మధుకాన్‌పై సీబీఐ కేసు


Thu,March 14, 2019 02:45 AM

CBI Files Case Against Madhucon Companies Over Irregularities in NH-33 Highway Project

-టీడీపీనేత నామా నాగేశ్వరరావు సంస్థ బాగోతం
-బ్యాంకులకు రూ.వెయ్యి కోట్లు కుచ్చుటోపీ
-జార్ఖండ్‌లో ఎన్‌హెచ్-33 నిర్మాణంలో అవకతవకలు
-సంస్థ సీఎండీ, డైరెక్టర్లపై కేసులు
-వరుసగా బయటపడుతున్న టీడీపీ నేతల అక్రమాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ టీడీపీలో కీలక నేత నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థపై సీబీఐ కేసు నమోదైంది. జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి కెనరాబ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.1029.39 కోట్ల మేర నష్టం కలిగించిన ఆరోపణలపై జార్ఖండ్ రాజధాని రాంచీలో కేసు నమోదుచేశారు. ఎన్‌హెచ్-33 నిర్మాణం కోసం మధుకాన్ సంస్థ స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఏర్పాటుచేసిన రాంచీ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ సీఎండీ కే శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఎన్ సీతయ్య, ఎన్ పృథ్వీతేజతోపాటు మధుకాన్ ప్రాజెక్టు లిమిటెడ్, మధుకాన్ ఇన్‌ఫ్రా, మధుకాన్ టోల్ హైవే లిమిటెడ్, ఆడిటింగ్ సంస్థలు, కోటా అండ్ కంపెనీపై రాంచీ సీబీఐ అడిషనల్ ఎస్పీ వెరోనిక లక్రా మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. బ్యాంకుల కన్సార్షియానికి చెందిన కొందరు అధికారులపైనా కేసు నమోదుచేశారు. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, నకిలీ ధ్రువపత్రాల వినియోగం, అకౌంట్లను తారుమారు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో నేరపూరిత దుష్ప్రవర్తన అభియోగాల కింద ఐపీసీ 120-బీ రెడ్‌విత్ 420, 468,471, 477ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇదీ కుంభకోణం

ఎన్‌హెచ్-33లో భాగంగా రాంచీ నుంచి జంషెడ్‌పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగులేన్ల జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టును మధుకాన్ ప్రాజెక్ట్స్ కంపెనీ దక్కించుకున్నది. 2011 మార్చి 18న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఈ ప్రాజెక్టును మధుకాన్‌కు అప్పగించింది. ఇది డిజైన్- బిల్డ్- ఫైనాన్స్- ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) మోడల్ ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో మధుకాన్ సంస్థ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ పేరుతో ఎస్పీవీని ఏర్పాటుచేసింది. రూ.1,655 కోట్లు విలువైన ఈ ప్రాజెక్టుకు కెనరాబ్యాంక్ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్షియం రూ.1,151.60కోట్లు రుణం అందించేందుకు అంగీకరించింది. అయితే మధుకాన్ కంపెనీ డైరెక్టర్లు మోసపూరితంగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, అకౌంట్లు తారుమారుచేసి బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1029.39 కోట్లు కొల్లగొట్టారు. వాటిని మధుకాన్ గ్రూప్‌నకు చెందిన పలు సంస్థల్లోకి మళ్లించారు. ఈ వ్యవహారం బయటపడటంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ ఏడాది జనవరి 31న నిర్మాణ కాంట్రాక్టును రద్దుచేసింది. ఈ గోల్‌మాల్‌పై 2017 నవంబర్‌లోనే రాంచి హైకోర్టులో పిటిషన్ దాఖలుకాగా.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని ఢిల్లీలోని ఎస్‌ఎఫ్‌ఐవో (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్)ను ఆదేశించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐవో లోతుగా దర్యాప్తుచేసి తన నివేదికను 2018 జూన్ 14న సీల్డ్‌కవర్‌లో కోర్టుకు సమర్పించింది. ఆరోపణలు వాస్తవేమనని తేలడంతో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలమేరకు సీబీఐ అధికారులు మంగళవారం మధుకాన్ సంస్థపై కేసులు నమోదుచేశారు.

నిన్న ఏపీ టీడీపీ నేత.. నేడు తెలంగాణ నేత

ఇప్పటికే డాటాచోరీ కేసుతో సతమవుతున్న టీడీపీకి.. పార్టీలోని నేతల చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటం మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రెండురోజుల కిందటే ఏపీ టీడీపీలో కీలకనేత, రాజ్యసభ సభ్యుడు డొల్ల కంపెనీలు సృష్టించి రూ.రెండువేల కోట్లమేర మోసగించినట్టు జీఎస్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దాదాపు రూ.500 కోట్లమేర జీఎస్టీ ఎగ్గొట్టినట్టు గుర్తించారు. ఈ వ్యవహారం ఏపీ టీడీపీని ఒక కుదుపు కుదిపింది. తాజాగా తెలంగాణ టీడీపీ కీలకనేత కంపెనీ వ్యవహారం బయటికి వచ్చింది. పచ్చపార్టీ నేతల డబ్బు ఎగవేత బాగోతాలు బయటికివస్తుండటం ఆ పార్టీ అధినేతకు మింగుడుపడటం లేదు. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చీకటి వ్యవహారాలు బయటపడుతుండటంతో చంద్రబాబులో మరింత వణుకు మొదలైనట్టు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్నది.

3162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles