రెబల్స్‌కు నామినేటెడ్ వల!


Mon,March 25, 2019 02:43 AM

Andhra Pradesh TDP faces Rebel Trouble

-మభ్యపెడుతున్న బాబు
-అయినా చిక్కని నేతలు
-గెలవడమే కష్టమంటున్న సీనియర్లు
-నామినేటెడ్ హామీలకు విముఖం
-బరిలో నిలిచి తీరుతామని ప్రకటన
-ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో రెబల్స్
-కష్టకాలంలో టీడీపీకి కొత్త తలనొప్పి
-తరుణోపాయంగా పవన్‌కల్యాణ్
-జనసేనతో లోపాయికారి ఒప్పందాలు?
-వైసీపీ ఓట్లు చీల్చేందుకు.. టీడీపీ నేతల విజయానికి ప్లాన్!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రెబల్స్‌ను బుజ్జగించుట ఎలా? ఇప్పుడు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇదే అంశంపై దృష్టిసారించారు. టీడీపీ ఏపీలో తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా రెబల్స్ బెడద తలనొప్పులు సృష్టిస్తున్నది. కొన్నిచోట్ల సిట్టింగ్‌లను కాదని కొత్తవారికి, కొన్నిచోట్ల బంధువర్గానికి టికెట్లు ఇవ్వడం ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న నేతల్లో ఆగ్రహం రగిలించింది. వారంతా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఎన్నికలయ్యాక అవిచేస్తాం.. ఇవిచేస్తాం అంటూ మభ్యపెట్టినా రెబల్స్ వినటం లేదు. దీంతో చంద్రబాబు నామినేటెడ్ పదవులను ఎరవేస్తున్నారని సమాచారం. వీటికీ రెబల్స్ ససేమిరా అంటున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అధికారంలోకి వస్తామో రామో తెలియని పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల గురించి మాట్లాడవద్దని, తాము కచ్చితంగా బరిలో ఉంటామని రెబల్స్ తేల్చి చెప్తున్నారని సమాచారం.

పవన్‌కల్యాణ్ పైనే ఆఖరు ఆశలు

ప్రజావ్యతిరేకత, రెబల్స్ తలనొప్పుల నుంచి తప్పించుకోవటానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పైనే బాబు ఆఖరు ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. మొన్నటిదాకా ముసుగులో సాగిన పవన్ - బాబు రాజకీయాలు.. ఎన్నికల ప్రచారం జోరందుకునేసరికి ముసు గు తొలిగించుకున్నాయన్న వాదన ఉన్నది. బాబు మాటలు పవన్ నోట రావడం ఇందు కు నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ సీట్లు తగ్గే పక్షంలో పవన్ ఆదుకుంటారన్న ఆశతో బాబు ఉన్నారని అంటున్నారు. పవన్ కూడా ముందుగానే కీలక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించేలా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టారనే చర్చ నడుస్తున్నది. దీనిద్వారా వైసీపీ ఓట్లు చీల్చడం.. మరోవైపు టీడీపీ అభ్యర్థులను గెలిపించడం అనే జంట వ్యూ హంతో పవన్, బాబు ఉన్నారని అంటున్నారు. పవన్ తీరుకూడా ఇందుకు బలా న్ని చేకూర్చుతున్నది. తొలుత పొత్తులకు సిద్ధమన్న జనసేన.. కలిసివచ్చిన పార్టీలకు మొం డిచెయ్యి ఇచ్చింది. చంద్రబాబు సూచనమేరకు.. వైసీపీ ఓట్లు చీల్చేలా పలువురు అభ్యర్థులను మార్చారన్న విమర్శలున్నాయి. కృష్ణాజిల్లా పామర్రు, నూజివీడు విషయంలో చంద్రబాబు మార్కు స్పష్టమైంది. పామర్రు టికెట్‌ను జనసేన ముందుగా డీవై దాస్‌కు కేటాయించింది. అక్కడ వైసీపీ ఓట్లు చీల్చాలంటే బీఎస్పీ అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు సూచించినట్టు చెప్తున్నారు. ఫలితంగానే దాసును పక్కన పెట్టారని అంటున్నారు. 21 రిజర్వుడు స్థానాలకు జనసేన టికెట్లు ఇస్తామని ప్రకటించినా.. ఆయా స్థానాల్లో వైసీపీ ఓట్లు చీల్చి, టీడీపీకి లబ్ధి చేకూరేలా బాబు ఎత్తుల మేరకు పవన్ అభ్యర్థులను మార్చారనే విమర్శలున్నాయి. సీపీఐకి కూడా జనసేన మొండిచెయ్యి ఇచ్చింది. విజయవాడ వెస్ట్‌లో బలమైన క్యాడర్ ఉండి గతంలో గెలవడంతో సీపీఐ ఈ సీటును కోరుకున్నది. దీనికి అంగీకరించని పవన్.. నూజివీడుతో సరిపెట్టుకోవాలని ప్రతిపాదించారు. సరేనన్న సీపీఐ.. అక్కడ అక్కినేని వనజను నిలబెట్టేందుకు ఏర్పాట్లుచేసుకున్నది. ఈలోపే చంద్రబాబు ఆదేశాలతో సీన్ మారిపోయిందని చెప్తున్నారు. నూజివీడులో టీడీపీ గెలువాలంటే వైసీపీ ఓట్లు చీల్చగలిగే నాయకుడిని వైసీపీ నుంచే తెచ్చి జనసేన తరఫున నిలబెట్టాలని చంద్రబాబు భావించారని సమాచారం. ఆ క్రమంలోనే జనసేన అభ్యర్థి ఇక్కడ నామినేషన్ వేశారు. ఈ రెండు సీట్లు కాదన్నా.. విజయవాడ పార్లమెంటు స్థానం మాత్రం గ్యారెంటీగా ఇస్తానని సీపీఐకి పవన్ ప్రతిపాదించారు. దీంతో అక్కడ ఎంపీ అభ్యర్థిగా చలసాని అజయ్‌కుమార్‌ను సీపీఐ ఎంపికచేసింది. కానీ.. మళ్లీ సీన్ మారిపోయింది. విజయవాడ ఎంపీ స్థానాన్ని పెండింగ్‌లో పెడుతున్నామంటూ చావుకబురు చల్లగా చెప్పారు. అంతలోనే శనివారం రాత్రి అక్కడ జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణబాబును ప్రకటించారు.

దీనిపై తీవ్రంగా మండిపడిన సీపీఐ నాయకులు.. చంద్రబాబు ఆదేశాలను పవన్ పాటిస్తున్నారని విమర్శించారు. తాజా పరిణామాలతో జనసేనతో తెగతెంపులు చేసుకోవాలని సీపీఐ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీకి అనుకూలంగా జనసేన డబుల్‌గేమ్ ఆడుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావుపై పోటీకి పసుపులేటి ఉషాకిరణ్‌ను జనసేన ప్రకటించింది. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన గంటాపై ఆర్థికంగా ఏమాత్రం లేని ఉషాకిరణ్‌ను ఎందుకు నిలిపారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఉషాకిరణ్ భర్త మంత్రి గంటాకు అత్యంత సన్నిహితుడన్న విషయాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. భీమిలి నుంచి జనసేనలో ఇప్పటివరకు లేని సందీప్‌ను ఖరారుచేశారు. సందీప్ కూడా టీడీపీ అభ్యర్థి రమేశ్‌బాబుకు సోదరు డు కావటం గమనార్హం. పాయకరావుపేటలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నక్కా రాజబాబుకు టికెట్ ఇచ్చారు. మంత్రి అయ్యన్నపాత్రుడిపై బలహీనంగా ఉండే అభ్యర్థి కోసం జనసేన వెతుకుతున్నదనే ప్రచారం ఉన్నది. కడప జిల్లా రాజంపేటలో తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు కుసుమకుమారి జనసేన నుంచి పోటీచేస్తున్నారు. పక్షం కిందటి వరకు ఆమె టీడీపీలో ఉండి, ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ టీడీపీ తరఫున చెంగల్రాయుడికి టికెట్ ఇచ్చారు. అయితే లోపాయికారిగా కుసుమకుమారిని పోటీచేయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ టీడీపీ విజయానికి పరోక్షంగా సహకరించేందుకేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నేతలు రగిలి.. రెబల్స్‌గా

ఈసారి చంద్రబాబు తన బంధువర్గానికి పెద్దపీట వేశారు. తనతోపాటు లోకేశ్, బాలకృష్ణతోపాటు పలువురు బంధువులకు టికెట్లు ఇచ్చారు. వారు పార్టీతో సంబంధం లేకుండా వ్యాపారాల్లో స్థిరపడినవారు కావడంతో పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇన్నేండ్ల నుంచి పార్టీకోసం పనిచేస్తే.. అసలు సమయంలో ఇలా కొందరు పారాచూట్‌లతో దిగి టికెట్లు ఎగరేసుకుపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో స్వతంత్రులుగా రంగంలో ఉంటున్నా రు. ఆదివారం వరకు 41 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సొంతపార్టీ అభ్యర్థులపైనే పోటీకి దిగుతూ నామినేషన్లు దాఖలు చేశారం టే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. వీరిలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రు లు, సీనియర్లే కావటం విశేషం. వీరందరినీ సముదాయించే పనిలో పడిన చంద్రబాబు.. వారికి నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారని సమాచారం. ఈ అస్త్రం కూడా ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. అసలు పార్టీ అధికారంలోకి రావటమే కష్టంగా ఉంటే.. ఇక నామినేటెడ్ ముచ్చట్లెందుకని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆఖరు నిమిషంలోనైనా అర్థంచేసుకున్న కొందరు బీఫాం లు తీసుకున్న తర్వాత కూడా పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపే ప్రశ్నార్థకంగా మారుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనాకష్టంగా గెలిచినా.. నామినేటెడ్ పదవులు అసలు ఇస్తారా? అనేది మరో చిక్కుముడి. ఐదేండ్లుగా ఇవ్వని నామినేటెడ్ పదవులు గెలిచిన తర్వాత ఇస్తారా? ఇస్తే ఎంతమందికి? అనే సందేహాలను పలువురు చంద్రబాబు ముందే లేవనెత్తారని సమాచారం. నామినేటెడ్ వల అనేది తాత్కాలిక నాటకమేనని తేల్చేస్తున్న రెబల్స్.. బాబు మాటలను పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. పార్టీ నాయకత్వం సంప్రదింపులు జరిపినా ససేమిరా అన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. నరసాపురం అసెంబ్లీ నుంచి రెబల్‌గా బరిలో ఉండటం ఖాయమని తెగేసిచెప్పారు. దీంతో ఇక్కడ టీడీపీ అధికారిక అభ్యర్థికి చుక్కలు కనిపిస్తున్నాయని పలువురు వాఖ్యానిస్తున్నారు. ఇక కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ నేత విజయలక్ష్మి కూడా స్వతంత్రంగా పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడ బలమైన అభ్యర్థిగా విజయలక్ష్మి ఉన్నప్పటికీ.. వర్గవిభేదాలకు ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. రాజశేఖర్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో విజయలక్ష్మి స్వతంత్రంగా పోటీకి దిగుతున్నారు. ఇలా ఏపీలోని 41 నియోజకవర్గాల్లో టీడీపీకి రెబల్స్ బెడద పొంచి ఉంది.

3205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles