కుప్పకూలిన గౌలిగూడ హ్యాంగర్


Fri,July 6, 2018 03:42 AM

CBS Bus Stand Shed collapsed In GowliGuda

-1930లో నిజాం హయాంలో నిర్మాణం
-అమెరికా బట్లర్ కంపెనీ తయారీ
-ఆర్టీసీ అడ్డాగా సుప్రసిద్ధి
-రెండురోజుల్లో సీఎంకు నివేదిక
-మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్: సుమారు 88 ఏండ్లపాటు హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచిన ఓ చారిత్రాత్మక చిహ్నం చెదిరిపోయింది. నగర రవాణా వ్యవస్థకు నిషాన్‌గా నిలిచిన గౌలిగూడ హ్యాంగర్ నేలకు వాలింది. ఓ ఇంజినీరింగ్ అద్భుతం కాలగర్భంలో కలిసిపోయింది. లక్షల మంది ప్రయాణికులకు నీడను ఇచ్చిన సీబీఎస్ హ్యాంగర్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. 1930లో నిజాంనవాబు నిర్మించిన మిసిసిపీ హ్యాంగర్ గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. మూసీనది ఒడ్డున సమున్నతంగా నిలిచిన భారీ రేకులషెడ్డు అవసానదశకు చేరుకుని అవతారం చాలించింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి సీనియర్ ఆర్టీసీ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ కట్టడం కూలడానికి గల కారణాలను ఆయన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కట్టడం కూలిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. స్థలాన్ని ఆర్టీసీ అదనపు ఆదాయం కోసం ఉపయోగించుకుంటామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌కు నివేదించి ఈ స్థలంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థలాన్ని ఇతర సంస్థలకు అప్పగించబోమని మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ పురాతన కట్టడం కూలినా ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదాన్ని, నష్టాన్ని నివారించగలిగామని మంత్రి చెప్పారు. కూలిన షెడ్డులో దుకాణాలు లీజుకు తీసుకున్నవారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలో దుకాణ నిర్వాహకులతో సమావేశం ఏర్పా టుచేస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇక్కడి దుకాణదారుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్టీసీ గ్రేటర్ ఈడీ పురుషోత్తంనాయక్, సీఈ సుమిత్రా మేరి, హైదరాబాద్ ఆర్‌ఎం వినోద్‌కుమార్, డీవీఎం మాధవరెడ్డి, ఈఈ విజయ్‌కుమార్, కాచిగూడ డీఎం చందర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు ఎం ఆనంద్‌కుమార్‌గౌడ్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
CBSBusStop2

చరిత్ర కలిగిన మిసిసిపీ హ్యాంగర్

సీబీఎస్ పాతబస్‌స్టేషన్ కొన్ని సంవత్సరాలపాటు నగరంలో ఓ ల్యాండ్‌మార్క్‌గా ఉండేది. గతంలో ఈ హ్యాంగర్ చారిత్రాత్మక కట్టడాల జాబితాలో కూడా చేరింది. ఈ షెడ్డు కొంతకాలంగా శిథిలావస్థకు చేరుకున్నది. దీని నిర్వహణ, మరమ్మతులు భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో టీఎస్‌ఆర్టీసీ అధికారులు కూడా ఆ వైపు దృష్టి సారించ లేదు. షెడ్డు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదపు అంచుల్లో ఉండటాన్ని ముందే పసిగట్టిన టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ షెడ్డు లోపలికి సిటీబస్సుల రాకపోకలను నిషేధించి, అటువైపు ప్రయాణికులు, ప్రజలు ఎవరూ వెళ్లకుండా ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్లే మార్గంలో ఐదురోజుల క్రితమే అడ్డంగా గోడను నిర్మించారు. బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. షెడ్డు లోపల ఉన్న దుకాణాదారులను బయటికి తరలించారు. కాగా గురువారం తెల్లవారుజామునే భారీశబ్దంతో షెడ్డు కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. తుప్పుపట్టిన షెడ్డు భాగం సగానికి చీలిపోయి కుప్పుకూలింది. ఇదిలాఉండగా షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలిన ఉదంతంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్డును కావాలనే కూల్చి వేశారా? అని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏడవ నిజాం హయాంలో నిర్మాణం

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మిసిసిపీ ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్‌ను అమెరికాకు చెందిన బట్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి 1930లో దిగుమతి చేసుకున్నారు. ప్రీఫ్యాబ్రికేటెడ్ విధానంలో దీన్ని తయారుచేశారు. నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ తొలి డిపోగా, ఉమ్మడి రాష్ట్ర రాజధాని సెంట్రల్ బస్‌స్టేషన్‌గా ఉపయోగ పడిన చరిత్ర దీనికి ఉంది. ఎన్నార్టీడీ నుంచి నిజాం స్టేట్ రైల్వే విడిపోయిన తరువాత రోడ్ ట్రాన్స్‌పోర్డు డిపార్ట్‌మెంట్ పరిధిలో తొలి బస్‌డిపోగా మారింది. ఆ తరువాత సెంట్రల్ బస్‌స్టేషన్‌గా మారి ఆరు దశాబ్దాలకు పైగా ప్రయాణికులకు సేవలందించింది. 1992లో మూసీనది మధ్యలో నిర్మించిన ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లోకి రాష్ట్ర, అంతరాష్ట్ర సర్వీసుల బస్‌స్టేషన్ మారింది. అనంతరం ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌కు మహాత్మాగాంధీ సెంట్రల్ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)గా నామకరణం చేశారు. జంటనగరాల్లోని రాణిగంజ్ బస్‌డిపోలో మరో రెండు హ్యాంగర్లు నిర్మించారు.

అమెరికా నుంచి సముద్రమార్గంలో తీసుకొచ్చారు

నగరానికి చెందిన చరిత్రకారుడు అల్లామా ఎజాజ్ ఫారుఖ్ సీబీఎస్ షెడ్డు కూలిన ఘటనపై స్పందిస్తూ భారీ హ్యాంగర్‌ను ఆనాడు అమెరికా నుంచి సముద్రమార్గంలో మనదేశానికి తీసుకొచ్చి, తర్వాత రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు తరలించారన్నారు. దీన్ని గౌలిగూడ ప్రాంతంలో మూసీనది ఒడ్డున ఏర్పాటు చేశారు. విడివిడిగా తీసుకొచ్చిన హ్యాంగర్ భాగాలను గౌలిగూడ వద్ద ఒకటిగా కూర్చి భారీషెడ్డును ఏర్పాటు చేశారన్నారు.
CBSBusStop1

సుమారు రెండు ఎకరాల్లో హ్యాంగర్

సీబీఎస్ గౌలిగూడ హ్యాంగర్ (షెడ్డు)ను 1.77 ఎకరాల స్థలంలో నిర్మించారు. దీని పరిసరాల స్థలం కలుపుకొని ప్రస్తుతం ఇక్కడ నాలుగెకరాల స్థలం ఉన్నది. 1930లో ఏర్పాటైన ఈ హ్యాంగర్ 1951 నుంచి ఆర్టీసీ ఆధీనంలోకి వచ్చింది. అప్పటినుంచి బస్‌స్టేషన్‌గా, బస్‌డిపోగా ఈ హ్యాంగర్ 1994 వరకు అంతరాష్ట్ర, జిల్లా సర్వీసులకు ప్రధాన బస్‌స్టేషన్‌గా ఉపయోగపడింది. 2006 నుంచి సీబీఎస్ సిటీ బస్‌స్టేషన్‌గా మార్చారు. ప్రతిరోజు 29 బస్‌డిపోలకు చెందిన 510 బస్సులు ఇక్కడినుంచి 2385 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతిరోజు 85 వేల మంది ప్రయాణికుల రాకపోకలకు ఇది ఉపయోగపడుతున్నది. రోజుకు 85 నైట్‌హాల్ట్ బస్సులకు పార్కింగ్‌గా కూడా ఉపయోపడుతున్నది. ఇప్పుడు ఫలక్‌నుమా, కాచిగూడ, రాజేంద్రనగర్, మిధాని డిపోలకు చెందిన 110 బస్సులు, డ్రైవర్, కండక్టర్లకు చేంజ్‌ఒవర్స్ కోసం సీబీఎస్ ఉపయోగపడుతున్నది. ఇక్కడి 24 షాపులు, ఇతర వాటి ద్వారా టీఎస్‌ఆర్టీసీకి నెలకు 1,27,293 రూపాయల ఆదాయం వస్తున్నది. బస్‌పాస్ కౌంటర్‌తోపాటు ఇక్కడ అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉండేది. ప్రస్తుతం ఈ హ్యాంగర్ హైదరాబాద్ రీజియన్‌లోని కాచిగూడ డిపో పర్యవేక్షణలో కొనసాగుతున్నది. నిజాం కాలం నుంచి నేటి వరకు ప్రయాణికులకు సేవలందించిన ఈ బస్‌స్టేషన్‌తో ప్రతి ఒక్కరికి ఎంతో అనుబంధం ఉందని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ అన్నారు. దూరప్రాంతాల నుంచి నగరానికి విచ్చేసే ప్రయాణికులు ఎక్కడికి చేరుకోవాలన్నా ఈ బస్‌స్టేషన్‌ను ఆశ్రయించే వారన్నారు.

5437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles