పత్తిపాకా.. ? మిడ్‌మానేరా..?


Tue,April 16, 2019 02:17 AM

Another record in the cultivable water sector is the green signal to the reservoir

-కాళేశ్వరం మూడో టీఎంసీపై కొనసాగుతున్న మథనం
-ప్రభుత్వానికి రెండు ప్రతిపాదనలు పంపిన నీటిపారుదలశాఖ
-రిజర్వాయర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే సాగునీటిరంగంలో మరో రికార్డు
-పాలమూరు ప్రాజెక్టును మించిన మోటరుతో లిఫ్టుకు అవకాశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరిజలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యల్లో మరో కీలక పరిణామం నమోదుకాబోతున్నది. ఇప్పటికే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేందుకు చేపట్టిన పనులు చివరిదశలో ఉండగా.. ఇదేసమయంలో మూడో టీఎంసీని ఎత్తిపోసేందుకు కూడా తెలంగాణ సర్కారు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నది. దీనిపై మథనం కొనసాగిస్తున్న నీటిపారుదలశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి రెండు రకాల ప్రతిపాదనలు పంపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రోజుకు రెండు టీఎంసీల గోదావరిజలాల తరలింపునకు శరవేగంగా పనులు జరుగుతున్న దరిమిలా ఈ వర్షాకాలంలోనే ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అయితే గోదావరిలో తెలంగాణ వాడుకునేందుకుగాను పుష్కలమైన నీటి లభ్యత ఉన్నది.

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ప్రకారమే 954 టీఎంసీల వరకు తెలంగాణ గోదావరిజలాల్ని సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉన్నది. తెలంగాణ ఏర్పడే వరకు వంద టీఎంసీల వినియోగమే గగనంగా ఉండేది. సీఎం కేసీఆర్ రూపొందించిన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో భారీ ఎత్తున గోదావరిజలాల వినియోగానికి ఆస్కారమేర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే రోజుకు రెండు టీఎంసీలను ఎత్తిపోయవచ్చు. ఇంకా జలాల వినియోగానికి అవకాశాలున్నందున మూడో టీఎంసీ కూడా తరలించేందుకు ప్రభుత్వం ఆది నుంచి అనుకూల దృక్పథంతోనే ఉంది.

అందుకే ముందుచూపుతో గోదావరిపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ఫోర్‌షోర్‌లో నిర్మిస్తున్న పంపుహౌజ్‌ల్లో రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుగుణంగా సివిల్ పనులు చేపట్టారు. ఆ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఈ ఏడాది జనవరిలో సీఎం కేసీఆర్ నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్షలో మూడో టీఎంసీని ఎత్తిపోసేందుకుగాను పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. దీంతో ఎలాగూ సివిల్ పనులు పూర్తయినందున మేడిగడ్డ (కన్నెపల్లి), అన్నా రం, సుందిల్ల పంపుహౌజ్‌ల్లో అదనపు మో టర్ల ఏర్పాటుకుగాను నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. తద్వారా కేవలం అదనపు మోటర్ల బిగింపుతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు రోజుకు మూడు టీఎంసీలు తరలించేందుకు మార్గం సుగమమవుతుంది.

ఎల్లంపల్లి - మిడ్‌మానేరు మధ్యనే కీలకం

ఎల్లంపల్లి తర్వాత మిడ్‌మానేరు వరకు రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేపనులు చివరిదశలో ఉన్నాయి. జంట సొరంగాల నిర్మాణం పూర్తయింది. మూడో టీఎంసీని ఈ మార్గంలో తరలించేందుకు సాంకేతికంగా సాధ్యంకాదని ఇంజినీర్లు తేల్చారు. మధ్యలో ఉన్న మేడారం రిజర్వాయర్ సామర్థ్య పెంపు అవరోధంగా మారుతుందని ఇంజినీర్లు భావించారు. అందుకే ఎల్లంపల్లి టు మిడ్ మానేరు వరకు మూడో టీఎంసీ తరలింపునకు రెండు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. ఎల్లంపల్లి నుంచి మూడో టీఎంసీ (1.1 టీఎంసీ తరలింపు) జలాల తరలింపునకు నేరుగా పైప్‌లైన్ ద్వారా ఎస్సారెస్పీ వరదకాల్వలోకి నీటిని తరలించడం (ప్రస్తుతం ఉన్నట్లుగానే మధ్యలో లిఫ్టుల ఏర్పాటుతో) అనే ప్రతిపాదనను నీటిపారుదలశాఖ ప్రభుత్వానికి పంపింది. అయితే పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు భారీ వ్యయంతో కూడుకున్నది. రెండో ప్రతిపాదనగా.. పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు ద్వారా మూడో టీఎంసీ తరలింపునకు ఇంజినీర్లు డిజైన్ రూపొందించారు.

ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి అప్రోచ్‌చానెల్, టన్నెల్ నిర్మాణాల ద్వారా దానంగుట్ట వరకు జలాల్ని తరలిస్తారు. అక్కడ పంపుహౌజ్ ఏర్పాటుచేసి 205 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి పత్తిపాక రిజర్వాయర్‌లో పోస్తారు. పత్తిపాక గ్రామం సమీపంలో పత్నిగుట్ట, చెల్మగుట్టలు ఉండటం వల్ల రిజర్వాయర్‌కు భౌగోళికంగా అనుకూలత ఉన్నదని, 10.085 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నదని ఇంజినీర్లు చెప్తున్నారు. అ యితే నిల్వ సామర్థ్యం 5.5 టీఎంసీలా? 10 టీఎంసీలకు పైగానా? అనేది ప్రభుత్వం నిర్ణ యం తీసుకోనున్నది. ఈ రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రాంతం సమీపంలోనే లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉన్నందున దీనికి లక్ష్మీనర్సింహసాగర్‌గా నామకరణం చేసినట్లు తెలిసింది. ఈ రిజర్వాయర్ నుంచి గోదావరిజలాలను ఎస్సారెస్పీ వరదకాల్వలోకి, అవసరమైతే కాకతీయకాల్వలోకి తరలించి, దానికింద ఉన్న ఆయకట్టుకూ సాగునీరు అందించేందు కు వెసులుబాటు ఉన్నది. దీనికి సుమారు రూ. 10వేల కోట్లకుపైగా వ్యయం అవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది.

బాహుబలిని మించిన మోటరు

పత్తిపాక రిజర్వాయర్ ప్రతిపాదనకు ప్రభు త్వం అనుమతిస్తే.. తెలంగాణ సాగునీటిరంగంలో మరో రికార్డు నమోదవుతుంది. ముం దుగా ఆసియాలోనే అతిపెద్ద లిఫ్టు మోటరును ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో 15 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేశారు. ఆ త ర్వాత కుల్వకుర్తి ప్రాజెక్టులో 18 మెగావాట్లతో ఏర్పాటుచేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఏకంగా 124.4 మెగావాట్లు, రామడు గు పంపుహౌజ్‌లో 139 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్న మోటర్లతో నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతానికి ఇదే రికార్డు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటుచేయనున్న మోటర్ల సామర్థ్యం 145 మెగావాట్లు. ఆ ప్రక్రియ మొదలైతే రికార్డు పా లమూరు ప్రాజెక్టు సొంతమవుతుంది. పత్తిపాక రిజర్వాయర్‌కు ప్రభుత్వం అనుమతిస్తే ఏకంగా 205 మీటర్ల ఎత్తున గోదావరిజలాల్ని ఎత్తిపోయాల్సి ఉన్నందున ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటర్లను వినియోగించాల్సి ఉంటుందని ఇంజినీర్ ఒకరు తెలిపారు. అం టే దాని ఏర్పాటుతో తెలంగాణ సాగునీటిరం గం మరో రికార్డును నమోదుచేయనున్నది.

3528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles