బడ్జెట్‌కు తుదిరూపు


Mon,February 11, 2019 02:25 AM

budget 2019 A huge rise in investment cost

-వ్యవసాయం, సంక్షేమానికి పెద్దపీట..
-భారీగా పెరుగనున్న పెట్టుబడి వ్యయం
-పూర్తి వివరాలతోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్..
-రెండు లక్షల కోట్లు దాటనున్న పద్దు!

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చే ఆర్థికసంవత్సరానికి సంబంధించి ఈ నెల చివరివారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్‌కు రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చే ఆరునెలల కాలానికి ద్రవ్యవినిమయానికి చట్టసభల అనుమతి తీసుకోనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రగతిపద్దు, నిర్వహణ పద్దుకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపర్చారు. సంక్షేమ, వ్యవసాయరంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని సమాచారం. పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరుగనున్నట్టు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 33 వేల కోట్లుగా ఉన్న పెట్టుబడి వ్యయం 2019-20 ఆర్థిక సంవత్సరానికి 40 వేల కోట్లకు పైగా దాటనున్నట్టు తెలిసింది. భవిష్యత్ అవసరాలకు నిధులను ఖర్చుచేయడంలో తెలంగాణ.. దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అన్నిరకాల రెవెన్యూ రాబడులు కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కోటి 50 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ఆఖరువరకు రాష్ట్ర సొంత పన్నుల రాబడులు, పన్నేతర రాబడులు, గ్రాంట్స్-ఇన్-ఎయిడ్, కేంద్రపన్నులలో వాటా మొత్తం కలిపి కోటి 30 లక్షల రూపాయలకు పైగా సమకూరుతుందని 2018-19 బడ్జెట్‌లో అంచనావేశారు. తాత్కాలిక బడ్జెట్ అయి నా పూర్తిస్థాయిలో అన్ని వివరాలతో తుదిరూప మిస్తున్నారు.

2 లక్షల కోట్లతో బడ్జెట్

ఈసారి రాష్ట్ర బడ్జెట్ రెండులక్షల కోట్ల రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు. గత నాలుగేండ్లుగా రాష్ట్ర సొంత రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతుండటంతో బడ్జెట్ సైజు కూడా అంతే భారీగా పెరుగుతున్నది. ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాంలు నీటిపారుదలరంగం,ఆసరా పింఛన్లు, ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, హరితహారం, మిషన్‌కాకతీయ, ఆసరా ఫించన్లపెంపు తదితర అంశాలను ప్రధానంగా పేర్కొంటున్నారు. ఈసారి వ్యవసాయరంగానికి కేటాయింపులు భారీగా పెరుగనున్నాయి. రైతుబంధు కింద పంటపెట్టుబడి సాయాన్ని పెంచడం, రైతుబీమా, రుణమాఫీ, క్రాప్‌కాలనీలకు రూ.40 వేల కోట్లు, సాగునీటిరంగానికి 26 వేల కోట్లు కేటాయించే అవకాశముంది. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతి నిధి వివరాలు బడ్జెట్‌లో ఉంటాయి.

ప్రతి పైసాకు లెక్క

పైసా పైసాకు పక్కాలెక్క ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఆయా శాఖలకు విడుదలైన ప్రతీ పైసాకు లెక్క చూపడానికి అధికారులు అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ఏయే శాఖలో ఎంతమంది ఉద్యోగులున్నారు? వారికి నెలవారీగా చెల్లిస్తున్న వేతనాల మొత్తం ఎంత? ఖాతాలవారీగా వివరాలు సిద్ధమయ్యాయి. కేం ద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడునెలల్లోగా మరింత సమగ్రమైన వివరాలతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముందని అధి కారులు పేర్కొంటున్నారు. ముందుజాగ్రత్తగా ఆరునెలల కాలానికి ద్రవ్యవినిమయానికి చట్టసభల ఆమోదం తీసుకోవాలని నిర్ణయించారు.

3454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles