యువతే సమాజానికి శక్తి

Sun,January 20, 2019 02:11 AM

-దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలి
-ఇతరులకు సాయం చేస్తే దేవుళ్లతో సమానం
-గాంధీజీ ఆలోచనల స్ఫూర్తితో ఏదైనా సాధ్యమే
-తెలంగాణ అభివృద్ధిలో జాగృతి కృషి భేష్
-తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో అన్నా హజారే కితాబు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశ యువతే సమాజానికి శక్తి అని, యువకులు మేల్కొంటే దేశం, సమాజం బాగుపడుతుందని సామాజికవేత్త అన్నా హజారే అన్నారు. దేశ సేవచేయాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే కోణంలో యువత ఆలోచనావిధానం ఉండాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఎంపీ కవితతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అంశంపై ఆయన మాట్లాడుతూ... మహాత్మాగాంధీ 150వ వర్ధంతి సందర్భంగా సదస్సు నిర్వహిస్తున్నందుకు తెలంగాణ జాగృతిని అభినందించారు. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అహింసామార్గంలో యువత అంతమొందించాలని పిలుపునిచ్చారు.

సరైన దిశానిర్దేశం ఉంటే యువత ఏదైనా చేయగలుగుతుందని చెప్పారు. గాంధీజీ, స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఎన్ని ఆటుపోటులు ఎదురైనా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలని సూచించారు. గాంధీజీ చెప్పినట్టు దేశాన్ని మార్చాలంటే ముందు గ్రామాన్ని మార్చాలని, గ్రామాన్ని మార్చాలంటే అందులోని ప్రజలందరినీ మార్చాలని సూచించారు. ఆలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో సేవ చేయడంతోపాటు సమాజం కోసం కూడా సేవ చేయాలని, మనుషులకు సేవ చేస్తే దేవుడికి చేసినట్టేనని చెప్పారు. ఇతరుల బాధను అర్థం చేసుకున్నవాళ్లు దేవుళ్లతో సమానమని వర్ణించారు.

ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నా

20 ఏండ్ల వయస్సులో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పటికీ, గాంధీజీ గురించిన పుస్తకం చదివి నిర్ణయాన్ని మార్చుకున్నా. గాంధీజీ స్ఫూర్తితోనే సమాజం కోసం జీవితాన్ని త్యాగంచేశా. సేవ చేసేందుకే దేవుడు మనుషులను సృష్టించారని గ్రహించి, సమాజ సేవకు అంకితమయ్యా. సేవ చేసేందుకు పెండ్లి చేసుకోలేదు. పేదరికంలో ఉన్న నా గ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో సేవచేయాలని నిర్ణయించుకున్నా. ఒకప్పుడు గ్రామంలో పనిలేక ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లి రాళ్లుకొట్టి ఉపాధి పొందేవాళ్లు. గతంలో 300 ఎకరాల్లో ఒక పంటే పండేది. ప్రస్తుతం వర్షపు నీటిని కాపాడుకోవడంతో 1,200 ఎకరాల్లో మూడు పంటలు పండుతున్నాయి. ప్రతి ఒక్కరూ సమాజం కోసం త్యాగం చేయాలి. విత్తనం త్యాగం చేస్తేనే మహావృక్షమై ఫలాలనిస్తుంది. పన్నెండేండ్లలో రాలేగావ్‌లో జరిగిన అభివృద్ధిని చూసేందుకు ఆరు లక్షల మంది వచ్చా రు. రాలేగావ్‌లో ఐదుగురు పీహెచ్‌డీ సాధించారు. ఇద్దరు పీహెచ్‌డీ చేస్తున్నారుఅని అన్నా హజారే వివరించారు.

అమెరికాను అధిగమిస్తాం

తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ఎంపీ కవిత జాగృతిని ఏర్పాటుచేయడం గొప్ప విషయమని అన్నా హజారే కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తిచేశారు. ఇలా చేస్తే అభివృద్ధిలో అమెరికా, రష్యావంటి దేశాలను సైతం అధిగమించవచ్చని ధీమా వ్యక్తంచేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంపై యువత దృష్టి సారించాలని, కానీ సిగరెట్లు, గుట్కాలకు అలవాటుపడి పహిల్వాన్‌లాగా భ్రమ పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మనం చేసే పనుల వల్ల ఏం లాభం చేకూరుతుందో, కర్తవ్యం ఏమిటో తెలియాల్సిన అవసరం ఉండాలని చెప్పారు. సమాజం కోసం జీవించేవారు చర్రితలో నిలిచిపోతారని, సమాజానికి సేవ చేసినందుకే గాంధీజీ, సావిత్రిబాయిపూలే వంటి వారిని మననం చేసుకుంటున్నామని గుర్తుచేశారు.

1116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles