జలస్వప్న వీక్షణ


Thu,December 7, 2017 04:25 AM

CM KCR 3 Days Tour in Karimnagar District from Today to Review Kaleshwaram Project Works

kaleshwaramproject

-నేడు, రేపు కాళేశ్వరం పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
-గోదారికి కొత్త నడక నేర్పిన అపర భగీరథుడు
-2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన
-19 నెలల తర్వాత మేడిగడ్డకు కేసీఆర్
-ఇచ్చిన మాట ప్రకారం రెండేండ్లలోపే తరలనున్న జలాలు


kaleshwaramproject
తెలంగాణ ఏర్పడేవరకు ఈ గడ్డమీద ఒడిసిపట్టే గోదావరి జలాలు.. పట్టుమని వంద టీఎంసీలు కూడా ఉండవు! అదీ.. గోదారి మహారాష్ట్ర చెర వీడి దిగువకు పరవళ్లు తొక్కితేనే! భవిష్యత్తుపై ఇంకో ఆశ కూడా లేదు. కానీ ఇప్పుడు?! గోదావరి నాడి పట్టి.. ఎక్కడ నీటి లభ్యత ఉందో అక్కడ జలాలను నిలువరించి బీడు భూములకు మళ్లిస్తున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహా ప్రయత్నం సాకారమవుతున్న సంబురం! రాజకీయ కుట్రలను చీల్చిచెండాడుతూ.. రీడిజైనింగ్ అస్త్రంతో తెలంగాణ సాగునీటి చరిత్రలో మొదలవుతున్న కొత్త అధ్యాయం! తాను డిజైన్‌చేసిన ప్రాజెక్టు పనులను.. తన స్వప్నం సాకారం అవుతున్న తీరును కండ్లారా చూసేందుకు ముఖ్యమంత్రి మరికొద్ది గంటల్లోనే క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరుతున్నారు! ప్రాణహితను కాళేశ్వరం రూపంలో.. ఇంద్రావతిని తుపాకులగూడెం రూపంలో ఒడిసిపట్టి తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసేందుకు రేయింబవళ్లు జరుగుతున్న ప్రాజెక్టుల పనులను రెండ్రోజులపాటు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రస్థానంపై.. నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం!!

routemap
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టుల నిర్మాణం జరిగి తీరుతుంది. వచ్చే రెండున్నర ఏండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. దీంతో ఉత్తర తెలంగాణలో ఉన్న సకల దరిద్రాలు దూరమవుతాయి..!! దాదాపు 19 నెలల కిందట.. మే 2, 2016న కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్న మాటలివి! ఆ మాటలు.. ఇప్పుడు వాస్తవరూపం దాల్చుతున్నాయి. అంతర్రాష్ట్ర ఒప్పందాలతో ముడిపడి ఉన్న మేడిగడ్డ బరాజ్‌కి మహారాష్ట్ర ఒప్పందంతో మార్గం సుగమం చేయడంతోపాటు.. అటు ప్రతిపక్షాలు, మరికొందరు వివిధ రూపాల్లో ప్రాజెక్టును అడ్డుకునేందుకు చేసిన కుట్రలన్నింటినీ విచ్ఛిన్నం చేశారు. సీఎం కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే.. మనసుంటే మార్గముంటదన్నట్లు.. తెలంగాణ దరిద్రాలను తీర్చాలనే ధృఢసంకల్పం ఉండబట్టే శంకుస్థాపన సమయంలో అన్న మాటలను ఆచరణ లో చూపించగలిగారు. ప్రస్తుతం ఉన్న పనుల పురోగతి దరిమిలా వచ్చే వానకాలం సీజన్‌నాటికి.. అంటే శంకుస్థాపన జరిగిన రెండు సంవత్సరాల్లోనే గోదావరిజలాలను మేడిగడ్డనుంచి మళ్లించే అపురూప ఘట్టాన్ని ఆయన తెలంగాణ సమాజానికి చూపించనున్నారు. ఇం దులో భాగంగానే డిసెంబర్‌లోగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు జలాల తరలింపునకు అవసరమ య్యే పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. అందుకే అధికారులు రా మడుగు పంపుహౌస్‌లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్ డ్రైరన్‌ను ఈ నెల 15న చేపట్టేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు.

storage
ఇంజినీర్‌లా మారిన సీఎం..
తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఆమూలాగ్రం ఔపోసన పట్టిన సీఎం కేసీఆర్.. ఒక ఇంజినీర్‌లా సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను భుజానికెత్తుకున్నారు. దాదాపు ఏడెనిమిది నెలలపాటు వందల గంటలు ప్రత్యక్షంగా అధికారులతో సమీక్ష నిర్వహించినా.. వేల గంటలు ఆయన మథనం చేశారు. ప్రధాన గోదావరి నుంచి తెలంగాణ బీడు భూములకు మోక్షం లభించదనే సత్యాన్ని సుమారు 50 ఏండ్ల లెక్కలను మధించి, గుర్తించారు. అనంతరం కేవలం ప్రాణహిత, ఇంద్రావతి జలాలను ఇప్పటికిప్పుడు అందిపుచ్చుకుంటేనే కోటి ఎకరాల స్వప్నం సాకారం అవుతుందని కాళేశ్వరం పథకాన్ని రూపొందించారు.

సాగునీటి చరిత్రలోనే వినూత్నం
రీడిజైనింగ్‌తో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఇప్పటివరకు సాగునీటిరంగ చరిత్రలో రూపొందించిన ప్రాజెక్టుల డిజైన్‌కు పూర్తి భిన్నమైనది. వినూత్నమైనది. నదీగర్భాన్ని రిజర్వాయర్లుగా మలుచడం, నదీ మార్గాన్ని అలైన్‌మెంట్‌గా మార్చడం దీని ప్రత్యేకత. ప్రాణహిత గోదావరిలోకి కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద జలాల గమనాన్ని మార్చి.. అటునుంచి ప్రధాన గోదావరి మార్గంలోనే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించడమనేది కాళేశ్వరం ప్రాజెక్టుకు జీవనాడిలాంటిది. ఆపై ఎల్లంపల్లి నుంచి జలాలను ఎస్సారెస్పీ వరదకాల్వను వినియోగించుకొని ఒకవైపు శ్రీరాంసాగర్‌కు, మరోవైపు మిడ్ మానేరుకు తరలించి.. ఆపై వివిధ రిజర్వాయర్ల ద్వారా పొలాలకు పారిస్తారు. రీడిజైనింగ్ తర్వాత సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద గతఏడాది మే రెండో తేదీన శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి సీసీ కెమెరాలద్వారా ప్రగతిభవన్ నుంచే పనుల పురోగతిని పరిశీలిస్తున్నా.. తొలిసారిగా గురువారం ఆ పనులను ప్రత్యక్షంగా తిలకించనుండటం విశేషం. సీఎం పర్యటనలో భాగం గా మూడు కీలకమైన బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణ పనులను పరిశీలించేలా షెడ్యూల్ రూపొందించారు.

kaleshwaramproject
కుట్రలను తిప్పికొట్టేలా..
సమైక్యపాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను ఏయే చిక్కుముళ్లతో అటకెక్కించారనే వాస్తవాన్ని సీఎం కేసీఆర్ ఆది నుంచి అర్థంచేసుకున్నారు. అందుకే రీడిజైనింగ్‌లో కంతానపల్లికి బదులు తుపాకులగూడెంవద్ద బరాజ్ చేపడుతున్నారు. ఎస్సారెస్పీ రెండు దశల్లోని 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, దేవాదుల ప్రాజెక్టుకు 170 రోజుల పంపింగ్‌కు వీలుగా జలాశయాన్ని సృష్టించడం కంతానపల్లి బరాజ్ ఉద్దేశం. అయితే కంతానపల్లి బరాజ్‌ను 85 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించడంవల్ల 11వేల ఎకరాల ఆదివాసీ భూము లు, కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ అం శాన్ని పరిష్కరించడమంటే చాలా కాలయాపనతో కూడుకున్నది. అదే తుపాకులగూడెం వద్ద 80 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మిస్తే 637 ఎకరాలే ముంపునకు గురవుతాయి. సుమారు ఏడు టీఎంసీల నీటి నిల్వతో దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్ పాయింట్‌కు ఏడాదిపాటు నీటి లభ్యత ఉంటుంది. కాకతీయ కాల్వ ఆధునీకరణతోపాటు పునర్జీవ పథకంద్వారా ఎస్సారెస్పీకి జీవం పోస్తున్నందున ఎస్సారెస్పీ రెండు దశల్లోని 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా మరో మార్గంలో సాధ్యమవుతుంది. ఇలా అత్యంత చాకచక్యంగా రూపొందించిన తుపాకులగూడెం బరాజ్ పనులను కూడా సీఎం పరిశీలించనున్నారు.

kaleshwaramproject2
తెలంగాణ సర్కారు చిత్తశుద్ధికి ఇదీ నిదర్శనం
ఇచ్చంపల్లి.. ఈ పదం తెలంగాణకు సుపరిచితమైనది. కేవలం గోదావరిపై 95 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణంతో ముడిపడి ఉన్న ఇచ్చంపల్లి చరిత్ర శతాబ్దంన్నర. 1858-59 ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదన తొలిసారి తెరపైకి వచ్చింది. సర్ ఆర్థర్ కాటన్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కారణాలేమైనా పనులు మాత్రం మొదలుకాలేదు. ఫ్రెంచివారు ప్రాజెక్టు పనులను మొదలుపెట్టినప్పుడు ఆదిలోనే క్యాంపు ప్రాంగణంలో పెద్దఎత్తున కలరా సోకడంతో కూలీలు అక్కడ పనిచేసేందుకు భయపడ్డారు. ఫలితంగా పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అయినప్పటికీ 1867లో అప్పటి హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాం ప్రభువు ఈ ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించారు. దట్టమైన అటవీప్రాంతం కావడం, ఇతర కారణాలతో అదికూడా పట్టాలెక్కలేదు. 1945-46లో మరోసారి హైదరాబాద్ స్టేట్ సర్కారు ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించింది.

ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణంతో పాటు 200-500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రతిపాదించింది. అదీ ముందుకుసాగలేదు. 1958 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4.50 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనతోపాటు కరెంటు ఉత్పత్తి కోసం ఈ హైడ్రో ప్రాజెక్టును మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ సమయంలో పూర్తిస్థాయి రిజర్వాయర్ సామర్థ్యం (ఎఫ్‌ఆర్‌ఎల్) 118.87 మీటర్లు (390 అడుగులు)గా నిర్ధారించారు. ఈ స్థాయిలో ఏకంగా 550 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. ఆ తర్వాత 1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) మరోసారి అధ్యయనంచేసింది. ఆ సమయంలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 117.04 మీటర్లు (384 అడుగులు)గా నిర్ధారించారు. ఈ స్థాయిలో 529 టీఎంసీల నీటి నిల్వ ఉండనుంది. ఇదే ఏడాది జూలైలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా.. మూడేండ్లపాటు ఎలాంటి అడుగు పడలేదు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై ఆ తర్వాత 1978 ఆగస్టు ఏడున ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం సైతం చేసుకున్నాయి. 1980లో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన ఏపీ సర్కారు.. నివేదికను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సమర్పించింది.

1981లో హైదరాబాద్‌లో మూడురాష్ర్టాల కార్యదర్శులు ప్రాజెక్టుపై చర్చించారు. తదుపరి అనేక సంప్రదింపులు, సమావేశాల అనంతరం చివరకు 1988లో ఈ ప్రాజెక్టుపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రూ.1110 కోట్లతో కేంద్ర జల సంఘానికి, సంబంధిత రాష్ర్టాలకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించింది. అయినా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి రూ.5.85 కోట్లను విడుదల చేస్తున్నట్టు 13.10.1999న జీవో జారీచేసింది. ఆ తర్వా త ఎట్టకేలకు 6.7.2000న హైలెవల్ కమిటీ ఏర్పాటై, అదే ఏడాది ఆగస్టు 11న ఢిల్లీలో మొదటి సమావేశం జరిగింది. ఇందులో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసి.. ఇచ్చంపల్లి వద్ద 112.77 మీటర్ల డ్యాం ఎత్తుతో ఒక ప్రతిపాదన, 95 మీటర్ల ఎత్తుతో మరో ప్రతిపాదనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. 22.12.2000లో నాగపూర్‌లో రెండో సమావేశం జరిగినప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచి అభ్యంతరం వచ్చింది.

తమది కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఈ ప్రాజెక్టు విషయాన్ని తమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని ఆ రాష్ట్ర సీఈ చెప్పారు. కానీ.. ఆంధ్రప్రదేశ్ పాలకులు ఛత్తీస్‌గఢ్‌తో ఈ విషయమై సంప్రదింపులు జరిపిన దాఖలాలు లేవు. అయితే హైలెవల్ కమిటీలు, సంప్రదింపులతో 2007 సంవత్సరంలో ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు సంబంధించి జాయింట్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయడం వరకు పురోగతి ఉంది. ఆ తర్వాత ఆ ఫైల్ అటకెక్కింది. అనంతరకాలంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చంపల్లి ఊసే ఎత్తలేదు. అంతెందుకు.. ఒప్పందాల్లో పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 150గా పొందుపరుచడంతోపాటు క్లాజ్-4, 5ల్లో 150 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు అనుగుణంగా ఒడిశాకు జరిగే నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఇచ్చంపల్లి విషయంలో మాత్రం ఎక్కడా ఎఫ్‌ఆర్‌ఎల్‌ను నిర్ధారించలేదు. శతాబ్దంన్నరపాటు ఒక ప్రాజెక్టు విషయంలో అడుగులు ముందుకు కదులని స్థితిలో.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బరాజ్ కేవలం తొమ్మిది నెలల కాలంలోనే డిజైన్ రూపుదాల్చి.. మహారాష్ట్రతో ఏకంగా వంద మీటర్ల ఎత్తు (ఎఫ్‌ఆర్‌ఎల్) కోసం ఒప్పందాన్ని కూడా పూర్తి చేసుకుందంటే కచ్చితంగా ముఖ్యమంత్రి కేచంద్రశేఖర్‌రావు కృషి, చాతుర్యమే దీనికి కారణం.

5749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS