2630 రైతు వేదికలు


Fri,February 23, 2018 02:48 AM

CM KCR announces formation of Rythu Samanvaya Samithi in Pragathi Bhavan

200 కోట్ల మూలధనంతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి
-రైతు వేదికల నిర్మాణ బాధ్యతలు మండల సమితులకు
-రైతు అవగాహన సదస్సులు, చర్చలు వీటిలోనే నిర్వహణ
-సమితుల్లో 51% బలహీనవర్గాలు, మహిళలు
-ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
-ప్రాంతీయ రైతుసదస్సులు, సమితుల నిర్మాణం, విధులపై ప్రగతిభవన్‌లో సమీక్ష
-రాష్ట్ర సమన్వయ సమితిలో గరిష్ఠంగా 15 మంది రైతు ప్రతినిధులు
-చైర్మన్‌గా వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి

CMKCR
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో 2,630 రైతు వేదికలను నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రైతులకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించడానికి, వారు చర్చించుకుని అభిప్రాయాలను పంచుకోవడం కోసం ఈ వేదికలను వినియోగించాలని పేర్కొన్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలను వీలైనంత త్వరగా నిర్మించాలని ఆయన నిర్దేశించారు. రైతు ప్రయోజనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతు సమన్వయసమితులను ఏర్పాటుచేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ రూ.200 కోట్ల మూలధనంతో రాష్ట్ర రైతు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ వెంటనే జీవో కూడా వెలువడింది. అదేవిధంగా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేయాలని ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. రైతు సమన్వయ సమితుల నిర్మాణం, విధులు, బాధ్యతలు, ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ప్రాంతీయసదస్సుల గురించి గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. రైతు వేదికల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను జిల్లా కలెక్టర్లు ఎంపిక చేయాలని, ప్రభుత్వ భూముల నుంచి లేదా కొనుగోలు చేసి సేకరించాలని ఆదేశించారు.

వేదికల నిర్మాణ బాధ్యతలను మండల రైతు సమన్వయ సమితులు తీసుకోవాలని సూచించారు. రూ.200 కోట్ల మూలధనంతో తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయసమితి పేరిట ఏర్పాటుచేసే కొత్త కార్పొరేషన్ వ్యవసాయాభివృద్ధికి, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో కృషిచేస్తుందని, లాభాపేక్షలేని సంస్థగా పనిచేస్తుందని అన్నారు. రైతు కార్పొరేషన్‌కు సమకూరిన నిధులను నిర్దేశిత లక్ష్యాల సాధన కోసమే వినియోగించాలని సీఎం స్పష్టంచేశారు. గ్రామ, మండల రైతు సమన్వయసమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్రస్థాయి సమన్వయసమితులు ఏర్పాటవుతాయని చెప్పారు. విత్తనం వేసిన దగ్గర నుంచి పంటలకు మద్దతు ధర వచ్చేవరకు ప్రతి దశలోనూ రైతు సమన్వయ సమితులు చురుకైనపాత్ర పోషించేలా వాటికి విధులు, బాధ్యతలు ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కనీసం 51% బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా రైతు సమితుల నిర్మాణం జరుగుతుందన్నారు. 25, 26 తేదీల్లో జరిగే ప్రాంతీయ సదస్సులకు మండలసమితుల సభ్యులతోపాటు ఆయాజిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు కూడా హాజరుకావాలని సీఎం ఆదేశించారు. సమీక్ష సమవేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, విప్ పల్లారాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బీ వినోద్‌కుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్కసుమన్, అడ్వకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్‌రావు తదితరులు హాజరయ్యారు.

2915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles