రాజ్యసభకు నిస్వార్థ సేవకుడు


Tue,March 13, 2018 04:02 AM

An unselfish servant of the Rajya Sabha

-ఆది నుంచీ కేసీఆర్ వెన్నంటే జోగినిపల్లి..
-తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరుగని సైనికుడు
-పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో చురుకైన పాత్ర..
-అజాతశత్రువు సంతోష్‌కుమార్
joginpally-santosh-kumar
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమనేతగా గులాబీ జెండా ఎత్తిన రోజు నుంచి నేటి వరకు ఆయన వెన్నంటే ఉన్నవ్యక్తి జోగినిపల్లి సంతోష్ కుమార్. చీకటి వెలుగులు, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కేసీఆర్ వెన్నంటి నడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరుగని సైనికుడిగా పనిచేశారు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా అందరి మనిషిగా నిలిచారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ.. చిన్నయినా, పెద్దయినా అందరితో గౌరవంగా మెలిగారు. ఇలా పార్టీకోసం నిస్వార్థంగా సేవచేస్తున్న సంతోష్ కుమార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడమంటే ఆయనకు సరైన గుర్తింపు ఇచ్చినట్టేనని టీఆర్‌ఎస్ పార్టీ నేతలంతా ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో 1976 డిసెంబర్ 7న సంతోష్‌కుమార్ జన్మించారు. తండ్రి రవీందర్‌రావు, తల్లి శశికళ. ఆయన ఉన్నత విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే పూర్తయింది. పుణె యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు.

ఆదినుంచీ కేసీఆర్ వెన్నంటే..

ఉద్యమనేత కేసీఆర్ సూచన మేరకు టీఆర్‌ఎస్ ఆవిర్భావం కంటే ముందునుంచే పార్టీ ఏర్పాటు సన్నాహాలు, జెండా, ఎజెండాల రూపకల్పనలో జోగినిపల్లి సంతోష్‌కుమార్ పాలుపంచుకున్నారు. మృదుస్వభావి, మితభాషి అయిన ఆయన ఉద్యమకాలంలో అధినేత కేసీఆర్ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతనూ విజయవంతంగా పూర్తిచేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష సమయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో తనవంతు పాత్ర పోషించారు. ఉద్యమ నేతగా కేసీఆర్ కరీంనగర్ నుంచి ఆమరణ దీక్షకు బయల్దేరుతున్న సమయంలో ఆనాటి పాలకులు ఆయన్ని అరెస్ట్‌చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అత్యంత ఉద్వేగభరిత వాతావరణంలోనూ సంతోష్‌కుమార్ చిన్న తొట్రుపాటుకు కూడా అవకాశం ఇవ్వలేదు. అలుగునూరు చౌరస్తా నుంచి ఖమ్మం జైలుకు.. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించేవరకు అధినేత వెన్నంటే ఉన్నారు.

నిమ్స్ దవఖానలో 11 రోజులు అధినాయకుడిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కేసీఆర్ దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేయడం.. వచ్చిన ప్రకటన వెనుకకు వెళ్లడం తదనంతర పరిణామాలతో ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటిలోనూ చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా దాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. బహిరంగసభలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు మొదలుకుని.. పలు ఉపఎన్నికల దాకా.. ఏ కార్యక్రమైనా, ఏ ఎలక్షన్ అయినా క్యాడర్‌నూ.. లీడర్‌ను సమాయత్తంచేసి సమన్వయం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఒక క్రమశిక్షణగల సైనికుడిలా 18 ఏండ్లుగా కేసీఆర్ వెంట నడుస్తున్నారు.
Vivekananda

అజాతశత్రువు..

తెరముందు కనపడకపోయినా..అధినేత కేసీఆర్ వ్యూహాలను, సూచనలను తు.చ. తప్పకుండా అమలు చేయడంలో సంతోష్‌కుమార్‌ది భిన్నమైన శైలి. అధినేత వ్యక్తిగత విషయాలతో పాటు పార్టీకి, కార్యకర్తలకు, నేతలకు సమన్వయకర్తగా, అందరికీ తలలో నాలుకలా మెదులుతున్నారు. పార్టీ విషయాలైతే క్యాడర్‌నీ, ప్రభుత్వ కార్యక్రమాలైతే ప్రజలనూ కలుపుకుని ముందుకెళ్లడంలో ఆయన చూపే చొరువ ప్రత్యేకమైనది. ఆయనకున్న సహనం, ఓపిక చూసి పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోతాయి. సమస్య ఎంత క్లిష్టమైనా సరే.. ఓపిగ్గా పరిష్కరించి, వినయంగా నిలబడే నిండైన వ్యక్తి, రోజులో 16 నుంచి 18 గంటలు అలిసిపోకుండా పనిచేస్తూ వివాదరహితుడుగా పార్టీలో తనకంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. పార్టీలో సీనియర్ నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల దాకా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తున్నారు.

ఉద్యమనేత కేసీఆర్ సూచనల మేరకు ఉద్యమానికి దివిటీగా నిలిచి, తెలంగాణ గుండెచప్పుడు వినిపించిన టీ న్యూస్‌కు ఎండీగా గురుతర బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. చానల్ సిబ్బందిని తన సొంత మనుషులుగా భావించి ప్రతీ ఒక్కరినీ చిరునవ్వుతో పలుకరిస్తారు. అటు పార్టీ ప్రధానకార్యదర్శిగా కూడా పార్టీకి అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా అమలు చేశారు. ప్రజాహితం కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడంలోనూ చురుకైన పాత్ర పోషించారు. సామాజిక సేవలోనూ నేను సైతం అంటూ ముందుకొచ్చారు. టీ న్యూస్ ఎండీగా, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా, సామాజిక సేవకుడిగా.. ఇప్పుడు రాజ్యసభకు ఎదిగిన సంతోష్‌కుమార్.. అజాత శత్రువు.

koleti-damodar

హుందాగా పెద్దల సభకు..

ఇంతకాలం నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన సంతోష్‌కుమార్ ఇప్పుడు ప్రజానాయకుడిగా పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. ఏ పదవీ ఆశించకుండా ఆహోరాత్రులు టీఆర్‌ఎస్ పార్టీకి సేవ చేసిన సంతోష్‌కుమార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం సముచిత గౌరవమే అని పార్టీ నేతలంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. థర్డ్‌ఫ్రంట్ నెలకొల్పి జాతీయ రాజకీయాలవైపు సీఎం కేసీఆర్ అడుగేస్తున్న తరుణంలో ఢిల్లీలోనూ సంతోష్‌కుమార్ అధినేతకు కుడిభుజంగా మారబోతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

6880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS