సాగర్ 26 గేట్లు మూసివేత


Tue,August 20, 2019 03:16 AM

All gates of Nagarjuna sagar closed

-శ్రీశైలంలో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల
-శాంతించిన కృష్ణా, తుంగభద్ర, భీమా నదులు
-ఎగువ ప్రాజెక్టుల్లో తగ్గిన ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో
-ప్రాజెక్టులను పూర్తిగా నింపే పనిలో అధికారులు
-నిండుగా జలకళలాడుతున్న ప్రాజెక్టులు
-కాల్వల ద్వారా సాగునీటి అవసరాలకు

హైదరాబాద్/ నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధులు, నమస్తే తెలంగాణ : ఎగువన వరద తగ్గుముఖం పట్టి, కృష్ణమ్మ నెమ్మదించటంతో వివిధ ప్రాజెక్టుల్లో నీటినిల్వలను అంచనావేస్తూ అవుట్‌ఫ్లోను గణనీయంగా నియంత్రిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదితోపాటు తుంగభద్ర, భీమా నదులు శాంతించాయి. దీంతో అన్ని ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సోమవారం సాయంత్రం ఆల్మట్టి జలాశయం నుంచి 2 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ఇక్కడ పూర్తిస్థాయి నిల్వకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం వరకు ఆల్మట్టి 121 టీఎంసీలకు చేరింది. నారాయణపురకు వరద రెండు లక్షల క్యూసెక్కులు వస్తుండటంతో.. అవుట్‌ఫ్లోను 1.87 లక్షలకు తగ్గించారు. ఇక్కడ ప్రస్తుతం 33.38 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టుల్లో గరిష్ఠంగా నీటిని నిల్వచేస్తూ.. వచ్చే వరదను దిగువకు వదులుతున్నారు.

జూరాల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపారు. ఇక్కడ 12 గేట్ల ద్వారానే నీరు విడుదలవుతున్నది. తుంగభద్ర ప్రాజెక్టులో 12 గేట్లు మాత్రమే తెరిచి ఉంచారు. శ్రీశైలంలో కేవలం రెండు గేట్ల ద్వారా దిగువకు నీరు వదులుతున్నారు. మంగళవారానికి వాటిని కూడా మూసివేసే అవకాశం ఉన్నది. నాగార్జుసాగర్‌లో సోమవారం రాత్రికి మొత్తం 26 గేట్లను మూసివేశారు. రిజర్వాయర్‌కు వరద ఉధృతి అధికం కావడంతో ఈ నెల 12న సాగర్ 26 గేట్లను ఎత్తిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సోమవారం ఉదయం వరకు సుమారు 350 టీఎంసీ నీటిని దిగువకు విడుదలచేశారు. మొత్తంగా ఆల్మట్టి మొదలుకుని, పులిచింతల వరకు కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని కాల్వలకు నీటివిడుదల కొనసాగుతున్నది. అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తున్నారు.

తగ్గిన పర్యాటకుల తాకిడి

సోమవారం ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో నాగార్జునసాగర్‌కు పర్యాటకులు బాగా తగ్గారు. దీంతో డ్యాం పరిసర ప్రాంతాలు బోసిపోయాయి. ఆదివారం ఆరు లక్షలమంది పర్యాటకులు రాగా సోమవారం వేలసంఖ్యలో కూడా రాలేదు.
nagarjuna-sagar2

2589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles