22న చింతమడకకు సీఎం కేసీఆర్!


Sat,July 20, 2019 03:17 AM

CM KCR Chintamadaka Tour Schedule Fixed July 22

- గ్రామంలో ముమ్మరంగా ఏర్పాట్లు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ తన స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామానికి సోమవారం (ఈ నెల 22న) రానున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చింతమడకకు ఓటువేయడానికి వచ్చినప్పుడు త్వరలోనే మళ్లీ వస్తా.. మీతో ఒక రోజంతా గడుపుతానని గ్రామస్థులకు మాటిచ్చారు. అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో.. గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలు చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఇటీవల రూ.10 కోట్లు విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్, పోలీసు కమిషనర్‌తో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రతి 30 ఇండ్లకు ఇంచార్జిగా ఓ అధికారి

అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, జేసీ పద్మాకర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిన అధికారులే ఇంటింటికీ వెళ్లి సీఎం సభకు హాజరయ్యే గ్రామస్థులకు గులాబీ రంగులో ఐడీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. అధికారులకు తెలుపు రంగు, మీడియా ప్రతినిధులకు ఆకుపచ్చ రంగు ఐడెంటి కార్డులు ఇస్తారని తెలిపారు. గ్రామంలోని 630 ఇండ్లను విభజించి.. ప్రతి 30 ఇండ్లకు ఒక ఎంపీడీవోతోపాటు అదనంగా మరో ప్రత్యేకాధికారిని నియమించామని, సీఎం కేసీఆర్ పర్యటన సమయంలో ఆ ప్రజల బాధ్యత సంబంధిత అధికారిదేనని చెప్పారు. గ్రామంలో పెండింగ్ పనులపై పలుశాఖల అధికారులతో హరీశ్‌రావు చర్చించారు.
Chintamadaka1

476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles