సాహితీవేత్త జగదీశ్వర్ ఆత్మహత్య


Wed,July 18, 2018 03:14 AM

Cartoonist  writer commits suicide by jumping off moving train

-రైల్వే ట్రాక్‌పై పడి బలవన్మరణం
-తెలంగాణ మాండలికంలో అద్భుత ప్రయోగాలతో వినుతి
-ఇటీవలే తెలుగువర్సిటీ కీర్తిపురస్కారం

రామన్నపేట: ప్రముఖ బాలల సాహితీవేత్త, కార్టూనిస్టు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెండెం జగదీశ్వర్ (42) ఇకలేరు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన జగదీశ్వర్.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం బాలనర్సింహస్వామి దేవాలయ శివారులో మంగళవారం ఉదయం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. జగదీశ్వర్ మృతదేహం ఛిద్రమైపోవడంతో తొలుత ఎవరూ గుర్తించలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు ఐడీకార్డు, సెల్‌ఫోన్ ఆధారంగా చనిపోయింది జగదీశ్వర్ అని గుర్తించారు. రామన్నపేటకు చెందిన జగదీశ్వర్ కొన్నేండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఇటీవలే చిట్యాల మండలం చిన్నకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు బదిలీ అయ్యారు.

గొప్ప సాహితీవేత్త..

తెలంగాణ మాండలికంలో అద్భుత ప్రయోగాలు చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు పెండెం జగదీశ్వర్. బాలల కథలు రాయడంలో అందెవేసిన చెయ్యి. రెండు దశాబ్దాలపాటు ఎన్నో బాలల కథలు రచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు పొందారు. చెట్టుకోసం కథను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా స్వీకరించింది. ఆయన రచించిన తోవ, సోపతి, పుంటికూర, దోస్తులు, బడి పిల్లల కథలు, ఆనంద వృక్షం, ఉపాయం, ముగ్గురు అవివేకులతోపాటు 65కు పైగా కథల పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన రచించిన గజ్జెల దయ్యంకు 2015లో బాల సాహిత్య పురస్కారం లభించింది. 2016లో తెలంగాణ మాండలికంలో రాసిన బడిపిల్లగాల్ల కథలు తొలి బాలల కథా సంకలనం. బాలల సాహిత్యంలో ఆయన చేసిన సేవకు ఇటీవలే తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం ఇచ్చి గౌరవించింది. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. జగదీశ్వర్ మరణవార్త తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు విషాదంలో మునిగిపోయారు. ఆయన సాహిత్య సేవలను గుర్తు చేసుకున్నారు.

1354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles