కాలం కన్న బిడ్డలు..

Sun,October 13, 2019 02:45 AM

-కుమ్రంభీం పోరాటానికి వారిద్దరూ ప్రత్యక్ష సాక్షులు

కుమ్రంభీం! తెలంగాణ గడ్డ మురిసే యోధుడు! అనేక పోరాటాలకు స్ఫూర్తిదాత! జల్.. జంగిల్.. జమీన్‌పై హక్కు కోసం.. మావ నాటె.. మావ రాజ్ (మన ఊళ్లో మన రాజ్యం) నినాదంతో నాటి బ్రిటిష్ అనుకూల నిజాం నవాబుమీద సాగిన పోరాటంలో (1928-1940) తుపాకిగుండ్లకు ఎదురునిలిచి అమరుడైన వీరుడు! కుమ్రంభీం చరిత్రను పాఠాల్లోనే తెలుసుకున్నాం! కానీ.. అదే చరిత్రను ఆయనను ప్రత్యక్షంగా గమనించినవారు.. ఆయన పోరాటాల్లో భాగమైనవారు చెప్తే! అలాంటి వ్యక్తులే టెకం మాని, మాచినేని భీమయ్య! కుమ్రంభీం పన్నిన యుద్ధవ్యూహాలు, ఆ మహావీరుని జీవితకాల చరిత్ర, లొద్దిల్లో, లోయల్లో గ్రామాలనుంచి యువకులను సమీకరించి చేసిన అపూర్వ యుద్ధఘట్టాలు.. ఆనాటి వీరుల త్యాగాలను కుమ్రం భీం 79వ వర్ధంతి సందర్భంగా ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నమే ఇది!

(అక్కల చంద్రమౌళి) టెకం మాని.. బాబెఝరిలో ఉంటున్న కురువృద్ధుడు. ఆనాటి కుమ్రంభీం పోరాటానికి ప్రత్యక్ష సాక్షి. బాబెఝరి వెళ్లి టెకం మానిని కలిసినప్పుడు ఆయన ఆసక్తికర విషయాలు చెప్పినాడు. టెకం మాని.. తన కొడుకు సోనేరావు ఉన్న తడకల ఇంట్లో ఉంటున్నారు. ఆయన ఇంటికి వెళ్లగా.. నులకమంచం మీద పడుకున్న టెకం మాని.. చాతకాకున్ననూ లేచి.. రాం రాం అని మర్యాద చూపించారు. రాం రాం అన్నాను. భీంలో అతి దగ్గరగా చూసిన విషయాలను చెప్పమని కోరినప్పుడు ఆయన ఇట్ల చెప్పిండు.

నా పేరు టెకం మాని. తండ్రి టెకం భీం. పుట్టింది మొవడ గ్రామం. నేనప్పుడు 15 ఏండ్ల యువకుడిని. కుమ్రంభీం మొవడ నుంచి జోడేఘాట్ పోయిండు. అడవి సాపుచేసుకుని గుడిసెలు కట్టుకుని అందరం కలిసి ఉంటె ఎవ్వడైనా మనల్ని ఏం చేయలేడని ధైర్యం చెప్పిండు. అందరినీ జోడేఘాట్‌కు పిలిచి గుడిసెలు వేసుకుని బతుకుదామన్నడు. కానీ.. నిజాం బంటులు అనేక దౌర్జన్యాలకు, అన్యాయాలు చేసిండ్రు. హర్రవ్‌ుకు బచ్చే.. జంగిల్ నరకుతరర్రా.. తెరి బాప్‌కా జాగీర్ సమజే! నడువుండ్రి అంటూ కేసులు పెట్టి, చేతివేళ్లను నరికేవారు. పంటనంతా గూడేలను దాటించటమేకాక సుంకం కట్టాలని వేధించేవారు. భీంకు అటవీ అధికారుల మీద కోపానికొచ్చి.. షేరేదార్ను ఇయ్యరమయ్యర కొడితే పారిపోయిండు. గ్రామాలు భయంతో ఊరు విడిచి బతకడానికి వేరేకాడికి పోక తప్పలేదు.

సవాలుచేసి.. సమీకరించి..

జంగ్లతోళ్ల మీద కొట్లాడి హక్కులు సాధించాలని భీం సవాల్ విసిరిండు. జంగ్లతోళ్లు, నిజాం సర్కారు కలిసి గోండుగూడెంలో భూములు లాక్కొని దోపిడీ చేశారు. రాజ్యాధికారం చేతుల్లో ఉంటెతప్ప మన భూములు మనకు దక్కవని.. అడవిలోకి రెవిన్యూ, అటవీ, పోలీసు అధికారులు వచ్చి.. మన భూములు మనకుకాకుండా చేస్తున్నరని భావించిన భీం.. చివరకు వారిపై యుద్ధంచేయాలని నిర్ణయించిండు. సూరు గొండు, కొలాం గూడెంల అందరికీ మతలవు చేసి జోడేఘాట్ కేంద్రంగా యుద్ధం జరుగుతుందని మీటింగ్ పెట్టి, అందరి మద్దతు తీసుకున్నడు. అందరినీ ఒక్కటిచేసి యుద్ధానికి కాలుదువ్విండు. గూడెంల ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నరని అవల్దారి కుర్దు పటేల్.. నిజాం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిండు. నిజాం సైన్యం మోవాడ్ పక్కనుంచి కొండల పైకి ఎక్కి జోడేఘాట్, బాబెఝరిని మిలిటరీతో దిగ్బంధం చేయాలని చూసింది. ఆ దారుల్లో పెద్దపెద్ద బండకుప్పలున్నాయి. వాటిని బలంగా తోస్తుంటే నిజాం సైన్యం భయపడి పారిపోయింది. నిజాం సర్కారుకు నోటీసులు పంపిన కుమ్రంభీం.. మా హక్కులు తీర్చకపోతే మీతో యుద్ధమే. మా అటవీ భూములకోసం లడాయి చేసి తాడోపేడో తేల్చుకుంటం. ఇక ఆగేది లేదు అని తేల్చిచెప్పిండు.

మోగిన తుడుం దెబ్బ

బాబెఝరి, చాలుబడి, మోవాడ్, శివగూడ, కల్లెగాం, పాటగూడ, పట్నాపూర్, నర్సాపూర్, అంకుశాపూర్, కొశగొండు, భీమన్‌గొందిలోని ఆదివాసులు, యువత ఉసుళ్లపుట్టలెక్క జోడేఘాట్ వచ్చి గెరిల్లా పోరాటానికి బండలు, దుడ్డు, కట్టెలు, గొడ్డలి, ఒడిసెల రాళ్లు పట్టుకుని తయారు అయినారు. తుడుం దెబ్బ మోగింది. నిజాం సైన్యం జోడేఘాట్ మీద తూటాల వర్షం కురిపించింది. ఆదివాసులు తిప్పికొట్టిన్రు. ఒక్క గుండు కూడా ఎవరికీ తాకలేదు. కుమ్రంభీంను ఎలా చంపాలో నిజాం సైన్యానికి అర్థంకాలేదు. మడావి కుర్దు పటేల్ (గోండు) అవ్వల్‌దార్.. భీం సైన్యం రహస్యాలను నిజాం నవాబుకు చేరవేయడంతో పోలీసు, ఆర్మీ బాబెఝరి, జోడేఘాట్‌ను చుట్టుముట్టాయి. భీం గెరిల్లా పోరాటానికి ఆయన అనుచరులతోపాటు గోండు గ్రామాల ప్రజలు కూడా సై అంటూ నిజాం సైన్యంపై ఎదురు తిరిగారు. హోరాహోరీగా తలపడ్డారు. యుద్ధక్షేత్రంలో భీం అనుచరులు కుప్పకూలారు. భీం కూడా ఒళ్లంతా తుపాకి గుండ్లు తగిలి చనిపోయాడు. భీం చనిపోయాడని పూర్తిగా తెలుసుకున్నాక నిజాం సైన్యం వెనుదిరిగింది. భీం చనిపోయింది దసరా తర్వాత ఐదురోజులకు. ఆ దినం ఆనవాలు ఇంకా బాగా గుర్తుంది. భీం చనిపోవడంతో జోడేఘాట్ కొండలు, గుట్టలు, లొద్దిలు భోరున ఏడ్చినాయి. గోండు గ్రామాల ప్రజలు తిండి ముట్టలేదు. కుమ్రంభీం అమర్ రహే! భీం దాదా అమర్ రహే! అనే నినాదాలు ఆకాశానికి అంటినాయి అంటూ చెమ్మగిల్లిన కండ్లతో ఆనాటి చరిత్ర గుర్తులను యాది చేసుకున్నారు టెకం మాని.

యుద్ధవీరుడు మాచినేని భీమయ్య

అదే కాలానికి చెందిన మరో గొప్ప పోరాటయోధుడు మాచినేని భీమయ్య. ఆయన కూడా అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు. నేను పుట్టిన ఊరు కాకరబుడ్డిలో దట్టమైన అడవి ప్రాంతం. పులులు తిరుగుతుండేయి. దాంతో గూడెంలో ప్రజలంతా బాబెఝరికొచ్చారు. భీం అన్నదమ్ములను అప్పటి ఫారెస్టు ఆఫీసర్ ఇబ్బందులు పెట్టేవాడు. భీం అప్పటికే మహారాష్ట్ర నుంచి జోడేఘాట్ రాగా భూములు లేవు. ఎవుసం, ఎడ్లు లేవు. మన భూముల మీద దోపిడీ, అన్యాయం జరుగుతున్నయని, హక్కుల కోసం కొట్లాడాలని పిలుపునిచ్చిండు. బాబెఝరి వచ్చిన షేర్దారీ మంచంమీద కూసుంటె.. ఎత్తి కిందపడేసిండు. మళ్లీ డీఎస్పీ, ఎస్పీ, ఫారెస్టోళ్లు గూడెంకు వేస్తే కుర్చీలకు ముడ్డి అతుక్కపోవడానికి అడవిబంక అంటుపెట్టారు. భయపడిన అధికారులు.. అట్ల చేయద్దని బతిమాలి అక్కడినుంచి పోయిండ్రు. కుమ్రంభీంను పట్టుకోవాలని అటవీ అధికారులు మిల్ట్రీతో వచ్చేటోళ్లు.

నేను యుద్ధం చేయడానికి బండరాళ్లు ఏరేవాడిని. పన్నెండు ఆదివాసీ గ్రామాల ప్రజలను సంఘటితంచేసి, సభలు పెట్టి పోరాటానికి సిద్ధంచేసినం. యుద్ధంలో పాల్గొనటానికి ధైర్యవంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చినం. ఆదివాసులంతా జమకూడి తుడుం మోగించిండ్రు. నిజాం సర్కారుతో గెరిల్లా యుద్ధం. సుమారు 12 గంటలు ఫైరింగ్ జరిగింది. శత్రువుకు చెమటలు పట్టించాం. కానీ.. నిజాం రాజు మోసపూరిత దాడిలో భీం శరీరం మొత్తం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. భీం రక్తపు మడుగులో పడిపోయాడు. చివరి శ్వాసలో కూడా జల్, జంగిల్, జమీన్ నినాదం చేశాడు భీం అంటూ ఆనాడు అస్తమించిన యోధుడిని గుర్తుచేసుకున్నారు మచినేని భీమయ్య. మళ్ళీ ఒక కుమ్రంభీం పుడుతాడని నమ్మకంతో ఉన్నారాయన.
(వ్యాస రచయిత.. సినీ గీతరచయిత
ఫోన్: 9177541446)

1656
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles