మిషన్ భగీరథకు సాయమందించండి


Wed,June 12, 2019 02:58 AM

Central Help Must to Mission Bhagiratha Project

-ఆర్థికంగా ఆదుకోవాలి
-ప్రాజెక్టు నిర్వహణను భరించాలి
-కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ను కోరిన రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి
-ఢిల్లీలో జలశక్తి సదస్సుకు హాజరు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ఆర్థికంగా సహకారం అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్టుకు అయిన ఖర్చులో సగభాగాన్ని నగదు రూపంలో అందించాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో గ్రామీణప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛభారత్ నిర్వహణపై మంగళవారం న్యూఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన సదస్సు జరిగింది. సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజు, కమిషనర్ నీతూప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఇంటికి నీరందించేందుకు కేంద్రం ఇలాంటి సదస్సు నిర్వహించడం హర్షణీయమని, తెలంగాణలో ఇప్పటికే మిషన్‌భగీరథ పేరుతో ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. మిషన్‌భగీరథను అన్నిరాష్ట్రాల అధికారులు పర్యవేక్షించి అభినందించిన విషయాన్ని వివరించారు. వేసవికాలంలోనూ తాగునీటి కొరత లేకుండా చేయగలిగామని చెప్పారు. అయితే, మిషన్‌భగీరథ లాంటి భారీ ప్రాజెక్టుకు భారీగా నిధులు ఖర్చయ్యాయని.. కేంద్రం ఆర్థికంగా సహకారం అందించి ఆదుకోవాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. మిషన్‌భగీరథ పథకం నిర్వహణకు ప్రతిఏటా రూ.2వేల కోట్ల ఖర్చవుతుందని.. కనీసం ఈ నిర్వహణ ఖర్చునైనా కేంద్రం భరించాలని విజ్ఞప్తి చేశారు.

errabelli-dayakar-rao2

కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రితో భేటీ

రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం సాయంత్రం కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో భేటీ అయ్యారు. ఉపాధిహామీ పథకం అమలులో తెలంగాణ.. దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టే అన్ని పథకాలనూ అమలుచేస్తున్నామని, ఈ పథకాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద రూ.175.18 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.760 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 14వ ఆర్థికసంఘం మెరుగైన పనితీరు కనబరిస్తే ఇచ్చే (పెర్‌ఫార్మెన్స్) గ్రాంట్ కింద రూ.119.28 కోట్లు, 14వ ఆర్థికసంఘం నిధుల గ్రాంట్ కింద రూ.135.46 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ జనాభా 40 శాతం ఉన్న నేపథ్యంలో అంత్యోదయ మిషన్ అమలు చేస్తున్నామని.. రూర్బన్ క్లస్టర్ కింద యూనిట్లను మరిన్ని పెంచాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

1115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles