మహాబలి నిష్క్రమణ..


Sun,June 5, 2016 01:47 AM

boxing legend Muhammad Ali passes away

mohammad

అలీవిదా!


ప్రతికూల పరిస్థితుల నడుమ ప్రపంచ బాక్సింగ్‌లోకి దూసుకొచ్చిన పంచ్ అతనిది..! జాత్యహంకార మదాన్ని తన పిడిగుద్దులతో తుత్తునియలు చేసిన నల్లజాతి వజ్రం అతను!.. రెండు దశాబ్దాలు రింగ్‌లో ప్రత్యర్థులను హడలెత్తించిన మహాయోధుడు, మూడు దశాబ్దాలకుపైగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడి నిష్క్రమించాడు. కలియుగ భీముడి మహాప్రస్థానం ముగిసింది.. పిడిగుద్దుల గండరగండడి వజ్రపు దేహం నేలకొరిగింది.. బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ క్రీడాప్రపంచానికి శాశ్వతంగా నాకౌట్ చెప్పాడు. వీరుడి శరీరానికి మరణం.. వీరత్వం అమరం.. మహమ్మద్ అలీ అమర్ రహే..!!
-బాక్సింగ్ యోధుడు మహమ్మద్ అలీ కన్నుమూత
-ప్రపంచ క్రీడాలోకం ఘననివాళి
-గ్రేటెస్ట్‌కు ఇండియా ఫిదా!
-ఆ వీరుడంటే భారతీయులకుఅంతులేని అభిమానం
-ఇందిర మొదలు రఫీ దాకా అభిమానులే
-అలీ, బిగ్‌బీ కాంబినేషన్‌లో సినిమా తీయాలనుకున్న ప్రకాశ్ మెహ్రా

మహమ్మద్ అలీ తన పంచ్‌లతో ప్రపంచాన్ని వణి కించాడు. అతను ఎప్పటికీ గ్రేటెస్ట్. గొప్ప పోరాట యోధుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము.


గ్రేటెస్ట్ బాక్సర్ మహమ్మద్ అలీ మరణం ప్రపంచానికి తీరని లోటు. ఆదర్శప్రాయమైన క్రీడాకారునిగా ఖ్యాతికెక్కిన అలీ ఆత్మకు శాంతి చేకూరాలి. సకల మానవాళికి అతని జీవితం స్ఫూర్తిగా నిలిచింది.


mohammad1
మహమ్మద్ అలీ అంటే చెక్కుచెదరని ఉక్కు సంకల్పం.. కొండను ఢీకొనే తెగువ.. సంకెళ్లను బద్దలు చేసే దీక్ష.. వివక్షను ప్రశ్నించే ధిక్కార స్వరం.. నువ్వు గ్రేటెస్ట్ అనే టైటిల్ ఎందుకు పెట్టుకున్నావు అంటే డబుల్ గ్రేటెస్ట్ అనడం ఆయనకే చెల్లింది. అందుకే దేశదేశాల్లో ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులు ఏర్పడ్డారు. బాక్సింగ్‌లో ఆయనది అజేయమైన పిడికిలి. రింగులో ప్రత్యర్థులను చిత్తు చేసినట్టుగానే రింగు బయట శ్వేత జాత్యహంకారాన్ని ఎదుర్కొన్న వీరుడుగా గుర్తుండిపోతాడు.

అందుకే భారత్ ఆయనను విపరీతంగా అభిమానించింది. వీరుడా అంటూ వందనాలు సమర్పించింది. ఇప్పుడు చేగువేరా ఫొటోల్లాగే అప్పట్లో ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ మహమ్మద్ అలీ ఫొటోలు కనిపించేవి. ఇది కేవలం క్రీడాభిమానం కాదు. అంతకుమించిన ప్రత్యేక అనుబంధం. వివక్ష మీద సన్నాయి నొక్కులు కాదు.. కావాల్సింది పిడికిలెత్తడమే అని బ్లాక్ పాంథర్స్‌కు స్ఫూర్తినిచ్చిన సాహసి ఆయన. ఆ స్ఫూర్తే భారతీయులకు ఆయనను దగ్గరగా తెచ్చింది. ఈ నల్లకలువ అసలు పేరు కాసియస్‌క్లే. కానీ తెల్లజాతి అజమాయిషీ మీద తిరగబడి మహమ్మద్ అలీగా, ఉక్కు పిడికిలిగా మారడం ఓ వీరగాథ. అమెరికా గడ్డమీద పుట్టి తెల్లజాతి దురహంకారాన్ని ప్రశ్నించి రింగులో నిలబడ్డ మొనగాడుగా గుర్తుండిపోతాడు.

mohammad2

భారత్ అంటే ఎనలేని అభిమానం..


మెరుపువేగంతో పిడిగుద్దులు విసరడం మాత్రమే కాదు మాటల్లో కూడా పంచ్‌లు మహమ్మద్ అలీ ప్రత్యేకత. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నా ఇండియా అంటే అలీకి ప్రత్యేక అభిమానం. నాటి ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని మధుర గాయకుడు మహమ్మద్ఫ్రీ దాకా మహామహులు ఆయనను కలుసుకొనేందుకు తహతహలాడేవారు. 1980లో అలీ ఇండియా సందర్శించినప్పుడు ఆయన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను, ఆయనను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. ఢిల్లీ, ముంబై, చెన్నైలలో ఆ మ్యాచ్‌లు జరిగాయి.

మ్యాచ్‌లకు గ్రేటెస్ట్ టు గ్రేటెస్ట్ అని పేరు పెట్టడం విశేషం. ఒక గ్రేటెస్ట్ అలీ.. మరి రెండవ గ్రేటెస్ట్ ఎవరూ అంటే ఇంకెవరు? జనతా ప్రయోగంతో తనను ఓడించిన విపక్షాలను చిత్తుచేసి అధికారంలోకి వచ్చిన ఇందిర! ఆ పర్యటన సందర్భంగా అలీని కలిసిన వివిధ రంగాల ప్రముఖుల పేర్లజాబితా చాంతాడంత అవుతుంది. ప్రస్తుతం అలీకి నివాళిగా నెట్‌లో ఉంచిన ఫొటోలు చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. అలీ మాత్రం మాన్యులా, సామాన్యులా అనే తేడాలేకుండా అందరితో కలిసిపోయి ఎందరెందరికో ఓ మధురస్మృతిగా మిగిలిపోయాడు. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు బాలీవుడ్ లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ మహమ్మదలీని ప్రత్యేకంగా కలుసుకోవడం ఓ విశేషమైతే బాక్సింగ్ చేస్తున్నట్టుగా ఫోజు పెట్టి ఫొటోలు దిగడం ఇంకో విశేషం.

mohammad3

జీవితమే ఓ సినిమా..


అలీ జీవితం ఓ సినిమాకథ లాంటిది. అందుకే ఆయనపై హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్నిటిలో తనపాత్ర తానే ధరించడం విశేషం. 1977లో తీసిన గ్రేటెస్ట్‌లో అలీ తనపాత్ర తానే పోషించి మెప్పించాడు. 2001లో తీసిన అలీ సినిమాలో విల్‌స్మిత్ మహమ్మదలీ పాత్ర వేస్తే ఆస్కార్ నామినేషన్ దక్కింది. హోవర్డ్ ఫాస్ట్ నవల ఆధారంగా 1979లో తీసిన ఫ్రీడంరోడ్‌లో అలీయే హీరో. ఆటలో మెడల్స్ లాగే ఇంకా కొంచెం గట్టిగా పట్టుబడితే ఆస్కార్ కూడా వచ్చేదేమో అంటారు. కొన్ని సినిమాలు ఇండియాలో కూడా విడుదలై బాగానే ఆడాయి. అందుకే ఎలాగైనా బాక్సింగ్ లెజెండ్‌ను బాలీవుడ్ సినిమాల్లోకి దించాలనే ఆలోచనలు కూడా జరిగాయి.

mohammad4
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఎనభైలలో లాస్ ఏంజిల్స్‌కు వెళ్లి మహమ్మద్ అలీని కలిశారు. ఆయన వెంట దర్శక నిర్మాత ప్రకాశ్ మెహ్రా కూడా ఉన్నారట. అలీని, తనను పెట్టి సినిమా తీయాలని మెహ్రా అనుకున్నారని బిగ్‌బీ ట్విట్టర్‌లో వెల్లడించారు. 1980లో ఇండియా వచ్చినప్పుడు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఫైట్ ఏర్పాటైంది. ఆ సందర్భంగా స్టేడియంకు వచ్చిన తమిళనాడు సినీ, పొలిటికల్ సూపర్‌స్టార్ ఎమ్జీ రామచంద్రన్‌తో అలీ చేతులు పైకెత్తినప్పుడు స్టేడియం హర్షధ్వానాలతో దద్దరిల్లడం చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

mohammad5
1990లో కోల్‌కతా వచ్చినప్పుడు అలీ చేసిన మాయాజాలం గురించి బెంగాలీ అభిమానులు కథలుకథలుగా చెప్పుకొంటారు. అమెరికాలో జాతివివక్షపై పోరాడిన అలీ అంటే బ్రిటిష్ దాస్యం నుంచి బయటపడి స్వతంత్ర వాయువులు పీలుస్తున్న భారతీయులకు అభిమానం ఉండటంలో ఆశ్చర్యం లేదు. నిజానికి వీధుల్లోకివచ్చి అలీ ఉద్యమాలు ఏవీ చేయలేదు. తాను ఎంచుకున్న రంగంలో సమున్నతంగా ఎదిగాడు. వ్యవస్థను ప్రశ్నిస్తూ రింగులో నిలబడ్డాడు. ఇలాంటి చిచ్చరపిడుగును నిజానికి అమెరికా ఎప్పుడూ చూడలేదు. సైన్యంలో చేరమంటే అది తన మత విశ్వాసాలకు విరుద్ధమంటూ ఎదురుతిరిగాడు.

వ్యవస్థను తనదారికి తెచ్చుకున్నాడు కానీ తాను వ్యవస్థకు ఏనాడూ లొంగిపోలేదు. అమెరికాలో అలీలా మాట్లాడమంటే కత్తి అంచుమీద అడుగులు వేయడమే. చిన్నప్పడు ఎవడో చిల్లర దొంగ అలీ సైకిలు ఎత్తుకుపోయాడు. అప్పుడు పన్నెండేండ్లుటాయేమో. దొంగను ఎలాగైనా పట్టుకుంటానని, ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞలు చేస్తుంటే ఓ పోలీసు చూసి ముందుగా బాక్సింగ్ నేర్చుకో అన్నాడట. అంతే.. నేరుగా జిమ్‌లోకి వెళ్లాడు. కఠోరసాధనతో బయటకు వచ్చాడు.

mohammad6
తాను ప్రతీకారం తీర్చుకోవాల్సింది చిల్లర దొంగల మీద కాదు.. నల్లజాతీయుల్ని హీనంగా చూసే విష సంస్కృతి మీద అని తెలుసుకున్నాడు. తిరుగుబాటుగా మతం మార్చుకున్నాడు. పిడిగుద్దుల్లాగే వాడిమాటలతో నల్లజాతి ప్రజల పోరాటానికి పదును పెట్టాడు. నల్లజాతి విముక్తి సందేశంలా, సంకేతంలా రెపరెపలాడాడు. ఒకప్పుడు తెల్లోళ్లు ఇచ్చిన మెడల్‌ను నదిలో పారేసి ఆ సంగతి ప్రపంచాని కి గొంతెత్తి చాటిన అలీని అమెరికా సర్వోన్నత పురస్కారంతో సత్కరించడం చరిత్రలో అరుదైన ఘటనే. మహమ్మద్ అలీ లాంటి వీరులు అరుదుగానే పుడతారు మరి!

2105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS