ఓటరు శంఖారావం నేడే జై తెలంగాణ


Fri,December 7, 2018 02:41 AM

Assembly election Voting in Telangana to be held today

-భావి తెలంగాణ నిర్మాణ ఆకాంక్షలు చాటుతూ
-తీర్పు చెప్పటానికి కదలనున్న ఓటర్లు
-టీఆర్‌ఎస్ - కూటమి మధ్యే ప్రధాన పోరు
-ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్..
-సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే ముగింపు
-పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్నవాళ్లందరికీ ఓటువేసే అవకాశం
-90 వేలమంది భద్రతాసిబ్బందితో బందోబస్తు
-రూ.135 కోట్ల సొత్తు.. 4.70 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం
-అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం
-ఓటుకోసం సెలవు.. అందరి హక్కు
-ఓటువేయడానికి 12 రకాల గుర్తింపు కార్డులు
-పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిషిద్ధం
-మీడియా సమావేశంలో సీఈవో రజత్‌కుమార్
-నియోజకవర్గాలు : 119
-మొత్తం అభ్యర్థులు : 1,821
-మొత్తం ఓటర్లు : 2,80,64,684
-పోలింగ్ స్టేషన్లు: 32,815

KOTLA-VIJAY
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ నిర్ణయాత్మక దశకు చేరింది! ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది! ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు చెప్పినవి విని, ఇన్నేండ్లలో ఎవరేంచేశారో చూసిన ఓటర్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో.. బాధ్యతతో.. తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు కదలనున్నారు! త్యాగాలు, బలిదానాలపై ఏర్పడిన తెలంగాణలో తమ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు.. తమ ఆకాంక్షలను దిగంతాలకు చాటేలాశంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు! జై తెలంగాణ నినాదాల స్ఫూర్తిగా.. బంగారు తెలంగాణ సాకారమవ్వాలనే కలతో జరుగుతున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్తరాష్ట్ర భావిమార్గాన్ని బలంగా నిర్మించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఇచ్చే తీర్పు.. మరికొద్ది గంటల్లో! ఉదయం సరిగ్గా ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్.. సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక గంట ముందే.. అంటే నాలుగు గంటలకే ముగించనున్నారు. అయితే.. ఎక్కడైనా సరే.. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లో నిలిచిన అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రాత్రి ఏడుగంటల వరకు కూడా ఇలా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లోని మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు.. 1821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం ఓటర్లలో 20 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందినవారు ఉండటం విశేషం.

ఏర్పాట్లు పూర్తిచేశాం: రజత్‌కుమార్

CEO-Rajat-Kumar
ఓటు వేయడం మనందరి హక్కు అని, ప్రతి ఒక్కరు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ చెప్పారు. దీనిని బాధ్యతగా భావించాలని కోరారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఓటరు గుర్తింపుకార్డు లేనివారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునన్నారు. ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపుకార్డుల్లో ఏ ఒక్కటి ఉన్నా ఓటువేయడానికి అనుమతిస్తామని తెలిపారు. పోల్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని, పోలింగ్ సిబ్బంది గురువారం రాత్రికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి మీడియాకు అనుమతిలేదని స్పష్టంచేశారు. ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, పాఠశాలలకు, ప్రభుత్వరంగ సంస్థలకు సాధారణ సెలవు ప్రకటించామని, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌చట్టం ప్రకారం కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవులు ఇచ్చామని చెప్పారు. ఓటువేయడానికి ఎవ్వరూ మద్యంతాగి రావద్దని కోరారు. మద్యంతాగి ఓటు వేయడానికి రావడం నైతికత కాదన్నారు.

ఓటు వేయడానికి అనుమతించే కార్డులు

WESLI---COLLAGE
1.పాస్‌పోర్ట్, 2.డ్రైవింగ్ లైసెన్స్, 3.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసే గుర్తింపుకార్డులు, 4.బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీచేసే పాస్‌పుస్తకాలు, 5.పాన్‌కార్డు, 6.నరేగా జాబ్‌కార్డు, 7.కార్మికశాఖ జారీచేసే హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్‌కార్డు, 8.ఫొటోతో ఉన్న పెన్షన్ ధ్రువీకరణ పత్రం, 9.ఎన్నికల యంత్రాంగం జారీచేసిన ఫొటో ఓటర్ స్లిప్, 10.ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపుకార్డులు, 11.ఎన్పీఆర్ కింద ఆర్బీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు, 12.ఆధార్‌కార్డు.

నిర్వహణకు సర్వం సిద్ధం

పోలింగ్ నిర్వహణ సజావుగా సాగేందుకు 44,415 బ్యాలెట్ యూనిట్లు (రిజర్వులో 7,557), 32016 కంట్రోల్ యూనిట్లు (రిజర్వులో 4,432), 32,016 వీవీప్యాట్లు (రిజర్వులో 5,261) వినియోగిస్తున్నారు. ఎలాంటి కారణంతోనూ పోలింగ్ ఆగిపోకుండా వీటిని సిద్ధంచేశామని రజత్‌కుమార్ తెలిపారు. ప్రతి 12 పోలింగ్ కేంద్రాలకు అదనంగా ఒక యూనిట్ మొత్తం రిజర్వులో ఉంటుందని చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరును బెల్, ఈసీఐఎల్ సంస్థలకు చెందిన 240 మంది ఇంజినీర్లు కూడా పర్యవేక్షిస్తారని తెలిపారు. బెల్ జీఎం కూడ సచివాలయంలో అందుబాటులో ఉంటారని చెప్పారు. క్రాక్ ఎర్రర్స్ వస్తే అధిగమించేందుకు 1300 అదనపు యూనిట్స్ తెప్పించామని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో దాదాపు 50 వేల మంది అధికారులు, సిబ్బంది పాలు పంచుకుంటున్నట్టు చెప్పారు. వీరితోపాటు శాంతిభద్రతల పర్యవేక్షణకు 30 వేల మంది పోలీస్ బలగాలు మోహరించినట్టు తెలిపారు. వీరిలో 18816 మంది పోలీసులు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి వచ్చారన్నారు. 279 కంపెనీల కేంద్ర బలగాలు కూడా రాష్ర్టానికి వచ్చాయని తెలిపారు. వీరేకాకుండా.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలైన్ల నిర్వహణకు ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలు వినియోగించుకోనున్నట్టు చెప్పారు. ఈసీఐ నిబంధనల ప్రకారం 10% వెబ్‌కాస్టింగ్ చేస్తున్నామన్నారు. ఈ మేరకు 31 జిల్లాల్లో 3470 ఏరియాలలో వెబ్‌కాస్టింగ్ జరుగుతుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియను సచివాలయంలోని డీ బ్లాక్ నుంచి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.

డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టడానికి నైట్‌రౌండ్ పెట్రోలింగ్

ఓటర్లను ప్రభావితం చేయడానికి అభ్యర్థులు డబ్బు, మద్యం పంచడాన్ని అరికట్టటానికి, తనిఖీలు నిర్వహించటానికి నైట్‌రౌండ్ పెట్రోలింగ్ టీమ్‌లు ఏర్పాటుచేశామని రజత్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే 119 నియోజకవర్గాలలో 113 టీమ్‌లు తిరుగుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం చర్యలవల్ల మద్యం అమ్మకాలు 38% తగ్గాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలను అరికట్టడానికి 446 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 448 సర్వేయల్ మానిటరింగ్ టీమ్స్, 126 అసిస్టెంట్ ఎక్స్‌పెండేచర్ అబ్జర్వర్లు, 224 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.135 కోట్లు సీజ్ చేశామని చెప్పారు. ఒక్క రోజులోనే రూ.6 కోట్లు సీజ్ చేసినట్టు తెలిపారు. 2014 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువగా నగదు, మద్యాన్ని సీజ్ చేశామని, 250 కేసులు నమోదయ్యాయని వివరించారు.
POLLING-CENTRE

సీ విజిల్ ద్వారా 8 వేల ఫిర్యాదులు

ఎన్నికల నియమావళి ఉల్లంఘన తదితర ఫిర్యాదుల స్వీకరణ, వేగంగా పరిష్కారం కోసం రూపొందించిన సీ-విజిల్ ద్వారా 8071 ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు. ఇందులో 5872 పరిష్కారం అయ్యాయన్నారు. 1926 ఫిర్యాదులు డ్రాప్ అయ్యాయన్నారు. ఒక్క యాదాద్రి- భువనగిరి జిల్లాల్లోనే 1588 ఫిర్యాదులు పరిష్కరించినట్టు తెలిపారు.

పార్లమెంటు ఎన్నికల కోసం 26 నుంచి ఓటర్ల జాబితా తయారీ

డిసెంబర్ 26 నుంచి పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారుచేస్తామని రజత్‌కుమార్ తెలిపారు. 18 ఏండ్ల వయసు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

పాత ప్రచార క్లిప్పింగుల ప్రసారం ఉల్లంఘనే

టీవీ చానళ్లకు డిప్యూటీ సీఈవో హెచ్చరిక
ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లు పాత ప్రచార క్లిప్పింగులను ప్రసారం చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని డిప్యూటీ సీఈవో సత్యవాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల సంబంధ అంశాల ప్రచారంపై నిషేధం ఉన్నదని తెలిపారు. కొన్ని చానళ్లు ఇలా ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్ని జిల్లాల డీఈఓలతో రజత్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్

CEO-Rajat-Kumar1
ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఐజీలు, డీఐజీలతో సీఈవో రజత్‌కుమార్ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల పోలీస్ నోడల్ అధికారి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను సీఈవో అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగ్గా పనిచేసేందుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. డబ్బు, మద్యం పంపిణీ జరుగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని, రాత్రి గస్తీ పెంచాలని ఆదేశించారు.

2014లో 68.81 శాతం పోలింగ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గత సాధారణ ఎన్నికల సందర్భంగా 68.81 శాతం పోలింగ్ నమోదయింది. 2014లో జరిగిన ఆ ఎన్నికల్లో మొత్తం 2,81,73,253 ఓటర్లకుగాను 1,93,86,369 మంది ఓటుహక్కు వినియోగించుకొన్నారు. వీరిలో పురుషులు 98,64,982 మంది, మహిళలు 95,11,272 మంది, ఇతర ఓటర్లు 117 మంది ఉన్నారు.

రండి.. ఓటేద్దాం!

పరమ పవిత్రమైన ప్రజాస్వామ్య క్రతువులో మనమంతా పాల్గొందాం!
మన ఆకాంక్షలనెరిగి.. మన ఆశలు తీర్చే ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం!
నిర్ణయాత్మక దశకు చేరిన ఎన్నికల ప్రక్రియలో మన నిర్ణయం చాటుదాం!
ఇది మన హక్కు! ఇది మనందరి బాధ్యత!
ఇదే మన బంగారు భవిష్యత్తు!

2830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles