మూలకణ లోపంతో క్యాన్సర్

Tue,January 22, 2019 02:35 AM

-ప్రారంభదశలో గుర్తిస్తే 80 శాతం నియంత్రణ
-ప్రతిఏటా లక్షమందిలో 100 మందికి వ్యాధి
-జీన్స్‌థెరపీతో క్యాన్సర్‌ను అరికట్టే ప్రయోగాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: క్యాన్సర్.. భయకంరమైన ప్రాణాంతకవ్యాధి. ఈ వ్యాధి గురిం చి సరైన అవగాహనలేక పలువురు మృత్యువాత పడుతున్నారు. కొందరు చివరిదశలో తెలుసుకుని దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. కారణాలేవైనా క్యాన్సర్ మాత్రం చాపకింది నీరులా వ్యాపిస్తున్నది. ఏటా లక్షమందిలో 100 మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నట్టు ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన వైద్యు లు తెలిపారు. దాదాపుగా అన్నిరకాల క్యాన్సర్ వ్యా ధుల నివారణకు మందులు అందుబాటులోకి వచ్చి నా.. ప్రారంభదశలో గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తేనే నివారించవచ్చని, అది రెండోదశకుకానీ, అంతకంటే ఎక్కువకు చేరుకుంటే నివారించడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కాన్సర్ వ్యాధులు చిన్నపిల్లలు, వయస్సుపైబడినవారిలోనే అధికంగా వస్తుంటాయని ఎంఎన్‌జే దవాఖానకు చెందిన ప్రముఖ క్లినికల్ అంకాలజిస్టు డాక్టర్ చింతమడక సాయిరామ్ తెలిపారు.

కణాలు అసంబద్ధంగా ఎదగడమే వ్యాధికారకం

మనిషి ఎదుగుదల సమయంలో జరిగే మూలకణాల విభజన సక్రమంగా ఉండాలి. అలా కాకుండా కొందరిలో కణాలు అసంబద్ధంగా ఎదుగుతాయి. ఈ రకమైన కణాల ఎదుగుదలలో ఏర్పడిన దోషాన్నే క్యాన్సర్ అంటారని ఎంఎన్‌జే క్లినికల్ అంకాలజిస్టు డాక్టర్ సాయిరామ్ స్పష్టంచేశారు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, వయస్సుపైబడినవారిలో జరుగుతుందని తెలిపారు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు కణాల విభజన చాలావేగంగా జరుగుతుందని, ఈ క్రమంలో కొన్నిసార్లు కణాల విభజనలో దోషాలు ఏర్పడతాయన్నారు. ఈ దోషమే క్యాన్సర్‌వ్యాధిగా మారుతుందని వివరించారు. శరీరంలో ఏర్పడే గడ్డలన్నీ క్యాన్సర్‌గడ్డలు కావని, కొన్ని మాత్రమే క్యాన్సర్‌గడ్డలు ఉంటాయని, వాటిని వైద్యపరీక్షలద్వారానే గుర్తించగలమని తెలిపారు.

జన్యులోపంతో వచ్చేవి 10 శాతమే!

జన్యుపరంగా కేవలం 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే క్యాన్సర్‌వ్యాధి సోకే అవకాశాలున్నట్లు డాక్టర్ సాయిరామ్ వివరించారు. మిగిలినవాటిలో ఓరల్, లివర్, పెద్దపేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్స్ వంటివి జీవన విధానంతో ఎక్కువగా ముడిపడి ఉంటాయని తెలిపారు. పొగాకు, గుట్కా, పాన్‌మసాలా వంటివి ఎక్కువగా తినేవారిలో నోటిక్యాన్సర్ అధికంగా వస్తుందని, పొగతాగడం, మద్యపానంతో కాలేయం, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్‌వ్యాధులు వచ్చే ప్రమాదమున్నట్లు వివరించారు.

ప్రారంభదశలో గుర్తిస్తేనే నియంత్రణ.. నివారణ

ఏ క్యాన్సర్ వ్యాధినైనా ప్రారంభదశలో గుర్తిస్తేనే నియంత్రించడంతో పాటు నివారించే వీలుందని వైద్యులు తెలిపారు. ప్రతి క్యాన్సర్‌వ్యాధి శరీరంలో ఏదో ఒకచోట పుట్టి ఇతర భాగాలకు వ్యాపిస్తుందని డాక్టర్ సాయిరామ్ వివరించారు. వ్యాధిని ప్రారంభదశలో గుర్తించి సకాలంలో సరైన వైద్యం అందిస్తే రోగాన్ని దాదాపుగా నివారించొచ్చని చెప్పారు.

ప్రారంభదశలో గుర్తిస్తే నియంత్రించొచ్చు

ఎలాంటి క్యాన్సర్‌వ్యాధినయినా ప్రారంభదశలో గుర్తిస్తే నివారించే అవకాశం 80 శాతం ఉంటుంది. సాధారణంగా మనిషి శరీరంలోని ఆర్గాన్‌సెల్స్ డివిజన్స్‌లో ఏర్పడే ఎర్రర్స్ (కణాల విభజనలో దోషాలు) కారణంగా క్యాన్సర్ సోకుతుంది. ఏర్పడిన ఎర్రర్స్‌ను సరిచేసేందుకు వీలుగా ప్రతిఒక్కరిలో ఒక ప్రత్యేక మెకానిజం ఉంటుంది. కొందరిలో పుట్టుకతోనే ఆ మెకానిజం ఉండదు. అలాంటివారికి జీన్స్‌థెరపీ ఒక్కటే మార్గం. జీన్స్‌థెరపీతో క్యాన్సర్‌ను పూర్తిగా నిరోధించవచ్చని మెడికల్ థియరీ చెబుతున్నది. అన్నిరకాల క్యాన్సర్‌లకు కాకపోయినా.. కొన్నింటికి ముందస్తు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ హెచ్‌పీ వైరస్ కారణంగా వస్తున్నది.

ఈ వైరస్ రాకుండా బాలికలకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు.హెపటైటిస్‌త్లో లివర్ క్యాన్సర్ వస్తుంది. అందుకు హెపటైటిస్-బీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇలా కొన్నింటికి మాత్రమే వ్యాక్సిన్‌లు ఉన్నాయి. సాధారణంగా ప్రతిఒక్కరు 40ఏండ్లు దాటగానే క్యాన్సర్ స్క్రీనిం గ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మహిళలకు స్క్రీనింగ్ అత్యవసరం. ఎందుకంటే వారిలో ఎక్కువగా రొమ్ము, గర్భాశయ, తదితర క్యాన్సర్‌లు వస్తుంటాయి. ఈ మధ్య పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అధికంగా వస్తున్నది. క్యాన్సర్‌వ్యాధులపై భయంకన్నా అవగాహన అవసరం. వ్యాధులపై అవగాహన ఉంటే సోకకుండా జాగ్రతపడవచ్చు.
-డాక్టర్ చింతమడక సాయిరామ్ (క్లినికల్ ఆంకాలజిస్టు, ఎంఎన్‌జే దవాఖాన)

వ్యాధిని గుర్తించగలిగే కొన్ని లక్షణాలు

1. మూడువారాలకు మించి గొంతునొప్పి ఉండటం - గొంతు క్యాన్సర్
2. మూడువారాలకు మించి దగ్గు ఉండటం - ఊపిరితిత్తుల క్యాన్సర్
3. అజీర్తి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం - లివర్ క్యాన్సర్
4. శరీరంలో రక్తస్రావాలు, పుట్టుమచ్చల్లో మార్పులు - క్యాన్సర్ లక్షణం

ఎక్కువగా మరణాలకు కారణమయ్యే క్యాన్సర్‌లు

-నోటిక్యాన్సర్, గొంతుక్యాన్సర్, అన్నవాహిక, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, కాలేయ క్యాన్సర్‌లు

1744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles