ఈశ్వరీబాయి పేరిట సేవాసంస్థ..


Thu,February 25, 2016 01:29 AM

Charity on eshwari bhai name

-సీఎం కేసీఆర్‌కు నివేదిస్తాం
-ఈశ్వరీబాయి 25వ వర్ధంతి సభలో రాష్ట్ర మంత్రి చందూలాల్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్వర్గీయ ఈశ్వరీబాయి పేరిట సేవాసంస్థ, ట్రస్ట్ ఏర్పాటు చేసి మహిళలకు సేవలందించేందుకు అవసరమైన కార్యాచరణ రూపకల్పనకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఆమె పేరిట సేవా సంస్థ ఏర్పాటు చేయాలన్న ఈశ్వరీబాయి ట్రస్ట్ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు నివేదిస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యం లో బుధవారం నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్ లలిత కళాతోరణంలో జరిగిన ఈశ్వరీబాయి 25వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఆమె అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతిగా, చిరస్మరణీయంగా నిలిచారని చెప్పారు. అసెంబ్లీలో బ్రహ్మానందరెడ్డి వంటి సీఎంలను గడగడలాడించి దళితుల హక్కుల కోసం నినదించిన నాయకురాలిగా ఆమె అందరికీ గుర్తుండిపోతారని చందూలాల్ తెలిపారు. ఆమె జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ కర్తవ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి మాట్లాడుతూ 1969 నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆమె పోరాట పటిమ, ధైర్యసాహసాలు, వాక్పటిమ ప్రత్యక్షంగా చూశామన్నారు.

home
ఈశ్వరీబాయి పేరిట మహిళలకు సేవలందించేందుకు సేవా సంస్థ ఏర్పాటులో తానూ భాగస్వామిని అవుతానన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ ఈశ్వరీభాయి ఉపన్యాసాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కరదీపికలుగా పని చేశాయని అన్నారు. ఈశ్వరీభాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జే గీతారెడ్డి మాట్లాడుతూ ఈశ్వరీబాయి విషయంలో ఉదాత్తంగా వ్యవహరించి, ఆమె జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే నిర్వహిస్తుందని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె పేరిట ప్రభుత్వం మహిళాసేవా సంస్థ ఏర్పాటు చేయాలని, అందుకు తమ ట్రస్ట్ సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీ వివేక్, మాజీ మంత్రి జీ వినోద్, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ కార్యదర్శి బీ వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రభృతులు పాల్గొన్నారు.

-స్వతంత్ర భావాలకు మారుపేరు ఈశ్వరీబాయి: నాయిని
కంటోన్మెంట్: మహిళాస్వావలంభన, స్వయంప్రతిపత్తి, విశాల భావాలు గల నాయకురాలు ఈశ్వరీబాయి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. బుధవారం సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి చౌరస్తాలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈశ్వరీబాయి 25వ వర్ధంతిసభలో మాట్లాడుతూ ఆమె నిజాయితీకి మారుపేరని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకెళ్లిన తనకు నాటి సీఎం జలగం వెంగళరావును ఒప్పించి పెరోల్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు ఆయన ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఈశ్వరీబాయి ట్రస్ట్ చైర్మన్ జే గీతారెడ్డి, ఈశ్వరీబాయి స్మారక నర్సింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ రాంచంద్రారెడ్డి, పరిపాలనా విభాగాధిపతి మేఘనారెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, టీపీసీసీ కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

1497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS