డూప్లికేట్ల దందా


Thu,May 23, 2019 02:26 AM

Chivvemla Mandalam Revenue Officers Registration with duplicate passbooks

-అమ్మిన భూమి ఒకటి..
-మాయమైంది మరొకరి ఖాతాలో
-డూప్లికేటు పాస్‌పుస్తకాలతో రిజిస్ట్రేషన్
-రిజిస్ట్రేషన్ల శాఖ గుర్తించినా.. రికార్డుల్లో మార్చని రెవెన్యూ అధికారులు
-చివ్వెంల మండలం కుడకుడలో మూడేండ్లుగా తిరుగుతున్న బాధితులు

రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో సాగిన డూప్లికేట్ వ్యవహారం! ఎవరి భూమిని ఎవరు అమ్ముతున్నారో కూడా గుర్తించని అధికారులు.. అసలు పట్టాదారులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఒకరు భూమి అమ్మితే.. వేరొకరి ఖాతాలో భూమిని తొలిగించేశారు! తాము ఆ భూమి అమ్మలేదని బాధితులు మొత్తుకున్నా.. పట్టించుకోవటం లేదు. తొలిగించిన భూమిని తిరిగి రికార్డుల్లోకి చేర్చాలని మూడేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కనికరించేవారు కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. పైగా తమ భూమిని బినామీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. దొంగతనంగా పట్టాచేయించుకున్న వ్యక్తులతో తమను బెదిరింపులకు గురిచేస్తూ.. కేసులు వేయిస్తూ వేధిస్తున్నారని ధర్మగంట వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఖాస్రా పహాణీలో సర్వేనంబర్ 98లో 27.13 ఎకరాలు ఉన్నది. దానికి పట్టాదారులుగా పిండిగ ప్రేమయ్య, ఏసోబు, ప్రమోదుకు 98/ఉలో 2.13 ఎకరాలు, పిండిగ రాజరత్నం, పిండిగ భిక్షం, పిండిగ యాకోబులకు 98/ఊలో 2.13 ఎకరాలు, పిండిగ నాగయ్యకు 98/రులో 2.13 ఎకరాలు, పిండిగ సత్యానందం, ఆరోణ్, సత్యసాగర్, నర్సమ్మలకు 98/రూలో 2.13 ఎకరాలు, పిండిగ ఈదయ్య, జీవరత్నం, దానియేలు, జీవయ్యలకు 98/లులో 2.13 ఎకరాలు.. మొత్తం 11.30 ఎకరాలు ఉన్నాయి. ఇక.. పోరెడ్డి రాంరెడ్డికి 98/అలో 3.37 ఎకరాలు, పోరెడ్డి సూరారెడ్డి, బండారు సోమమ్మలకు 98/ఆలో 3.37 ఎకరాలు, బూర వెంకులుకు 98/ఇలో 3.37 ఎకరాలు, బొల్లం లింగయ్య, లోడంగి పెద్ద అచ్చయ్య, చిన్న అచ్చయ్య, బాలనర్సయ్యలకు 98/ఈలో 3.37 ఎకరాలు అంటే మొత్తం 15.28 ఎకరాలు ఉన్నాయి. సర్వేనంబర్ 98/అ లోని భూమిని పోరెడ్డి రాంరెడ్డి కొడుకులు రాఘవరెడ్డి, శంకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి కలిసి పారుపల్లి ధనలక్ష్మికి 3.01 ఎకరాలు, పారుపల్లి వనజకు 1.02 ఎకరాలు విక్రయించారు. 98/ఆ లో బండారు సోమయ్యకు 0.38 ఎకరాలు, మాదంశెట్టి లక్ష్మీబాయమ్మకు 2.39 ఎకరాలను పట్టాదారు పోరెడ్డి సూరారెడ్డి విక్రయించారు.
Dharmaganta
ఈ మొత్తం భూమి ఎనిమిది ఎకరాలను వారి నుంచి పిండిగ లక్ష్మి కొనుగోలుచేశారు. అలాగే 98/రులో పిండిగ నాగయ్య నుంచి 2.13 ఎకరాలు, పిండిగ జీవరత్నం నుంచి 0.17 ఎకరాలను కొనుగోలుచేశారు. ఆమె తిరిగి బూర పెద్దులుకు 11.03 ఎకరాలు, రావులకొల్లు మంగమ్మకు రెండెకరాలను విక్రయించారు. అంటే విక్రయించిన మొత్తం భూమి 13.03 ఎకరాలు. ఇలా ఈ సర్వే నంబరులో అనేక లావాదేవీలు జరిగాయి. అయితే.. ఈ లావాదేవీల్లో సర్వే నం.98 పట్టాదారులైన పిండిగ ప్రేమయ్య, ప్రమోద్, విజయ్‌కుమార్, యాకోబు, వెంకన్న, జీవయ్య, అశోక్‌లకు సంబంధించిన భూమిని అధికారులు రికార్డుల నుంచి తొలిగించారు. తాము భూమిని అమ్మకపోయినా.. తమ భూమిని విక్రయించినట్టుగా చూపిస్తూ రికార్డుల నుంచి తొలిగించారని బాధితులు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వ్యవహారంలో 98/ఉలో 0.39 ఎకరాలు పిండిగ ప్రేమయ్య, 98/ఊలో 0.31 ఎకరాలు పిండిగ యాకోబు, 98/ఊలో 0.14 ఎకరాలు పిండిగ భిక్షం, 1.36 ఎకరాలు పిండిగ జీవయ్య, ఇద్దయ్య కోల్పోయారు. మొత్తం నాలుగు ఎకరాలు నష్టపోయారు.

నకిలీ పాసు పుస్తకాలతోనే!

కుడకుడ రెవెన్యూ సర్వేనంబర్ 98లోని లావాదేవీల్లో నకిలీ పాస్‌పుస్తకాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసినట్లు లేఖ నం.190/2017, తేదీ.09.08.2017 ద్వారా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ అంగీకరించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు నం.4849/2016లో టైటిల్ డీడ్ నం.97894కు బదులుగా 227818ను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇరువర్గాలకు సూచించినట్లు తెలిపారు. అయితే.. అసలుగా పేర్కొంటున్న పాస్‌పుస్తకంలోనూ సర్వేనంబర్లు, విస్తీర్ణం పేర్కొన్న పేజీల్లో తహశీల్దార్ల సంతకాలు రెండురకాలుగా ఉండడం గమనార్హం. అది కూడా ఒరిజినలా.. డూప్లికేటా! అన్నది రెవెన్యూశాఖ తేల్చాలని బాధితులు కోరుతున్నారు.

ఫిర్యాదు నిరాకరించిన ఎస్సై

సర్వేనంబర్ 98లో తమకు అన్యాయం జరిగిందంటూ బాధితులు అర్జీలు పెట్టుకున్న తరుణంలోనే.. ఆ భూమిని తాము కొనుగోలుచేశామంటూ కొందరు ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. దాన్ని ఆసరా చేసుకొన్న సదరు వ్యక్తులు.. బాధిత కుటుంబాలు సాగుచేసుకున్న పెసర పంటను ధ్వంసంచేశారు. ఈ క్రమంలోనే బాధితుల రికార్డులను పరిశీలించేందుకు పోలీసు అధికారులు ససేమిరా అన్నారు. దాంతో రిజిస్టర్ పోస్టు ద్వారా అన్ని డాక్యుమెంట్లను అప్పటి ఎస్సై ప్రవీణ్‌కుమార్‌కు పంపగా ఆయన స్వీకరించకపోవడం గమనార్హం. తమకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ రెవెన్యూ, పోలీసుశాఖలు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.

మేం ఎవ్వరి భూమి అడగడం లేదు

మా నాలుగు కుటుంబాలకు అన్యాయం జరిగింది. మా రికార్డులను పరిశీలించండి. మేం అమ్మకపోయినా మా భూమిని ఎలా తొలగిస్తారు? మేం ఎవ్వరి భూమిని అడగటం లేదు. మూడు, నాలుగేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయడంలేదు. అందుకే నమస్తే తెలంగాణ ద్వారా చెప్పుకొంటున్నాం. ఇకనైనా సర్వేనంబర్ 98లో చోటుచేసుకున్న అన్ని లావాదేవీలను, డాక్యుమెంట్లను, పాస్‌పుస్తకాలను, సంతకాలన్నింటినీ పరిశీలించాలి. ఏది నిజమో, ఎవరు అబద్ధం చెప్తున్నారో తేల్చాలి. మాకు ఉద్దేశపూర్వకంగా అన్యాయంచేసిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. మా స్వాధీనంలోని నాలుగు ఎకరాలను మళ్లీ మా రికార్డుల్లోకి ఎక్కించి పాస్‌పుస్తకాలు ఇప్పించాలని కోరుతున్నాం.
- పిండిగ అశోక్, కుడకుడ గ్రామస్థుడు

జేసీ కోర్టులో ఉంది

ఈ అంశం మా దృష్టిలో ఉన్నది. ఇది వారి కుటుంబ సమస్య. చాలా ఏండ్లుగా క్రయవిక్రయాలు జరిగాయి. వీళ్ల స్వాధీనంలో భూమిలేదు. పైగా కేసు జేసీ కోర్టులో ఉన్నది. అక్కడేం నిర్ణయం వస్తుందో దాని ప్రకారం అమలుచేస్తాం.
- పీ రాధ, చివ్వెంల తాసిల్దార్
Land1

వంశపారంపర్య భూమి ఒక్కరికే పట్టా

-వీఆర్వో లంచం తీసుకొని పనిచేశాడు..
-మరో ముగ్గురు సోదరులను ముంచాడు

Suresh-farmer
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పొతంగల్ గ్రామం మాది. నలుగురం అన్నదమ్ములం. మా నాన్న ఏర్రోల గంగయ్య 2012లో చనిపోయారు. మా నాన్న పేరిట సర్వేనంబర్ 667/4లో ఉన్న 2.20 ఎకరాల భూమిని మాకు తెలియకుండా, మా సంతకాలు లేకుండా, ఆర్వోఆర్ లేకుండానే 2015లో అప్పటి వీఆర్వో సంగమేశ్వర్ రూ.10 వేల లంచం తీసుకొని మా అన్న ఏర్రోల రాములు పేరిట పట్టాచేశాడు. మాకు జరిగిన అన్యాయంపై 2016 ఆగస్టు 26న అప్పటి బోధన్ సబ్‌కలెక్టర్‌కు, కోటగిరి తాసిల్దార్‌కు రాత పూర్వక ఫిర్యాదు చేశాం. వీఆర్వోపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నాం.
-ఏర్రోల సురేశ్, బాధితుడు
Land2

1287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles