కేంద్ర పథకాల అమలుపై సమీక్ష

Thu,February 21, 2019 03:06 AM

-ఒకేరకమైన పథకాలకు నిధుల కేటాయింపుపై చర్చిస్తాం
-జీఎస్టీలో త్వరలో మార్పులుండవచ్చు..
-15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షిస్తామని పదిహేనో ఆర్థికసంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ చెప్పారు. కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ర్టాలకు ఏ విధంగా నిధులు మంజూరుచేయాలనే అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేంద్ర పథకాలలో కొన్నింటికి భారీగా ఖర్చవుతున్నదని, అలాంటి పథకాలపై రాష్ర్టాలకు ప్రత్యామ్నా యం కల్పించడంపై ఆలోచించాలని పేర్కొన్నారు. బుధవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఆర్థిక నిపుణలతో పదిహేనో ఆర్థికసంఘం సమావేశం నిర్వహించిం ది. ఈ సమావేశంలో ఆర్థిక నిపుణుడు వైవీ రెడ్డి, ఆర్థికసంఘం సభ్యులు అనూప్‌సింగ్, అశోక్ లాహిరి, అరవింద్‌మెహతా, రమేశ్‌చంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌కే సింగ్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ వంటి పథకానికి భారీగా నిధులు అవసరమవుతాయని, కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి రాబోయే ఐదేండ్లలో రూ.5 లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. పలురాష్ట్రాలు కూ డా ఈ విధమైన పథకాలను అమలు చేస్తున్నాయని, అలాంటి పథకాలకు నిధులుసమకూర్చే అంశంపై సమీక్షిస్తామని తెలిపారు.

కేంద్రం, రాష్ర్టాలు ఒకే రకమైన పథకాలను అమలుచేసినప్పుడు లబ్ధిదారులకు రెండువిధాలుగా మేలు జరుగుతుందని.. రాష్ట్రంలో అమలుచేసే పథకాన్ని కేంద్రం కూడా ప్రవేశపెడితే ఆ నిధులను ఇతర పథకాలకు ఖర్చుచేసుకొనే వెసులుబాటును రాష్ర్టాలకు కల్పించే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాబోయే బడ్జెట్‌లో, జీఎస్టీలో మార్పులు ఉండే అవకాశం ఉన్నదన్నారు. ఆర్థికరంగంలో కేంద్రీకృత వ్యవస్థను తొలిగించాలని ఆర్థిక నిపుణుడు వైవీ రెడ్డి సూచించారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలనే నిబంధనలు ఉండకూడదని, కేవలం అవకాశంగా మాత్రమే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికసలహాదారు బీఆర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆర్థికసంఘం సభ్యులు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో నష్టాలను రూపుమాపాలని, భవిష్యత్‌లో ఆర్థిక వనరులు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే 15వ ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తామని పేర్కొన్నారు.

ISB2

గురుకులాల నిర్వహణ బాగున్నది

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను నిర్వహించే విధానం చాలాబాగుందని 15వ ఆర్థిక సంఘం సభ్యులు ప్రశంసించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, ప్రత్యేక విద్యాబోధన, నిర్వహణకు అందించే నిధులు, ఇతర విధానాలను వారు అభినందించారు. గౌలిదొడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలను బుధవారం 15వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ అశోక్‌లాహరి, అరవింద్‌మెహతా, డాక్టర్ రవికోట సందర్శించారు.

భేష్.. తెలంగాణ మీసేవ

తెలంగాణలో మీసేవల పనితీరు అభినందనీయమని 15వ ఆర్థికసంఘం ప్రశంసించింది. బుధవారం బంజారాహిల్స్‌లోని మీసేవ కమిషనర్ కార్యాలయాన్ని ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్‌మెహతా, సంయుక్త కార్యదర్శి రవికోట, సభ్యులు అశోక్‌లాహిరి సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న పారదర్శక సేవల గురించి ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, మీసేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వర్‌రావు ఆర్థికసంఘం సభ్యులకు వివరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మీసేవల ద్వారా టెక్నాలజీ వినియోగం, జరిగిన అభివృద్ధిని తెలిపారు. ఆన్‌లైన్ సేవలు అందించడంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీ-యాప్ పోలియో, టీ-వాలెట్, సమగ్రవేదిక యాప్‌ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. తెలంగాణ మీసేవ పనితీరును ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆర్థిక సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు.

2014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles