీనికి కావాల్సిన నిధులను వెంటనే విడుదలచేస్తామని, నీటి మళ్లింపు పనులను పర్యవేక్షించేందుకు అవసరమైన లస్కర్లను నియమించుకోవాలని చెప్పారు. కాల్వల మొదటి నుంచి చివరివరకు కూడా నీటి ప్రవాహానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను సర్వసన్నద్ధం చేయాలని, కాల్వల వెంట పూర్తి సామర్థ్యంతో నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టి రెండువైపులా గట్లు పటిష్ఠంగా ఉండేట్లు చూడాలని పేర్కొన్నారు. దీనికోసం నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో వర్క్‌షాపు ఏర్పాటుచేసి, విధానాన్ని ఖరారుచేయాలని సీఎం చెప్పారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి రిజర్వాయర్లకు తరలించే క్రమంలో కొన్ని బాలారిష్టాలు ఎదురవుతాయి.

వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలి. బరాజ్‌ల నుంచి రిజర్వాయర్లకు, చెరువులకు నీళ్లు పంపించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. బరాజ్‌ల నుంచి రిజర్వాయర్లకు నీరు అంది.. వాటినుంచి పంటపొలాలకు నీరు చేరేవరకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అప్రమత్తంగా ఉండి, ఎక్కడికక్కడ పనులు నిర్వహించాలి అని సీఎం చెప్పారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్, హరేరాం, సీఈలు ఖలేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

3642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles