బొగ్గు గనుల్లోకి మహిళలు


Mon,February 11, 2019 02:25 AM

Centre allowing women in underground mines

-కేంద్రం నిర్ణయంతో అతివలకు అవకాశం
-కోల్ ఇండియా అంగీకారం తర్వాత అమలు
-600పైగా ఉద్యోగాల భర్తీకి సింగరేణి సన్నాహాలు
-ఓపెన్‌కాస్ట్, భూగర్భగనుల్లో మహిళలకూ ఉద్యోగాలు
-67 ఏండ్ల తర్వాత తిరిగి గనుల్లోకి వెళ్లే అవకాశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : మహిళలు బొగ్గుగనుల్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర కార్మికశాఖ తాజాగా గనుల చట్టాన్ని సవరించింది. దీంతో తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో విధులు నిర్వర్తించే అవకాశం మహిళలకు లభించనుంది. 1952లో గనుల్లో మహిళలు పనిచేయడాన్ని నిషేధించగా, తాజాగా కేంద్రం నిర్ణయంతో 67 ఏండ్ల తర్వాత మహిళలు గనుల్లో పనిచేసే అవకాశం లభించింది. ఇప్పటివరకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 600పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్న సింగరేణి, కోల్ ఇండియా నిర్ణయం మేరకు మహిళలకు అవకాశం కల్పించనుంది.

సింగరేణిలో ఉద్యోగం.. యమ క్రేజ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి లాభాలబాటలో దూసుకుపోతున్నది. దీంతో ఒకవైపు కార్మికులకు మంచి జీతం, జీవితం ఉండటం.. మరోవైపు భద్రతాచర్యల కారణంగా ప్రమాదాలు తగ్గటంతో సింగరేణి ఉద్యోగం ఆకర్షణీయంగా మారింది. రాష్ట్రంలోని యువతతోపాటు సింగరేణి విస్తరించిన జిల్లాలవారు ఈ ఉద్యోగాలకు పోటీపడుతున్నారు. సింగరేణి ప్రాంత జిల్లాలవారికి స్థానిక కోటా ఉండటంతో సంస్థలో ఉద్యోగమే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం ఐటీఐ తదితర వృత్తివిద్య కోర్సుల్లో చేరుతున్నారు. ఇదివరకు గనుల్లో పనిచేసే అవకాశం పురుషులకు మాత్రమే ఉండటంతో మహిళలు సింగరేణి ఉద్యోగాల వైపు చూడలేదు. ప్రస్తుతం మహిళలూ వృత్తివిద్య కోర్సులు చేసి పోటీలో ఉండనున్నారు.

ప్రస్తుతం 2.4 శాతం మహిళలే

సుదీర్ఘ చరిత్ర గల సింగరేణిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ. అన్ని విభాగాల్లో కలుపుకొని కేవలం 2.4 శాతం మహిళలు మాత్రమే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. 56,282 మంది కార్మికులు ఉంటే, అందులో 1,362 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వీరు కూడా ఉపరితల కార్యాలయాల్లో క్లర్కు, క్యాంటీన్ వర్కర్లు, స్వీపర్లు తదితర పనులు చేస్తున్నారు. సింగరేణిలో మహిళా శక్తి పెరుగకపోవడానికి ఇన్నాళ్లు అడ్డంకిగా ఉన్న నిబంధనలే కారణం. 29 భూగర్భ, 19 ఓపెన్‌కాస్ట్ గనులతో సింగరేణి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తరించింది. ఇందులో భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో జనరల్ మజ్దూర్, పంప్ ఆపరేటర్, కన్వేయర్ ఆపరేటర్, కోల్ కట్టర్, ఫిట్టర్, హెల్పర్, సర్వేయర్ తదితర 50 రకాల హోదాల్లో ఉద్యోగాలున్నాయి.

ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

సింగరేణిలో బొగ్గు వెలికితీయటంతోపాటు అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 1988 తర్వాత ఒక్క ఉద్యోగం కోసం కూడా రాత పరీక్ష నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో 450 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంస్థ రాత పరీక్ష నిర్వహించింది. ఇలా పలు విభాగాల్లో మొత్తం 7,500 పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటిలో ఉపరితలంలో పనిచేసే ఉద్యోగాలకు మాత్రమే మహిళలకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం పలు విభాగాల్లో 600పైగా ఖాళీలను సింగరేణి గుర్తించింది. వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.

మహిళలకు అవకాశం.. శుభపరిణామం

గనుల్లో పనిచేసేందుకు మహిళలకు అవకాశం కల్పించడం శుభపరిణామం. దీనిపై కేంద్ర కార్మికశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. పూర్తి మార్గదర్శకాల కోసం వేచిచూస్తున్నాం. కోల్ ఇండియా నిర్ణయం కూడా ముఖ్యమే. ఇప్పటికే ఆరువందలకు పైగా ఖాళీలను గుర్తించాం. ఉద్యోగాల భర్తీలో స్థానికత అంశంపై కొత్తగా వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుచేసే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
-ఎస్ చంద్రశేఖర్, సింగరేణి డైరెక్టర్ (ఓపీ, పీఏడబ్ల్యూ)

3284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles