బీసీ-ఈలకు


Mon,April 17, 2017 02:53 AM

BC Commission submits report to Chief Minister kcr

రిజర్వేషన్ల శాతం పెంచాలి ప్రభుత్వానికి బీసీ కమిషన్ నివేదిక
బీసీ-ఈల రిజర్వేషన్లు 12 శాతం వరకు పెంచాలని బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో చాలా మంది ముస్లింలు హిందూ మతం నుంచి మారిన వారేనని, నేటికీ హిందూ మతంలోని కులవృత్తులనే అనుసరిస్తున్నారని, అదేవిధంగా వివక్షకు గురవుతున్నారని కమిషన్ తెలిపింది.
BC-commission
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బీసీ-ఈకి చెందిన ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారని బీసీ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మతం మారినా వెనుకబాటుతనం పోలేదని ప్రభుత్వానికి సమర్పించిన 135 పేజీల నివేదికలో కమిషన్ పేర్కొన్నది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ-ఈలకు రిజర్వేషన్లను పెంచింది. ముస్లిం సమాజంలోని వెనుకబాటుతనంపై అధ్యయనం చేసిన పీఎస్ కృష్ణన్ 14 ముస్లిం వర్గాలను వెనుకబడిన వారిగా గుర్తించి, వారికి ప్రత్యేకంగా 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయాన్ని బీసీ కమిషన్ పరిగణలోకి తీసుకున్నది. ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు 1925లోనే నిర్ణీత ప్రమాణంలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది.

సామాజిక స్థితిగతుల పరిశీలన


ముస్లింలలో వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి బీసీ కమీషన్ రాష్ట్రమంతటా పర్యటించింది. 21,435 ప్రాంతాల్లో పలువురిని కలిసి విచారించింది. వారి సామాజిక స్థితిగతులను పరిశీలించింది. 2014 డిసెంబర్ 14 నుంచి 2016 డిసెంబర్ 19 వరకు బహిరంగ విచారణ చేసింది. ఈ విచారణలో మొత్తం 2,690 విజ్ఞప్తులు వచ్చాయి. ఇందులో 2,620 అనుకూలంగా, 70 దరఖాస్తులు వ్యతిరేకంగా వచ్చాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పార్టీలు అభిప్రాయాలను అఫిడవిట్ రూపంలో ఇచ్చాయని కమిషన్ తెలిపింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం వల్ల ముస్లిం వర్గాలే దెబ్బతిన్నాయని భావించింది. రాజకీయ వర్గాల పెత్తనం, అహంకారపూరిత భావజాలం, ఉర్దూకు భిన్నమైన ఇతర భాషల ప్రావీణ్యం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు పురోగతి సాధించలేదని తెలిపింది. గత పాలకుల పాలనా విధానం వల్ల తెలంగాణ ముస్లింలు అన్ని రంగాలలో వెనుకబడిపోయి, తక్కువస్థాయి వృత్తులలోకి నెట్టివేయబడ్డారని పేర్కొన్నది. పేదరికంలో మగ్గుతున్న ముస్లిం పిల్లల్లో 7, 8 ఏండ్ల వయసు పిల్లలు డ్రాప్ అవుట్లుగా మిగిలిపోతున్నారని కమిషన్ గుర్తించింది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 9.4 శాతంగా ఉన్న ముస్లింల జనాభా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత 12.68 శాతానికి పెరిగింది.

బీసీ కమిషన్ సిఫారసులు


-పేదరికంలో ఉన్న ముస్లిం పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించాలి. పాఠశాలల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తంలో నాలుగవ వంతు ఉపకార వేతనం ఇవ్వాలి.
-బీడీ కార్మికులకు, తరక కాశీలకు, ఖురేషీలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి.
-ఖురేషీ, కసబ్ వ్యాపారులకు పశువధశాలలు నిర్మించాలి. హజామ్ (మంగలి), వడ్రంగి వంటి వృత్తులపై ఆధారపడిన వారికి ప్రత్యేక రుణాలు ఇవ్వాలి.
-ఉర్దూ శాఖలను ప్రారంభించాలి.ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ అందించాలి.
-ఇండ్లు లేని వారికి డబుల్ ఇండ్లు నిర్మించాలి.
-ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ-ఈలకు రిజర్వేషన్లు కల్పించాలి.
-రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, శిక్షణ ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం సమాన అవకాశాల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles