మార్గదర్శిగా రైతుబంధు

Sun,January 20, 2019 02:07 AM

-రైతులకు సముద్రంలో దీపస్తంభంలాంటిదీ పథకం
-వ్యవసాయ సంక్షోభాన్ని రూపుమాపడంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు అభినందనీయం
-సామాజికవేత్త, పద్మభూషణ్ అన్నా హజారే ప్రశంసలు
-లోక్‌పాల్‌పై 30 నుంచి నిరాహారదీక్ష చేపడుతానని ప్రకటన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న రైతుబంధు పథకం యావత్ దేశానికి అత్యవసరమని సామాజికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అన్నాహజారే చెప్పారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుని ఈ పథకాన్ని అమలుచేయాలని సూచించారు. తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సదస్సుకు వచ్చిన ఆయన శనివారం హైటెక్స్‌లోని నోవాటెల్‌లో మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు పథకాన్ని అమలు పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రైతుబంధు పథకం దేశం మొత్తానికీ మార్గదర్శనం కావాలని ఆకాంక్షించారు. పంటపెట్టుబడిగా ఎకరాకు రూ. ఐదు వేలు ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. వ్యవసాయ, రైతాంగ సంక్షోభానికి పరిష్కారం చూపడంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్రం కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారవేత్తలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని విమర్శించారు.

రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. విశ్వనాథన్ కమిటీ సిఫారసులను అమలుచేస్తున్నట్లు కేంద్రం అబద్ధాలు చెప్తున్నదని, అదే నిజమైతే రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు ఆశాజనకంగా ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయాభివృద్ధికోసం నీరు, నీటి కోసం ప్రణాళిక అవసరమన్నారు. నీరు, ప్రణాళిక, మార్కెటింగ్ వసతులు కల్పించినప్పుడే రైతుల జీవితాలు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. కానీ రైతులను పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రైతులకు అండగా నిలువడం గొప్ప విషయమని కొనియాడారు.

లోక్‌పాల్‌పై 30 నుంచి అన్నా హజారే నిరాహారదీక్ష

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు గడుస్తున్నప్పటికీ లోక్‌పాల్‌ను నియమించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 30వ తేదీనుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు అన్నా హజారే ప్రకటించారు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును ఆమోదిస్తే ప్రజల చేతుల్లోకి అధికారం వస్తుందనే కారణంగా ఏ పార్టీ కూడా ఈ చట్టం అమలుకు సుముఖత చూపలేదని విమర్శించారు. 2011లో ప్రజలంతా లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేయగా.. 2013లో చట్టరూపం దాల్చిందన్నారు. తాము అధికారంలోకి రాగానే లోక్‌పాల్‌ను నియమించి అవినీతిని అంతమొదిస్తామని 2014 జనవరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ప్రకటించారని, కానీ అధికారంలోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా లోక్‌పాల్‌ను నియమించడంలో విఫలమయ్యారని విమర్శించారు.

ఈ విషయంపై కేంద్రానికి 32 సార్లు లేఖలు రాసినా సమాధానం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని అమలుచేయాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆదేశించినా కేంద్రం పట్టించుకోవడం లేదని, బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందినా, రాష్ట్రపతి సంతకం చేసినా ఖాతరుచేయకుండా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని అమలుచేస్తే రాఫెల్ డీల్ వంటి కుంభకోణాలు బట్టబయలవుతాయనే కేంద్ర ప్రభుత్వం దాటవేస్తున్నదన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వమైనా సామాన్య ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలిపారు. తన జీవితంలో 19 సార్లు దేశంకోసం అహింసామార్గంలో నిరాహారదీక్షలు చేశానని, దేశ, సమాజ హితమే తన లక్ష్యమని పేర్కొన్నారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమలు చేసేవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.

2825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles