హోంగార్డులకూ కేంద్ర పోలీస్ పతకాలు!


Thu,May 16, 2019 02:28 AM

Central Police Medals for Home Guards

-ఉత్తమ సేవలకు తొలిసారిగా దక్కనున్న గౌరవం
-మొత్తం ఏడువిభాగాల్లోనూ అదనంగా అవార్డులు ఇచ్చేందుకు కేంద్రహోంశాఖ నిర్ణయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉత్తమ సేవలందించే హోంగార్డులకు ఇకపై జాతీయస్థాయిలో గుర్తింపు, గౌరవం దక్కనుంది. వారిని ప్రత్యేకంగా అవార్డులతో సత్కరించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది. మరో ఐదు క్యాటగిరీల్లో నూతనంగా అవార్డులను ప్రదానం చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం అందినట్టు అడిషనల్ డీజీ (పర్సనల్) శివధర్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ సేవలందించిన పోలీస్ అధికారులకు జాతీయస్థాయిలో ఏటా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం), ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం), పోలీస్ మెడల్‌సహా పలు పతకా లు ఇస్తున్నారు. వీటికి అదనంగా మరో ఏడు విభాగాలను ఇందులో చేర్చారు. క్షేత్రస్థాయిలో అత్యున్నతంగా పనిచేస్తున్న అధికారులకు గౌరవం దక్కేలా ఈ క్యాటగిరీలను రూపొందించారు. కేసు దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, అకాడమీల్లో ఉత్తమ శిక్షణ ఇస్తున్న పోలీస్ అధికారులకు, ఇంటెలిజెన్స్‌లో బాగా పనిచేస్తున్న వారికి, ఉగ్రవాదులు, మావోయిస్టుల ఆపరేషన్లలో బాగా పనిచేసిన వారికి స్పెషల్ ఆపరేషన్స్ క్యాటగిరీలో అవార్డులు ఇవ్వనున్నారు.

కేంద్ర హోంశాఖ గుర్తించిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా కనీసం రెండేండ్లకుపైగా పనిచేసి, అత్యుత్తమంగా విధులు నిర్వర్తించిన అధికారులకు అంతర్గత సురక్ష పతకం, పోలీస్ విధుల్లో కనీసం పదేండ్లు సర్వీస్ పూర్తిచేసుకుని ఎలాంటి మెమోలు, క్రమశిక్షణ చర్యలు లేకుండా విధులు నిర్వర్తించిన వారికి ఉత్కృష్ట సేవా పతకం, పోలీస్ విధుల్లో వరుసగా 25 ఏండ్లపాటు ఏ చిన్న పొరపాటు చేయకుండా ఎలాంటి మెమోలు, ఇతర క్రమశిక్షణ చర్యలకు గురికాకుండా పనిచేసిన వారికి అతి ఉత్కృష్ట సేవా పతకం ఇవ్వాలని కేంద్రహోంశాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు ఐపీఎస్ అధికారుల నుంచి పోలీస్ కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు మాత్రమే పోలీస్ సేవాపతకాలకు అర్హులుగా ఉన్నారు. కాగా తాజాగా ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలను ఉత్తమ సేవలందించిన హోంగార్డులకు కూడా కేటాయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది నుంచి అమలుచేయనున్నట్టు తెలిసింది.

95
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles