అఖిలప్రియ భర్తపై కేసు

Thu,October 10, 2019 02:32 AM

-గచ్చిబౌలి పీఎస్‌లో నమోదు
శేరిలింగంపల్లి: ఏపీకి చెందిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామనాయుడుపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కర్నూ లు జిల్లా జోర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన పైడేల శివరామరెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన భూమా శోభానాగిరెడ్డి కలిసి 2012లో ఆళ్లగడ్డ పెద్ద కందుకూరులో క్రషర్ ఇండస్ట్రీని స్థాపించారు. శోభానాగిరెడ్డి తదనంతరం ఆమె వాటా కుమార్తె భూమా అఖిలప్రియకు ఇచ్చారు. గత నెల 14న అఖిలప్రియ భర్త భార్గవ పది మంది అనుచరులతో కలిసి వెళ్లి సదరు క్రషర్ ఇండస్ట్రీని తనకు అప్పగించాలని శివరామిరెడ్డితోపాటు ఉద్యోగులు, సిబ్బందిని బెదిరించడంతోపాటు దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 1న బాధితుడు శివరామిరెడ్డి భార్య భార్గవి లత ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై రమేశ్‌కుమార్.. భార్గవతోపాటు పది మంది అనుచరులపై కేసు నమోదుచేశారు.


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏ1 నిందితుడిగా ఉన్న భార్గవను పట్టుకొనేందుకు ఎస్సై రమేశ్ ఈ నెల 7న రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు గచ్చిబౌలి నానక్‌రాంగూడలో నిఘా పెట్టారు. నలుపు రంగు ఫార్చునర్ కారును నడుపుకొంటూ వెళ్తున్న భార్గవను గమనించిన ఎస్సై తన బృందంతో అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన భార్గవ వారిని ఢీకొట్టినట్టు చేసి, భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఎస్సై ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు భార్గవపై 353, 336 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles