తెలంగాణ గ్రామాయణం పాలకులకు దిక్సూచి


Thu,May 16, 2019 02:19 AM

Book on Public Relations released in Hyderabad

- మారంరాజు పుస్తకావిష్కరణలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ, మెహిదీపట్నం: తెలంగాణ గ్రామీణ పరిపాలనకు సంబంధించి రచయిత మారంరాజు వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు దిక్సూచిగా పనికి వస్తాయని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. బుధవారం తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ప్రొఫెసర్ మారంరాజు సత్యనారాయణరావు రాసిన తెలంగాణ గ్రామాయణం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకంలో గ్రామ పరిపాలనా వ్యవస్థ, శిస్తుల వ్యవస్థ, తెలంగాణ గ్రామీణ వ్యవస్థను విశ్లేషణాత్మకంగా వివరించారన్నారు. గ్రామీణ పరిపాలనతోపాటు ప్రజల జీవన స్థితిగతులను, చరిత్ర క్రమాన్ని ఔపోసన పట్టారని పేర్కొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ భూములపై కన్నేసిన ఆంధ్రాపాలకులు ఇక్కడి పరిపాలనా వ్యవస్థలను విధ్వంసం చేశారని, ప్రత్యామ్నాయమార్గాలు చూపకుండా తెలంగాణ సమాజంలో భూసమస్యలకు కారణభూతమయ్యారని విశ్లేషించారు.

బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ పాత సమాజాన్ని ఈ తరానికి గ్రామాయణం పుస్తకాన్ని పరిచయం చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి సీపీఆర్వో వనం జ్వాలానరసింహారావు మా ట్లాడుతూ తెలంగాణలో రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని, ఈ నేపథ్యంలో గ్రామీణ వ్యవస్థ నాటి రోజుల్లో ఎలా ఉండేదనే విషయాన్ని మారంరాజు ఈ పుస్తకంలో వివరించారన్నారు. కార్యక్రమంలో రామానంద తీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరెక్టర్ నారా కిశోర్‌రెడ్డి, ప్రముఖ కవి సీతారాం, బీసీ స్టడీసర్కిళ్ల డైరెక్టర్ బాలాచారి తదితరులు పాల్గొన్నారు.

430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles