మద్యం చాక్లెట్లు.. గంజాయి ఐస్‌క్రీం!


Mon,April 16, 2018 03:07 AM

Alcohol chocolate made with 380 types of brands

-రాజధానిలో పంథా మార్చిన మత్తు మాఫియా
-380 రకాల బ్రాండ్లతో మద్యం చాక్లెట్ల తయారీ
-ఆయుర్వేద ఔషధాల ముసుగులోనూ సరఫరా
-ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ దాడుల్లో విస్తుగొలిపే వాస్తవాలు

Tigher
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆధునిక సాంకేతికత, అడుగడుగునా నిఘా పెరుగడంతో మద్యం, గంజాయి మాఫియా పంథా మార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లను మద్యం, గంజాయితో తయారుచేసి విక్రయిస్తున్నది. ఆయుర్వేద ఔషధాల ముసుగులో సైతం విక్రయిస్తూ ప్రజలను మత్తుకు బానిసలను చేస్తున్నది. హైదరాబాద్‌లో ఇటీవల ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో వెలుగు చూసిన విస్తుగొలిపే వాస్తవాలు ఇవి.

వేర్వేరు రాష్ర్టాల నుంచి సరఫరా

హైదరాబాద్‌లోని లోయర్ ధూల్‌పేట, టక్కర్‌వాడీకి చెందిన బ్రిజ్‌రాజ్‌సింగ్ బీహార్ నుంచి గంజాయితో తయారుచేసిన మత్తు చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తుండగా ఆబ్కారీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వీటిని టైగర్ ఆయుర్వేద చాక్లె ట్స్ లేబుల్‌తో ప్యాక్‌చేసి విక్రయిస్తుండడంతో ఎవరికీ అనుమా నం రావడం లేదు. వీటిని కాలేజీలు, స్కూల్ విద్యార్థులు కొని మత్తులో మునిగిపోతున్నారు. మల్లేపల్లిలోని చాక్లెట్ హబ్‌లో మద్యంతో తయారుచేస్తున్న చాక్లెట్లను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఇక్కడ 380 రకాల బ్రాండ్ల పేరుతో చాక్లెట్లు లభ్యమయ్యాయి. రమ్ చాక్లెట్స్, ఎస్‌డబ్ల్యూ, రమ్ ర్యాట్స్, బ్లాక్ కరెంట్, రమ్ రైజింగ్, స్కాచ్ చాక్లెట్స్, టీచర్స్ చాక్లెట్, విస్కీ చాక్లెట్ పేర్లతో తయారుచేస్తున్నారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్ కు తరలించారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నారు. ఈ దాడుల్లో ఏడు మద్యం బాటిళ్లు కూడా లభించాయి.

ఆకర్షించేలా డిజైన్లు

నగరంలోని బడా షాపింగ్ మాల్స్‌లో సైతం లిక్కర్ చాక్లెట్లు విక్రయిస్తున్నట్టు సమాచారం. వరంగల్, కరీంగనర్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని షాపింగ్‌మాల్స్‌తోపాటు, ఏపీలోనూ ఈ దందా సాగుతున్నదని తెలిసింది. వీటి ధర రూ.50-100 ఉంటున్నది. లిక్కర్ చాక్లెట్లు మద్యం బాటిల్‌ను పోలినట్టుగా పొడవుగా ఉంటాయి. వీటి పైపొర గట్టిగా ఉంటుంది. కొరికితే మధ్యలో ఉన్న మద్యం బయటికి వచ్చేలా చాక్లెట్లను తయారు చేస్తున్నారు. సాధారణ చాక్లెట్ల కంటే అమితంగా ఆకట్టుకునేలా, చూడగానే గుర్తించేలా మద్యం సీసాను పోలి ఉండే డిజైన్‌ను దీని తయారీకి ఎంచుకున్నారు. మరికొందరు గంజాయిని పొడిగా చేసి చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌లో కలిపి అమ్ముతున్నారు. మరికొన్ని ముఠాలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లో ఎల్‌ఎస్‌డీ బ్లాస్ట్ డ్రగ్‌ను పెట్టి విక్రయిస్తున్నాయి. కొన్ని రకాల డ్రగ్స్‌ను నగరంలోనే తయారుచేస్తుండగా మరికొన్నింటిని గోవా, బీహార్ నుంచి తీసుకొస్తున్నారు.

అక్రమార్కులపై పీడీ కేసులు

గంజాయి విక్రయాలపై నిరంతరం నిఘా పెడుతున్నాం. గంజాయి విక్రేతలపై పీడీయాక్టు నమోదుచేస్తున్నాం. గంజాయి విక్రయాలను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో రూట్‌వాచ్ నిర్వహించి తనిఖీలు జరుపుతున్నాం. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లతోపాటు ప్రైవేట్ బస్సుల అరైవల్ పాయింట్ల వద్ద కూడా నిఘా పెట్టాం. కొన్ని ముఠాలు చాక్లె ట్లు, కుల్ఫీ తదితర తినుబండారాల ముసుగులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందింది. దీంతో దాడులను ముమ్మరం చేశాం. లిక్కర్ చాక్లెట్ల విక్రయాలపై నిఘా పెంచాం.
-అజయ్‌రావు,ఎక్సైజ్ జాయింట్ కమిషనర్

3400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles