జీవిక భూమికగా బడ్జెట్


Sun,January 13, 2019 02:49 AM

CM KCR holds review meeting on budget preparation

-ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందాలి
-రాష్ర్టాభివృద్ధిని సులభతరం చేయాలి
-మన ఆర్థిక వనరులపై పూర్తి అంచనాతో బడ్జెట్ సిద్ధంచేయాలి
-నీటిపారుదలరంగానికి ప్రాధాన్యం
-పర్యాటక కేంద్రంగా కాళేశ్వరం
-ఆదర్శంగా ప్రైవేట్ వర్సిటీ విధానం
-వ్యవసాయ ఆధునీకరణపై విధివిధానాలు
-హైదరాబాద్‌కు విశ్వనగర మాస్టర్ ప్లాన్
-అందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు
-క్యాబినెట్ రూపొందిన వెంటనే..మంత్రులకు, అధికారులకు ప్రత్యేక శిక్షణ
-కేంద్ర ఆర్థికసంఘం తీరుమార్చుకోవాలి
-ముందస్తు అభిప్రాయాలతో రాష్ర్టాలకు రావడం మంచిదికాదు: సీఎం కేసీఆర్
-కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై ప్రజల్లో అసంతృప్తి
-రాష్ట్ర ప్రగతిని దేశప్రగతిగా పరిగణించాలి.. దేశంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీ
-రాష్ర్టాలను కించపరిచేలా కేంద్రం వైఖరి.. కనుమరుగవుతున్న రాజ్యాంగ సంబంధం
-ఉన్నతస్థాయి సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజల జీవికను నిర్వచించుకొని, వారి అవసరాలను అన్ని రంగాల్లో పరిశీలించిన మీదటనే తుది బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ నేడు ఎక్కడ ఉన్నది.. రానున్న ఐదేండ్ల తరువాత ఎక్కడ ఉండబోతున్నది అన్న అవగాహనతో.. అంచనాతో బడ్జెట్‌ను రూపొందించాలన్నారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక సంఘం దేశ ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు నడుంబిగించాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. మూసపద్ధతిలో కాకుండా తన పాత్రను కేంద్ర ఆర్థికసంఘం వినూత్నంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో పదిహేనో ఆర్థిక సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ, ఇతర సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో కీలక సమీక్షాసమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన ఏర్పాట్లు.. అందు కు ముందుగా అవసరమైన చర్యలమీద సీఎం సమీక్షించారు. మనం రూపొందిస్తున్న బడ్జెట్ విధివిధానాలు ఒక్క ఏడాదికా.. లేక ఐదేండ్ల పూర్తికాలానికా అన్న అవగాహన కలిగి ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కేవలం చట్టాలను అమలుపరుచడమే కాకుండా రాష్ర్టాభివృద్ధిని సులభతరంచేస్తూ ఒక ఉత్ప్రేరకంగా, ఉద్దీపనకారిగా తన పాత్రను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ తయారీకి ముందే ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని అన్నారు. ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పనిని విభజించి సమస్యను ఛేదించే వ్యవస్థలను ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు రూపొందించే బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరింత బలోపేతంచేసే దిశగా ఉండాలని స్పష్టంచేశారు.

తెలంగాణ ఒక రాష్ట్రంగా తన అభివృద్ధిని పెంచుకోవడానికి ప్రగతిమార్గంలో పయనించడానికి, అవలంబించాల్సిన మార్గదర్శకాలేమిటి.. మన ఆర్థిక ప్రగతికి దోహద పడుతున్న అంశాలేమిటి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్‌ను తయారుచేయాలని సూచించారు. సీఎంగా నన్ను ప్రజలు ఎన్నుకున్నపుడు నేను వారికి ఎంత గొప్పగా సేవలందించగలనో ఆలోచన చేయాలె. ఆదరాబాదరాగా కాకుండా ముందుగా ఒక సమగ్ర అవగాహనకు వచ్చిన తర్వాతనే బడ్జెట్ తయారీకి పూనుకోవాలి. బడ్జెట్‌రూపకల్పనలో పాలుపంచుకొనే వ్యక్తులు, అధికారులు ఆ దిశగా దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలి. మనకున్న బలాలేమిటి, బలహీనతలేమిటి? అన్న మంచి చెడులను బేరీజు వేసుకున్న అనంతరమే పని ప్రారంభించాలి. రాబోయే ఐదేండ్ల కాలంలో రాష్ర్టానికి ఎంతడబ్బు వస్తుంది, ఎంత ఖర్చు కాబోతున్నదో అనే ఒక సమగ్ర అంచనా ఉండాలి అని సీఎం కేసీఆర్ సూచించారు.

అనుమతుల సాధన గొప్పకార్యం

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర శాఖలను సోదాహరణంగా పేర్కొన్న సీఎం కేసీఆర్.. ఆయాశాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధంచేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకోసం బడ్జెట్‌ను రూపొందించే క్రమంలో ముందుగా గత నాలుగేండ్ల కాలంలో ఎంత ఖర్చు చేసింది, వచ్చే ఐదేండ్లలో ఎంత ఖర్చు చేయనున్నది అనే అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న ఐదేండ్ల కాలానికి.. మొత్తంగా నీటిపారుదలశాఖ కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం నుంచి అన్ని సాగునీటి ప్రాజెక్టులకు అన్నిరకాల అనుమతులను సాధించడం గొప్ప కార్యమని అది బడ్జెట్‌లో ప్రతిఫలించాలని చెప్పారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన ఉదాహరణను ప్రస్తావించిన సీఎం.. అది ఎంత గొప్పగా ప్రజాదరణ పొందిందో తెలిపారు. దాంతోపాటు చేపల పెంపకం, చేనేతరంగం రాష్ట్రంలో పురోగతిని సాధిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో నేత కార్మికుల కళను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. విద్యుత్ సగటు వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

పర్యాటక ప్రాంతంగా కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టును మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆకర్షణీయమైన పర్యాటక, భక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి విధానాలను అనుసరించాలో బడ్జెట్ రూపొందించే క్రమంలో సూత్రప్రాయంగా తగు సూచనలుచేస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడి త్రివేణి సంగమం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారబోతున్నదన్నందున.. పర్యాటక ప్రయోజనాల మీద బడ్జెట్ దృష్టి కేంద్రీకరించాలన్నారు. యూనివర్సిటీ పరిశోధనలతోపాటుగా వ్యవసాయాన్ని ఆధునీకరించే అంశాలపై అధికారులు విధివిధానాలను రూపొందించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలో ఆలోచించాలని కోరారు. విద్య, వైద్య రంగాలను ప్రస్తావించిన సీఎం కేసీఆర్ ప్రైవేటు యూనివర్సిటీల వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలించాలన్నారు. ఇతర రాష్ర్టాలకు వలస పోకుండా రాష్ట్రంలోనే విద్యావవస్థను ఆకర్షణీయంగా, అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేదిశగా విధివిధానాలను రూపొందించాలని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ సాధనదిశగా మానవీయ కోణంలో బడ్జెట్ విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అవసరాలను, మౌలిక సదుపాయాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ అంచనాలను రూపొందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుద్ధిచేసిన పరిశుభ్రమైన తాగునీరు లభిస్తున్నదని, అది రాష్ర్టాభివృద్ధికి సూచిక అని సీఎం పేర్కొన్నారు.

మంత్రులకు, సెక్రటరీలకు శిక్షణ

క్యాబినెట్ రూపొందిన వెంటనే మొత్తం మంత్రులకు ఆయాశాఖల కార్యదర్శులకు వారి విధులు బాధ్యతలమీద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆధ్వర్యంలో సునిశిత శిక్షణాకార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంతోసహా దేశ ఆర్థిక వ్యవహారాలు, సచివాలయ విధి విధానాలు, బడ్జెట్ రూపకల్పన నిబంధనలు, వాటి పరిమితులు, ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆయా మంత్రిత్వ శాఖల్లో చేపట్టే కార్యక్రమాలన్నీ సంబంధిత మంత్రులకు తెలిసేలా శిక్షణ ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.
CMKCR1

ఆర్థికసంఘం మూసపద్ధతిని వీడాలి

భారత ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్థిక సంఘం నడుం బిగించాల్సి ఉందని, మూస పద్ధతిలో కాకుండా.. తన పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఫైనాన్స్ కమిషన్ పాత్రపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ర్టాలలో పర్యటించే క్రమంలో ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ముందే ఒక అభిప్రాయాన్ని కలిగిఉండటం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, క్షేత్రస్థాయి పర్యటనకు ముందే ఒక అవగాహనతో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చేయడం సరైన విధానం కాదన్నారు. ఒక్కో రాష్ర్టానికి ఒక్కో సాంస్కృతిక, ఆర్థిక, జీవనవిధానం ఉంటుందని.. ఆయా రాష్ర్టాల అవసరాలరీత్యా డివల్యూషన్ అంశం రాష్ర్టాల హక్కుగా పరిగణించి.. విధానాల రూపకల్పనకు మాత్రమే ఫైనాన్స్ కమిషన్ పరిమితమైతే మంచిదని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ పరిశీలించి.. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికసంఘానికి అందించే నివేదికను రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

రాష్ర్టాలను కించపరిచేలా కేంద్రం వైఖరి

దేశానికి విశాలమైన విత్త విధానం ఉన్నది. వికేంద్రీకరణ చేయాల్సిన అధికారాలను.. అందుకు విరుద్ధంగా కేంద్రీకరించారు. పురోగతి సాధిస్తున్న రాష్ర్టాల విధానాల్లో జోక్యంచేసుకోవద్దని నేను నీతిఆయోగ్ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు స్పష్టంచేశాను. రాష్ట్ర ప్రగతిని దేశ ప్రగతిగా పరిగణించాలి. పురోగతి సాధిస్తున్న రాష్ర్టాలను నిరుత్సాహపర్చొద్దు. చిన్న చిన్న నిధులను విడుదల చేయడానికి కూడా అనేక నిబంధనలను విధిస్తున్నారు. రాష్ర్టానికి, కేంద్రానికి నడుమ ఉండాల్సిన రాజ్యాంగ సంబంధం రోజురోజుకూ కనుమరుగవుతున్నది. రాష్ర్టాల అధికారాలు, హక్కుల పంపిణీ విషయంలో కేంద్రం వైఖరి రాష్ర్టాలను కిం చపరిచేవిధంగా ఉండటం అత్యంత విచారకరం అని సీఎం కేసీఆర్ అన్నారు. సమావేశంలో ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, స్మితాసబర్వాల్, సందీప్ సుల్తానియా, మానిక్‌రాజ్, స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారీ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ సెక్రటరీ వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, ఐటీ సెక్రటరీ జీటీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

వెన్నెముక హైదరాబాద్

హైదరాబాద్ గ్లోబల్ సిటీ. దేశంలోని ఐదు పెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నగరంలో కనీసం 100 పార్కుల అవసరం ఉన్నది. హైదరాబాద్‌ను రక్షించడానికి, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్‌ప్లాన్ తయారుచేయాలి. అందులో ఒక్క పేరాను మార్చాలంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకునేంత స్థిరంగా నియమావళి రూపొందించాలి. రాబోయే ఐదేండ్ల కాలంలో హైదరాబాద్‌ను అద్భుతమైన గ్లోబల్‌సిటీగా రూపొందించే దిశగా, ఎంత ఖర్చు చేయాల్సి ఉన్నదో, బడ్జెట్ ప్రతిపాదనలు ప్రతిఫలించాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ వెన్నెముక వంటిది అని సీఎం కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలే మూలకారణం

స్వాతంత్య్రకాలం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చినాయి.. పోయినాయి.. కానీ ఎటువంటి గుణాత్మక మార్పును తీసుకురాలేకపోయాయని, ఈ నేపథ్యంలో తిరిగి లోతైన విశ్లేషణ, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ విధానాలపట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో నిరసన వ్యక్తంచేస్తుండటం విచారకరమని పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ అనే రెండు రాజకీయ వ్యవస్థలే మూలకారణమని స్పష్టంచేశారు.

4984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles