సాగర్‌లో కృష్ణమ్మ గర్జన


Wed,August 14, 2019 01:52 AM

All 26 gates of Nagarjuna Sagar dam opened

-26 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
-శ్రీశైలంలోనూ భారీగా ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో
-కృష్ణాబేసిన్‌లో కొనసాగుతున్న పరవళ్లు
-ఆల్మట్టిలో క్రమంగా తగ్గుతున్న అవుట్‌ఫ్లో
-శ్రీశైలం, సాగర్‌లో మాత్రం అదే జలసవ్వడి
-పులిచింతల నుంచి 4.22లక్షల క్యూసెక్కుల విడుదల

హైదరాబాద్/ మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ నందికొండ: కృష్ణాబేసిన్‌లో జలజాతర కొనసాగుతున్నది. ఆల్మట్టి మొదలు దిగువన పులిచింతలవరకు కృష్ణానదిలో లక్షల క్యూసెక్కులు పరవళ్లు తొక్కుతున్నాయి. కొంత తగ్గినా.. ఆల్మట్టి, నారాయణపుర జలాశయాలకు వరద స్థిరంగా కొనసాగుతుండగా.. దిగువన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు మాత్రం జోరుగా వరద వస్తూనే ఉన్నది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులనుంచి భారీస్థాయిలో జలాలను విడుదలచేస్తున్నారు. నాగార్జునసాగర్ మొత్తం 26 గేట్లను 27 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదలచేస్తుండటంతో కృష్ణమ్మ గర్జిస్తూ కిందికి దుంకుతున్నది. ఈ నీటితో పులిచింతలలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతుండటంతో అక్కడకూడా నీటివిడుదల సామర్థ్యాన్ని పెంచా రు. దీంతో గత రెండ్రోజులుగా సముద్రంలో కలుస్తున్న కృష్ణాజలాల పరిమాణం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి జూరాల వరకు కొనసాగుతున్న వరదను పరిశీలిస్తే రానున్న మరో మూడునాలుగు రోజులవరకు నాగార్జునసాగర్‌కు సుమారు ఐదారు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగువన స్థిరంగా ప్రవాహం

కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు లక్షల క్యూసెక్కులకుపైగా వరద స్థిరంగా వస్తున్నది. కొన్నిరోజుల కిందటివరకు భారీవరద దరిమిలా జలాశయం నీటిమట్టాన్ని తగ్గించిన కర్ణాటక అధికారులు.. ప్రస్తుతం వరద తగ్గటంతో నిల్వస్థాయిని పెంచుతూనే దిగువకు సరాసరి 5.70 లక్షల క్యూసెక్కులు విడుదలచేస్తున్నారు. నారాయణపుర జలాశయం వద్ద కూడా మంగళవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 6 లక్షల క్యూసెక్కుల స్థాయిలో స్థిరంగా కొనసాగింది. అధికారులు నెమ్మదిగా జలాశయంలో నీటిమట్టాన్ని పెంచుతూ.. దిగువకు స్థిరంగా 5.94 లక్షల క్యూసెక్కులను విడుదలచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంట ల సమయానికి ఉజ్జయినికి వరద సుమారు 22 వేల క్యూసెక్కులకు తగ్గడంతో అధికారులు అవుట్‌ఫ్లోను దాదాపు 11 వేల క్యూసెక్కులకు కుదించారు. దీంతో జూరాల జలాశయానికి స్వల్పంగా వరద తగ్గటంతో ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 7.26 లక్షల క్యూసెక్కులుగా, అవుట్‌ఫ్లో 7.17 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతున్నాయి.

తుంగభద్ర అవుట్‌ఫ్లో తగ్గినా.. రెండ్రోజులపాటు వదిలిన రెండు లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద జలాలు సోమవారం రాత్రి నుంచి శ్రీశైలానికి చేరుకుంటున్నాయి. ఫలితంగా మంగళవారం జూరాల నుంచి వరద స్థిరంగా ఉన్నా.. శ్రీశైలానికి రాత్రి 11 గంటల సమయానికి 8.66 లక్షల క్యూసెక్కుల పైచిలుకు ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో అధికారులు పది గేట్లను 42 అడుగుల మేర ఎత్తి దిగువకు 8.90 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 6 యూనిట్లలో 900 మెగావాట్ల కరంటు ఉత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కరంటు ఉత్పత్తి చేసి, 30,143 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

nagarjuna-sagar3

సాగర్‌లో పెరిగిన అవుట్‌ఫ్లో

శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదను నియంత్రించడంలో భాగంగా నాగార్జునసాగర్ జలాశయంలో ఒకవైపు నీటిమట్టాన్ని క్రమంగా పెంచుతూనే దిగువకు అవుట్‌ఫ్లోను కూడా అధికారులు పెంచారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు 246.54 టీఎంసీలుగా ఉన్న నీటినిల్వను మంగళవారం రాత్రి పదిగంటలకు సుమారు 273 టీఎంసీలకు పెంచారు. మరోవైపు అవుట్‌ఫ్లోను కూడా ఐదున్నర లక్షల క్యూసెక్కులకుపైగా పెంచారు. ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లను 27 అడుగుల మేర ఎత్తి నీటిని భారీగా విడుదలచేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.

నాగార్జునసాగర్ నుంచి భారీస్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగుతుండటంతో పులిచింతల జలాశయంలో సుదీర్ఘకాలం తర్వాత జలసవ్వడి వినిపిస్తున్నది. మంగళవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి పులిచింతలకు 5.80 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా.. దిగువకు 4.22 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ప్రకాశం బరాజ్ మీదుగా కృష్ణమ్మ కడలివైపు పరవళ్లు తొక్కుతున్నది. పదేండ్ల తర్వాత ప్రకాశం బరాజ్ వద్ద ఈ స్థాయిలో ఇన్‌ఫ్లోలు నమోదు కావడం విశేషం.
nagarjuna-sagar2

4163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles