గీతదాటితే లైసెన్సుపై వేటు

Tue,December 3, 2019 04:43 AM

- నాలుగేండ్లలో ‘గీత’ దాటినవారు 21,194 లైసెన్సులు ఫట్‌
- మరో ఆరువేల లైసెన్సుల రద్దుపై త్వరలో నిర్ణయం
- నిబంధనల అతిక్రమణపై రవాణాశాఖ కొరడా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వాహనదారుల నిర్లక్ష్యంపై రవాణాశాఖ కొరడా ఝళిపిస్తున్నది. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై, ట్రాఫిక్‌, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నది. తొలుత జరిమానాలతో సరిపెడుతూనే, పదేపదే నిబంధనలను ఉల్లంఘించేవారి డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దుచేస్తున్నది. 2015 నుంచి ఇప్పటివరకు 21,194 లైసెన్సులపై వేటుపడింది. త్వరలో మరో ఆరు వేల లైసెన్సుల రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. లైసెన్సు సస్పెండ్‌ చేసేందుకు రెండు క్యాటగిరీలుగా విభజించారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన కేసులు మొదటి క్యాటగిరీగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్న వాటిని రెండో క్యాటగిరీగా వర్గీకరించి కేసులు నమోదుచేస్తున్నారు. వీటితోపాటు రోడ్డు ప్రమాదాల నివారణపై సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సులను కూడా రద్దు చేస్తున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
Licence1

జైలు శిక్ష పడేలా చర్యలు

ప్రధానంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై రవాణాశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. జరిమానాలతో పాటు డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దుచేస్తున్నది. మద్యం తాగి మూడుసార్లు పట్టుబడటం, సిగ్నల్స్‌ జంప్‌, ఓవర్‌లోడ్‌, పరిమితికి మించి ప్రయాణించడం వంటి కేసుల్లో డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దుచేస్తున్నారు. 2015 నుంచి గత నెల 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన 21,194 డ్రైవింగ్‌ లైసెన్సులను రవాణాశాఖ రద్దుచేసింది. పోలీసులు సిఫారసు, రవాణాశాఖ తనిఖీల్లో 14,807 లైసెన్సులను రద్దుచేయగా, పలు కేసుల్లో కోర్టు ఆదేశాలతో 937 లైసెన్సులు, ఇతర కేసుల్లో 5,450 లైసెన్సులు రద్దుచేశారు. ఒకసారి లైసెన్స్‌ రద్దుచేసిన చేసిన తర్వాత నిర్దేశితకాలంలో రాష్ట్రంలో మరెక్కడా డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోకుండా రవాణాశాఖ చర్యలు చేపడుతున్నది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దులో ఉన్నప్పుడు వాహనం నడుపుతూ దొరికితే జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్సులు జారీచేస్తుండటంతో డ్రైవింగ్‌ లైసెన్సు రద్దయిన వాహనదారుడు, ఒకే వ్యక్తి రెండు డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకోకుండా గుర్తించడం సులువైంది.

గ్రామీణ జిల్లాల్లో మద్యం కేసులు ఎక్కువే

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతరజిల్లాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 699 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినవారి లైసెన్సులను రద్దుచేశారు. పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ పరిధిలో 287, హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ పరిధిలో 293, వరంగల్‌ అర్బన్‌ పరిధిలో 183, రంగారెడ్డి ఆర్టీఏ పరిధిలో 122, హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ పరిధిలో 113, ఉప్పల్‌ ఆర్టీఏ పరిధిలో 111, హైదరాబాద్‌ సౌత్‌జోన్‌ పరిధిలో 92, హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ పరిధిలో 124 లైసెన్సులను రద్దుచేశారు. మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌రూరల్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, మేడ్చల్‌, ఆర్టీఏ ఉప్పల్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లోనూ లైసెన్సులు ఎక్కువగా రద్దుచేశారు. ఓవర్‌లోడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, పరిమితికి మించి ప్రయాణికుల తరలింపు కేసుల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,490, హైదరాబాద్‌ సౌత్‌జోన్‌లో 1,249, నార్త్‌జోన్‌లో 856, ఉప్పల్‌ ఆర్టీఏ పరిధిలో 917 లైసెన్సులను రద్దు చేశారు. కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి జిల్లాల్లో సగటున 900 నుంచి 700 లైసెన్సులు రద్దయ్యాయి. గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికుల తరలింపు, ఓవర్‌లోడ్‌ తరలింపునకు కారణమైన 2,616 మంది డ్రైవర్ల లైసెన్సులను రవాణాశాఖ రద్దుచేసింది. పోలీస్‌శాఖ చేసిన సిఫార్సుల్లో డ్రంకన్‌డ్రైవ్‌లో 2,210 లైసెన్స్‌లు, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌.. 616, ఓవర్‌స్పీడ్‌.. 65 లైసెన్సులు రద్దుచేశారు.

ఇకపై శాశ్వతంగా లైసెన్సు రద్దు

మరోవైపు ఇక నుంచి లైసెన్స్‌ల రద్దు, పునరుద్ధరణపై నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ‘ఒకసారి లైసెన్సు రద్దయిన వ్యక్తి పునరుద్ధరించుకున్న తర్వాత మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే పూర్తిస్థాయిలో డ్రైవింగ్‌ లైసెన్సును రద్దు చేసే ఆలోచన చేస్తు న్నాం. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా దాడులు ఉధృతం చేస్తున్నాం. కేసుల నమోదుతో రోడ్డు ప్రమాదాలు గతంలో పోల్చితే గణనీయంగా తగ్గాయి’ అని రవాణాశాఖ జేటీసీ రమేశ్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీసీ పాపారావు పేర్కొన్నారు.

2914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles