పార్టీగుర్తుతో కంటోన్మెంట్ ఎన్నికలు


Sat,September 14, 2019 02:59 AM

B Vinod Kumar Says Party Symbol Must Allow to Cantonment Elections

-సీఎం కేసీఆర్ లేఖకు సానుకూలంగా స్పందన
-డిఫెన్స్ ఎస్టేట్స్ డీజీని కలిసిన టీఆర్‌ఎస్ ప్రతినిధులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను పార్టీ గుర్తులపై నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖకు కేంద్ర రక్షణశాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను పార్టీగుర్తులతోనే జరుపాలని కోరుతూ సీఎం కేసీఆర్.. డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్‌కు లేఖరాశారు. ఈ లేఖను రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో డిఫెన్స్ ఎస్టేట్ డీజీ దీపాబజ్వాకు అందజేశారు. 2020 జనవరిలో జరిగే బోర్డు ఎన్నికలను పార్టీ గుర్తులపై నిర్వహించాలంటూ టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి అనేక వినతులు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని ఇతర కంటోన్మెంట్లలో పార్టీ గుర్తుల ప్రాతిపదికనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని అందులో వివరించారని వినోద్‌కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ వినతిపై డిఫెన్స్ ఎస్టే ట్స్ అధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పారు. బీఫాంలు ఇచ్చేవారికి ఆయా పార్టీల గుర్తులను కేటాయిస్తామని డిఫెన్స్ ఎస్టేట్స్ అధికారులు తెలిపినట్టు పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో టీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం భేటీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయపార్టీగా గుర్తింపును కొనసాగిం చడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని టీఆర్‌ఎస్ పార్టీ కోరింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డితో కూడిన టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం భేటీ అయింది. 2019 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్ పోటీచేయలేదని, దీంతో ఆ రాష్ట్రంలో ప్రాంతీయపార్టీగా గుర్తించడానికి కావాల్సిన షరతులకు లోబడి లేదని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొన్నది. దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరింది. సమాధానం ఇవ్వడానికి సమయం కావాలంటూ టీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేయడంతో ఎన్నికల సంఘం మూడువారాల గడువు ఇచ్చింది.

హైకోర్టు జడ్జీల సంఖ్య పెంచండి

-సీజేఐకి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ లేఖ
తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 24 నుంచి 42కు పెంచాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్.. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ (సీజేఐ) రంజన్ గొగోయ్‌కి లేఖ రాశారు. హైకోర్టులో భారీగా కేసులు పెండింగ్‌లో ఉన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని జడ్జీల సంఖ్యను పెంచాలని ఇప్పటికే సీఎం కేసీఆర్.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖ రాశారని తెలిపారు. తెలంగాణ హైకోర్టు చీఫ్‌జస్టిస్ కూడా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టులో కోర్టు హాళ్లు, మౌలిక సదుపాయాలతోపాటు పెంచిన జడ్జీల సంఖ్యకు సరిపోయేలా నివాస సముదాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్యను పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సత్వరన్యాయం అందుతుందని తెలిపారు.

697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles