ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి


Thu,May 23, 2019 02:18 AM

CEO Rajath Kumar Press Conference Over Telangana Vote Counting Process

- ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
- ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయం
- లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీఈవో రజత్‌కుమార్


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ చెప్పారు. ఓట్ల లెక్కిం పు ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలలో 443 మంది బరిలో ఉన్నారని తెలిపారు. 17 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 36 ప్రాంతాల్లో 126 ప్రాంగణాలను ఏర్పాటుచేశామన్నారు.110 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1,841 టేబుల్స్ ఉంటాయని చెప్పారు. నిజామాబాద్‌లో ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓట్లలెక్కింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒక్క ప్రాంగణానికి 18+1 టేబుళ్ల చొప్పున రెండు ప్రాంగణాల్లో కలిపి 38 టేబుళ్లను ఏర్పాటుచేశామన్నారు. వీవీప్యాట్లు, ఈవీఎంల లెక్కింపుల్లో తేడా వస్తే, తిరిగి మరోసారి వీవీప్యాట్లను లెక్కిస్తారని తెలిపారు. వీవీప్యాట్లలో మానవ తప్పిదం ఉండే అవకాశం ఉంటుందని, దీంతో వీవీప్యాట్లను తిరిగి లెక్కిస్తామని వివరణ ఇచ్చారు. ఈవీఎంలలో తేడాలు వచ్చే అవకాశంలేదని రజత్‌కుమార్ స్పష్టంచేశారు.

చివరగా ఓట్ల లెక్కింపు, తిరిగి ఓట్లలెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్ల లెక్కింపే ప్రామాణికం అవుతుందని తెలిపారు. 2013 నుంచి ఈ విధానం అమలులో ఉన్నదని, ఇప్పటివరకు ఎప్పుడూ తప్పులు దొర్లలేదని చెప్పారు. రూల్ 56 (డీ) కింద ఓట్లలెక్కింపు పూర్తయ్యాక అభ్యంతరాలుంటే అభ్యర్థులు తిరిగి మరోసారి ఓట్ల లెక్కింపునకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అటువంటిదేమైనా ఉంటే.. తిరిగి ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకనే తుది ఫలితం ప్రకటిస్తారని చెప్పారు. ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాల వెల్లడిలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని, ఇందులో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోదని తెలిపారు. ఒకవేళ అభ్యర్థి గెలిచే మార్జిన్ పోస్టల్ బ్యాలెట్స్ కంటే తక్కువగా ఉంటే, రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లను లెక్కించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎన్నికల ఫలితాలను రౌండ్లవారీగా సువిధ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తారని రజత్‌కుమార్ తెలిపారు. సువిధ డిస్‌ప్లే సీఈవో కార్యాలయంలో ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇందులో దేశవ్యాప్తంగా రౌండ్లవారీగా ఫలితాలను చూడవచ్చునని వివరించారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్న ప్రాంగణాలకే సెలవు

ఓట్ల లెక్కింపు కేంద్రాల ప్రాంగణాలున్న కార్యాలయాలకు మాత్రమే సెలవు ఇచ్చినట్టు సీఈవో రజత్‌కుమార్ స్పష్టంచేశారు. అయితే స్థానిక అవసరాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు రోజున సెలవు ఇచ్చుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

వీవీ ప్యాట్లను ఇలా లెక్కిస్తారు

కంట్రోల్ యూనిట్ల లెక్కింపు మొత్తం పూర్తిచేసిన తర్వాత ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్ల చీటీలను లెక్కిస్తారు. లెక్కించే వీవీప్యాట్లను లాటరీద్వారా ఎంపికచేస్తారు. ఎంపికచేసిన వీవీప్యాట్లను ప్రత్యేకంగా ఒక మెష్‌తో ఏర్పాటుచేసిన బూత్‌లోకి తరలించి, అక్కడ అభ్యర్థుల గుర్తులతో కూడిన బాక్స్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రతి 25 చీటీలను ఒక కట్టగా కడుతారు. వాటిల్లోంచి అభ్యర్థులవారీగా చీటీలను వేరుచేసి బాక్సుల్లో వేస్తారు. ఆ తర్వాత బాక్సుల్లోని మొత్తం చీటీలను లెక్కిస్తారు. ఒక్కో వీవీప్యాట్ లెక్కింపునకు గరిష్ఠంగా గంట సమయం పడుతుందని అంచనా.

ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాలు!

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తుండగానే.. ఈవీఎం కంట్రోల్ యూనిట్లలో ఓట్ల లెక్కింపును ఉదయం 8.30 గంటలకు మొదలుపెడుతారు. సెగ్మెంట్లవారీగా పోలింగ్ కేంద్రాలు, రౌండ్ల ను నిర్ణయించి, లెక్కింపు చేస్తారు. 14 టేబుళ్ల మీద ఉన్న కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూర్తిచేసిన తర్వాతే మరోరౌండ్‌కు వెళ్తారు. ఒక్కోరౌండ్‌ను లెక్కించేందుకు గరిష్ఠంగా 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుందని అంచనా.

711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles