తియ్యటి విషం!


Tue,April 16, 2019 02:16 AM

chemical that has a profound effect on health

-పండ్ల పక్వం కోసం కార్బైడ్
-ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతున్న రసాయనం
-ప్రత్యామ్నాయ పద్ధతులు సూచిస్తున్న అధికారులు

హైదరాబాద్, నమస్తేతెలంగాణ : ఆరోగ్యం కోసం తింటున్న పండ్లు డేంజరే! తినే ముందు కొంచం ఆలోచించాల్సిందే! వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా రసాయనాలు వినియోగించి పక్వానికి తెస్తుండటంతో వాటిని తిన్న వారు అనారోగ్యం బారినపడుతున్నారు. మామిడి, అరటి, బొప్పాయి, సపోటా, ద్రాక్ష, దానిమ్మ ఇలా దేన్నైనా రసాయనాలతో పండిస్తుండటం గమనార్హం. చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగబెడుతున్నారు. అవి త్వరగా పక్వానికి వచ్చేందుకు కాల్షియం కార్బైడ్ లేదా పొగబెట్టే పద్ధతిని వినియోగిస్తున్నారు. మామూలుగా సహజసిద్ధంగా పండిన వాటిలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం నీరసించినప్పుడు ఉత్తేజం కలిగించటంతోపాటు, ఆహారం జీర్ణం కావటానికి, మలబద్ధకాన్ని రూపుమాపేందుకు తోడ్పడుతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో వీటి శాతం చాలా తక్కువ. అనారోగ్యం బారిన పడే అవకాశమే ఎక్కువని వైద్యనిపుణులు చెప్తున్నారు.

మామిడి పండ్లను మాగపెడుతున్నారు ఇలా..

ఇటీవల గాలిదుమారానికి కిందపడిన మామిడి పండ్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని గోదాములకు తరలిస్తున్నారు. గోదాముల్లో నిల్వ ఉంచిన కాయలను పొట్లాల్లో నింపిన కాల్షియం కార్బైడ్‌తో మాగపెడుతున్నారు. కాల్షియం కార్బైట్‌తో వేడి పుట్టించటం వల్ల ఉష్ణోగ్రత పెరిగి నాలుగు రోజుల్లో కాయలు పండ్లుగా మారుతున్నాయి. ఇలా మాగించిన పండ్లు రిటైల్ వ్యాపారులకు, తద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే పండ్ల బాక్సుల్లో కాల్షియం కార్బైడ్ ప్యాకెట్లు అమర్చి ఉంచుతున్నారు. అవి నిర్దేశిత ప్రాంతానికి చేరుకునేలోగా కాయలు మాగుతున్నాయి. ఈ రసాయనాల కారణంగా మామిడి పండ్లు సహజ గుణం కోల్పోయి విషతుల్యం అవుతున్నాయి.

శాస్త్రీయ పద్ధతుల్లో పండ్లను మాగబెట్టడం

మామిడి పండ్లను చెట్టుపైనే బాగా ముదిరిన తర్వాత కోయాలి. అలా కోసిన పండ్లపైన వరి గడ్డి వేయాలి. ఇలా వారం రోజుల పాటు ఉంచడం వల్ల పండ్లు మధురమైన రుచి, వాసనను, పోషక విలువలను సంతరించుకొని సంపూర్ణంగా తినడానికి అనుగుణంగా ఆరోగ్యకరంగా ఉంటాయి. గతంలో మామిడి పండ్లను ఇలానే పండించి విక్రయించేవారు.

ప్రత్యామ్నాయ మార్గాలివి

మామిడి కాయలను రిపెనింగ్ చాంబర్‌లో ఉంచి 100-150 పీపీఎం ఇథలీన్ వాయువును ప్రవేశపెట్టి, 12-24 గంటలు చాంబర్ తలుపులు తెరవకుండా ఉంచాలి. తర్వాత కాయలు 4.5 రోజులలో మంచి రంగు సంతరించుకొని పక్వానికి వస్తాయి. 5 లీటర్ల నీటిలో 10 మి.లీ ఇథరాల్ రసాయనాన్ని పోసి తయారుగా ఉన్న ద్రావణంలో మామిడి కాయలను 3-5 నిమిషాలు ఉంచితే మామిడి కాయలు 4-5 రోజులలో పక్వానికి రావటం మరో పద్ధతి అని చెప్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా మాగపెట్టిన పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగదని వైద్యులు చెప్తున్నారు.
judge

నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 లక్షలు జరిమానా

మామిడి కాయలను కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ రూల్స్-1995 రూల్ నెంబర్ 44 (ఏఏ) ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో పండ్లను మాగబెట్టడంపై నిషేధం విధించాయి. దీనిని అతిక్రమించిన వారికి మూడేండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలా మాగించిన పండ్ల అమ్మకాలను అడ్డుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన, వైద్యారోగ్య అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమైన నగరాల్లోని పండ్ల మార్కెట్‌లలో తనిఖీలు చేసి కాల్షియం కార్బైడ్ వినియోగించే వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తున్నది.

కాల్షియం కార్బైడ్‌తో అనారోగ్యం

కాల్షియం కార్బైడ్ అనేది సాధారణంగా గ్యాస్ వెల్డింగ్‌లో వినియోగిస్తారు. ఇది బహిరంగ మార్కెట్‌లో దొరుకుతుంది. కిలో రూ. 80 మాత్రమే ఉంటుండటం వ్యాపారులకు కలిసి వస్తున్నది. మార్కెట్‌లో విచ్చలవిడిగా దొరుకుతున్నది. కాల్షియం కాైర్బెడ్ మనం తినటం వల్ల గ్యాస్ట్రిక్, మూత్రపిండ సంబంధ వ్యాధులు, ఎలర్జీతో పాటు కొన్ని సందర్భాల్లో కంటి చూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాడీ వ్యవస్థ పనితీరుపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు తింటే ఒక్కోసారి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని, పిల్లలు వైకల్యంతో పుట్టే అవకాశాలూ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రసాయనాలతో మాగబెట్టిన పండ్లను ఉప్పునీటితో కడిగి తొక్క తీసేసి తినటం కొంత మేలని వైద్యులు చెప్తున్నారు.

5497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles