నడిరోడ్డుపై నరికేశారు


Tue,March 13, 2018 03:01 AM

Brutal Murder of Inter Student Sudheer In Hyderabad

-కూకట్‌పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య..
-పరీక్షకు వెళ్తుండగా కత్తులతో దాడి
-క్రికెట్ గ్రౌండ్‌లో మొదలైన గొడవ
-గ్రూప్‌ల మధ్య ఘర్షణగా రూపాంతరం
-హతుడు, నిందితులు 18 ఏండ్లలోపువారే
-ఒక నిందితుడిని పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్

naveen
కూకట్‌పల్లి/హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన చిన్న కొట్లాట ఓ ఇంటర్ విద్యార్థి హత్యకు దారితీసింది. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో గ్రూపులుగా ఏర్పడి పెంచుకున్న పగ .. నడిరోడ్డుపై వేటకొడవళ్లతో నరికి చంపే స్థాయికి వెళ్లింది. సోమవారం ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థిని హైదరాబాద్ కూకట్‌పల్లిలో నలుగురు యువకులు కలిసి హత్య చేశారు. జాతీయ రహదారిపై పరిగెత్తించి వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనలో హతుడు, నిందితులంతా 18 ఏండ్లలోపు వారే కావ డం గమనార్హం. ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంబడించి ఓ నిందితుడిని పట్టుకోవడంతో హత్య గుట్టు వీడింది. ఏసీపీ భుజంగరావు, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. హైదరాబాద్ మూసాపేట్‌లోని యాదవబస్తీకి చెందిన ఎలగల రాజు చిన్న కొడుకు సుధీర్(18) కూకట్‌పల్లిలోని ప్రతిభ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వార్షిక పరీక్ష రాసేందుకు సోమవారం ఉదయం తన స్నేహితులు మేఘనాథ్, సాయితో కలిసి ఒకే బైక్‌పై బయలుదేరాడు. వారు 8.15 గంటలకు కూకట్‌పల్లిలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సాగర్ హోటల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న మూసాపేట్‌కు చెందిన మహేశ్, నవీన్, తేజ, కృష్ణ కలిసి సుధీర్‌ను బైక్‌పై నుంచి కిందికి లాగి వేటకొడవళ్లతో దాడి చేశారు. సుధీర్ వారి నుంచి తప్పించుకొని పరుగెడుతూ రోడ్డుపై వెళ్తున్న ఓ స్కూల్ బస్సులోకి ఎక్కాడు. ఆ నలుగురు వెంబడించి సుధీర్‌ను బస్సులో నుంచి బయటికి లాగి రోడ్డుపై పడేసి విచక్షణారహితంగా దాడిచేశారు. మెడ, మొఖంపై తీవ్రగాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై సుధీర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు, సీఐ ప్రసన్నకుమార్ సంఘటనాస్థలాన్ని సందర్శించారు.

కాలర్ పట్టుకోవడంతో మొదలై..

సుధీర్ ఈ నెల 9న క్రికెట్‌గ్రౌండ్‌లో ఆడుతున్న పిల్లలతో గొడవపడ్డాడు. అక్కడే ఉన్న కృష్ణ అతడిని నిలదీసి కాలర్ పట్టుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయా న్ని సుధీర్ తన సోదరుడు ప్రసాద్‌కు చెప్పడంతో అతడు స్నేహితులను తీసుకొచ్చి కృష్ణను చితకబాదాడు. ఆ మరునాడు సుధీర్ మళ్లీ వచ్చి కృష్ణతోపాటు అతడి స్నేహితులు తేజ, నవీన్‌ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఎలాగైనా సుధీర్‌ను హత్యచేయాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. మహేశ్‌ను కూడా తమతో కలుపుకొన్నారు. శనివారం కూకట్‌పల్లిలో ఫుట్‌పాత్‌మీద ఐదు కత్తులు, వేటకొడవళ్లు కొన్నా రు. వాటిని సాన పట్టించమని చెప్పి ఆదివారం సాయంత్రం తీసుకున్నారు. సుధీర్ కూకట్‌పల్లిలోని చైతన్య కాలేజీలో పరీక్ష రాసి బయటికి రాగానే హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. సోమవారం సుధీర్, మేఘనాథ్, సాయి కలిసి బైక్‌పై బయలుదేరగా నలుగురు నిందితులు వెంబడించారు. 8.15 గంటలకు కూకట్‌పల్లిలోని సాగర్ హోటల్ వద్ద ఒకరికొకరు ఎదురుపడ్డారు. సుధీర్ వారిని చూస్తూ ఇవ్వాళ్ల మీ పని అయితదిరా అంటూ రెచ్చగొట్టడంతో మహేశ్ తన బుల్లెట్ బైక్‌ను సుధీర్ బైక్‌కు అడ్డం పెట్టాడు. వెనుక నుంచి యాక్టివా మీద వచ్చిన నవీన్, కృష్ట, తేజ బండి డిక్కీ నుంచి కత్తులు, వేటకొడవళ్లు తీసి సుధీర్‌ను నరికిచంపారు. సుధీర్‌తో ఉన్న సాయి, మేఘనాథ్ భయంతో పారిపోయారు.

నవీన్‌ను పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్

ఘటనా స్థలానికి సమీపంలోనే కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ విధులు నిర్వహిస్తున్నారు. ఒకచోట ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో కనుక్కునేందుకు వెళ్తుండగా కొందరి చేతుల్లో కత్తులు కనిపించాయి. వెంటనే ఆయన ఘటనా స్థలానికి పరిగెత్తగా నిందితుడు నవీన్ పారిపోతూ కనిపించాడు. దీంతో ఆయన రోడ్డుపై వెళ్తున్న వాహనదారుడి సాయంతో నవీన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. నవీన్ కత్తితో దాడిచేసేందుకు ప్రయత్నించగా తప్పించుకొన్నారు. నవీన్‌ను అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

పలు గ్రూప్‌లు.. తరుచూ తగాదాలు

ముసాపేట్‌లోని యాదవ బస్తీ, జనతా నగర్‌లో ఉన్న యువ త గ్రూప్‌లుగా ఏర్పడి గిల్లి గ్యాంగ్, బుల్లెట్ షూటర్స్, ముసాపేట్ రూలర్స్, జిల్లా మైయ్యి పేర్లతో హల్‌చల్ చేస్తున్నట్టు, ఆధిపత్యం కోసం గొడవలు పడుతున్నట్టు తెలుస్తున్నది. కాలనీల్లో కేకలు పెడుతూ తిరుగుతారని, అల్లరి చేస్తుంటారని సమాచారం. వీరికి వాట్సప్‌లో, సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూప్‌లు ఉన్నట్టు తెలువడంతో పోలీసులు నిఘా పెట్టారు. యాదవబస్తీ, జనతానగర్‌లో పికెట్ ఏర్పాటు చేశారు.

10435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles