1956కు పూర్వం ఎగ్జిబిట్లన్నీ మనవే


Wed,September 11, 2019 03:17 AM

Before 1956 all the exhibits were ours

-ఆపై కొన్న, లభ్యమైన వాటినే పంచుకోవాలి
-తెలంగాణ వారసత్వ చరిత్రను పదిలపర్చుకోవాలి
-నమస్తే తెలంగాణతో ఆర్కియాలజీ తెలంగాణ విభజన కమిటీ చైర్మన్ డాక్టర్ డీ రాజారెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: 1956వ సంవత్సరానికి పూర్వం ఉన్న ఎగ్జిబిట్లన్నీ తెలంగాణవేనని ఆర్కియాలజీ తెలంగాణ విభజన కమిటీ చైర్మన్, ది న్యుమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డీ రాజారెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ వారసత్వ చరిత్రను పదిలపర్చుకునే సందర్భం ఆసన్నమైనదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్కియాలజీ విభాగంలోని విలువైన విగ్రహాలు, స్థూపాలు, దాదాపు మూడు లక్షల నాణేలు, ఇతర అపురూపమైన వస్తువులు, ఆస్తుల పంపిణీకి ప్రధాన ప్రక్రియ ఇంకా మొదలుకావాల్సి ఉన్నదని తెలిపారు. విభజన కమిటీ, అధికారులు ఇప్పటివరకు ఒకసారి మాత్రమే భేటీ అయినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో రాజారెడ్డితో నమస్తే తెలంగాణ ప్రతినిధి మాట్లాడారు.

ఆర్కియాలజీలో విలువైన వస్తువులు ఏమున్నాయి?

ఆర్కియాలజీలో నాణేలు, విగ్రహాలు, తాళపత్ర గ్రంథాలు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన అనేక వస్తువులు, రాజ వంశీయుల ఆభరణాలు, మన చరిత్రను తెలిపే ఎన్నో శాసనాలు (ఇన్‌స్క్రిప్షన్స్) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టావతరణకు ముందున్న అంటే.. 1956వ సంవత్సరానికి ముందున్న అన్ని ఎగ్జిబిట్లు తెలంగాణకే చెందుతాయి. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. వాళ్లు అక్కడినుంచి ఎలాంటి వస్తువులు, ఆస్తులను తీసుకురాలేదు. భాషా ప్రాతిపదికన 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 1914లో మన మ్యూజియం, ఆర్కియాలజీ విభాగం ప్రారంభమైంది. అందుకే 1956 సంవత్సరానికి ముందున్న పురావస్తు, ఆర్కియాలజీ విభాగం ఆస్తులన్నీ తెలంగాణకు చెందినవే. ఆ తర్వాత ఏమైనా కొన్నవి, లభ్యమైనవి ఉంటే.. ప్రాధాన్యపరంగా విభజించుకోవాల్సి ఉన్నది.

తెలంగాణ పరిధిని ఏయే రాజవంశాలు పాలించాయి?

తెలంగాణ పరిధిని నందులు, రాష్ట్ర కూటులు, మౌర్యులు, శాతవాహనులు పరిపాలించారు. బంగారం, వెండి, రాగి, లెడ్, పోటిన్ మొదలైన నాణేలను ముద్రించి చలామణిలోకి తెచ్చారు. పంపిణీ ప్రక్రియలో సింహభాగం నాణేలదే. రెండు రాష్ర్టాలకు సంబంధించి ఐదు లక్షల నాణేలు ఉన్నాయి. శాతవాహనుల నాణేలన్నీ వెండి, రాగి, లెడ్, పోటిన్ నేపథ్యంలో ఉండగా, వాటిపై ప్రాకృతం, తెలుగు భాషా లిపులున్నాయి. దాదాపు 3 లక్షల నాణేలను పంపిణీ చేయాల్సి వస్తున్నది. రాష్ట్రకూటుల ఏలిక నాటినుంచి బంగారు నాణేలు తయారయ్యాయి. 17,000 బంగారు నాణేలు, 70,000 వెండి నాణేలను ప్రస్తుతం పంచుకోవాల్సి ఉన్నది. ఇంకా ఎన్నో రాజవంశాలు పాలించినా అవి పెద్దగా కీర్తినార్జించలేదు.

తెలంగాణ పరిధిలో ఎక్కడెక్కడ నాణేలు లభ్యమయ్యాయి?

తెలంగాణ పరిధిలోని కోటిలింగాలలో 1968 నుంచి 71 వరకు జరిపిన తవ్వకాల్లో నందులు, మౌర్యులకు చెందిన 421 నాణేలు బయటపడ్డాయి. 1921లో కరీంనగర్‌లో 700 నాణేలు లభ్యమయ్యాయి. 4, 5వ శతాబ్దాల్లో రాష్ట్ర కూటులు, బాదామి చాళుక్యులు బంగారు నాణేలను ముద్రించారు. కాకతీయులు బంగారు, వెండి, రాగి నాణేలను వాడుకలోకి తెచ్చారు. మన ప్రాంతంలో దొరికిన వస్తుసామగ్రి అంతా మనదే. 1956 తరువాత కొనుగోలుచేసిన సామగ్రి ఏమైనా ఉంటే అది 50:50గా పంపిణీ జరుగుతుంది. 1956 తర్వాత మన ప్రాంతంలో లభ్యమైన ఆస్తులన్నీ మనకే చెందుతాయి. నల్లగొండలో లభ్యమైన బుద్ధ విగ్రహాలను గుంటూరుకు తరలించారు. దేశంలోనే మొట్టమొదటి నాణేలు 6, 7వ శతాబ్దానికి చెందిన పంచ్‌మార్క్ కాయిన్స్. నాణేలపై గుర్తులనుబట్టి అవి ఏయే రాజ వంశీయులయో చెప్పొచ్చు. ఆంధ్ర, రాయలసీమలో లభ్యమైనవన్నీ వాళ్లకే ఇచ్చేస్తాం.

తెలంగాణలో పురావస్తు విభాగం, మ్యూజియాన్ని సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదా?

తెలంగాణలో పురావస్తు విభాగం, మ్యూజియాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. శాతవాహనులు, గుప్తుల కాలంలో వాణిజ్యపరంగా తెలంగాణ వృద్ధిలోకి వచ్చింది. శాతవాహనులు, గుప్తులు రోమన్లతో చేసిన వ్యాపార సాన్నిహిత్యం తెలంగాణకు లాభించింది. మన లైబ్రరీ, మ్యూజియాలు చాలా బాగున్నాయి. శాతవాహనుల లెడ్ కాయిన్స్ మృదువైన లోహంతో తయారుచేసినవి. ఆ నాణేలను ముట్టుకోకూడదు. వాటిని దాచిపెట్టడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. అలాంటి నాణేలను రిసెర్చ్‌స్కాలర్స్ కోసం అందుబాటులో పెట్టాలి. 1930లో ఏడోనిజాం కొనుగోలుచేసిన ఈజి ప్టు మమ్మీ మనదే. తెలంగాణలోని వివిధప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో లభ్యమైన శిల్పాలు, శాసనాలు, స్థంభాలు, స్థూపాలు, నాణేలు స్థానిక మ్యూజియంలోనే ఉంటాయి. 1980లో వైజాగ్ శివారులో మట్టిపాత్రలో బూడిద, బొగ్గు ముక్కలు, చిన్న ఎముక లభించాయి. దానిని బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు గుర్తించారు. దీనిని అత్యంత విలువైనదిగా గుర్తించి హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. దీన్ని ఏపీకి తరలించనున్నారు.

Phanigiri

ఏయే రాజవంశీయుల శాసనాలు తెలంగాణ చరిత్రను చాటుతున్నాయి?

శాతవాహనులకు సంబంధించిన 35, 36 శాసనాలు తెలంగాణ ప్రాంతాన్ని గురించి విశ్లేషిస్తున్నాయి. శాతవాహన రాజులు తల్లి పేరును ముందు పెట్టుకొని మాతృమూర్తికి పెద్దపీట వేశారు. ప్రాకృతం, తెలుగుభాషలకు నాణేలలో, శాసనాల్లో ప్రాధాన్యమిచ్చారు. తెలుగు భాష ప్రాచీనమైనదని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఆంధ్ర ప్రాంతమైన అమరావతిలో 1953లో జరిపిన తవ్వకాల్లో పంచ్‌మార్క్ కాయిన్స్ సంచి లభ్యమైంది. నందులు, మౌర్యులకు సం బంధించిన 7,668 పంచ్‌మార్క్ కాయిన్స్ ఉండగా, వాటిని హైదరాబాద్ మ్యూజియానికి పంపించారు. తరువాత పరిశోధన కోసం ముంబైకి తరలించారు. పంచ్‌మార్క్ కాయిన్స్‌ను 60:40 నిష్పత్తి ప్రకారం పంచాలనేది వారి వాదన. దానికి మనం అంగీకరించడంలేదు.

1093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles