కేసీఆర్ ఔదార్యాన్ని హర్షించాలి


Fri,July 12, 2019 02:42 AM

AP CM YS Jagan Praises Telangana CM KCR over Kaleshwaram Project

-ఆయనను అభినందించడం మానేసి విమర్శిస్తారా?
-సీఎంల మధ్య సఖ్యత ఉంటే రాష్ర్టాలు అభివృద్ధి సాధిస్తాయి
-ఏపీ అసెంబ్లీలో టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సీఎం జగన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాల మధ్య సఖ్యత విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చూపుతున్న ఔదార్యాన్ని హర్షించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను అభినందించడం మానేసి విమర్శించడమేమిటని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లారని ప్రతిపక్ష టీడీపీ అడుగుతున్నది. పొరుగురాష్ర్టాలతో మంచిగా ఉండాలనే కాళేశ్వరం వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారని.. అప్పుడు ఆయన ఏం చేశారు.. గాడిదలు కాశారా అని తీవ్రంగా విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లు పెరిగితే భవిష్యత్‌లో కృష్ణా బేసిన్‌కు నీటి కష్టాలు తప్పవు. కేసీఆర్ గారికి మనకున్న సత్సంబంధాలరీత్యా ఆయన మనపట్ల ఔదార్యం చూపుతున్నారంటే మనం హర్షించాల్సిన పరిస్థితుల్లో ఉండాలి. గోదావరి నీళ్లను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తీసుకుపోయేందుకు, కృష్ణా ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. వీటిని పోలవరం నుంచి తీసుకోవడం లేదు. కేసీఆర్‌గారు తన రాష్ట్రం తెలంగాణ నుంచి గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు అందిస్తున్నారు. గోదావరి గురించి ప్రతిపక్షపార్టీకి ముందుగా ఒక క్లాస్ ఇవ్వాలి. గోదావరిలో నాలుగు పాయలుంటాయి. నాసిక్ నుంచి వచ్చేపాయ ఒకటి. ఇది ఎండిపోయి తెలంగాణకే నీరు రాని పరిస్థితి. రెండోది గోదావరిలో 36శాతం నీటివాటా ఉండే ప్రాణహిత. మూడోది ఇంద్రావతి. ఇది గోదావరి నీటిలో 26 శాతం ఉంటుంది. ప్రాణహిత, ఇంద్రావతి కలిసి గోదావరిలో దాదాపుగా 65% నీటిని కలిగి ఉన్నాయి. ఈ రెండుపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కేవలం శబరి పాయ ఒక్కటే ఏపీకి ఉంది. దీనిద్వారా గోదావరికి కేవలం 11శాతం మాత్రమే వాటా.

అంటే కేవలం 500 టీఎంసీలు మాత్రమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే 3 టీఎంసీల నీటిని తరలించుకుపోయే పరిస్థితి ఉన్నపుడు ఆయన ఏం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేసే వాటి గురించి గొడవ చేయడం, కోర్టుకు పోవడం చేస్తే అవేవీ తెగవు. పై రాష్ర్టాలు వాటి ప్రయోజనాలు అవి చూసుకుంటాయి. ఆల్మట్టి ఎత్తు పెంచడం కావచ్చు, గోదావరిని వాడుకొనేందుకు మహారాష్ట్ర ప్రయత్నించడం కావచ్చు, కాళేశ్వరంలో 3 టీఎంసీల నీటిని కేసీఆర్ లిఫ్ట్ చేయడం కావచ్చు.. వాటిని అడ్డుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది రాష్ర్టాల మధ్య సఖ్యత. ముఖ్యమంత్రులు ఒకరికొకరు కలిసి పనిచేసే పరిస్థితి ఉండాలి. సీఎంలు కలిసి ఉంటే, కలిసి పనిచేసే గుణం ఉంటే అభివృద్ధి జరుగుతుంది. ఆ పరిస్థితి ఉంది కాబట్టే కేసీఆర్‌గారు ఓ అడుగు ముందుకేసి తెలంగాణ పరిధుల నుంచి కృష్ణా ఆయకట్టుకు నీరిచ్చేందుకు ముందుకొచ్చారు.

శ్రీశైలం, సాగర్‌కు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు, ఏపీలోని సీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కృష్ణా ఆయకట్టుకు నీరందుతుంది. మనం అడగగానే నీళ్లిచ్చేందుకు కేసీఆర్ ఒప్పుకొన్నారు. దానిగురించి రెండు రాష్ర్టాల ఇంజినీర్లు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇద్దరం కలిసి బృహత్తర కృషి చేసి కృష్ణా ఆయకట్టును స్థిరీకరణ చేయవచ్చనేదానికి సంతోషించాల్సింది పోయి దాంట్లోనూ రాజకీయాలు వెదుకుతున్నారంటే.. ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచచరిత్రలో మరేదీ ఉండదని నిస్సంకోచంగా చెప్తున్నా అని ఏపీ అసెంబ్లీలో టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

4542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles