ధాన్యం సేకరణలో తెలంగాణ భేష్


Sun,January 13, 2019 02:49 AM

Akun Sabharwal Says Telangana in Grain collection

-పీడీఎస్ విధానం ఇతర రాష్ర్టాలకు ఆదర్శం
-కేంద్ర ఆహార ప్రజాపంపిణీశాఖ కార్యదర్శి రవికాంత్
-వీడియోకాల్ ద్వారా రైతులతో మాటామంతి
-సంతృప్తి వ్యక్తంచేసిన రైతులు, రేషన్ లబ్ధిదారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ధాన్యం సేకరణ, ప్రజాపంపిణీ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదని కేంద్ర ఆహార ప్రజాపంపిణీశాఖ కార్యదర్శి రవికాంత్ పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా వారికి అందుబాటులో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్), ధాన్యం సేకరణ విధానాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన శనివారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాలభవన్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొనుగోలు కేం ద్రాల్లో ధాన్యం విక్రయిస్తున్న రైతులతో వీడియోకాల్ ద్వారా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు, రేషన్‌షాపుల్లో లబ్ధిదారులు ఐరిస్ ద్వారా సరుకులు తీసుకుంటున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. గతేడాదికంటే ధాన్యం దిగుబడి ఎందుకు ఎక్కువగా వచ్చింది? కనీస మద్దతు ధర లభిస్తున్నదా? కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయా? ధాన్యం విక్రయించిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయి? ఇతర సమస్యలేమైనా ఎదురవుతున్నాయా? అని రైతులను వీడియోకాల్‌లో అడిగి తెలుసుకున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడంతోపాటు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యం డబ్బులు సకాలంలో రైతుల ఖాతాలో జమకావఢం, ఐరిస్, బయోమెట్రిక్, రేషన్ పోర్టబిలిటీ వంటివి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని రవికాంత్ ప్రశంసించారు.

ధాన్యం కొనుగోళ్లు ఎందుకు పెరిగాయి?

గతేడాది వానకాలం కంటే ఈసారి 208 శాతం అధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నందుకు గల కారణాలను రవికాంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, సకాలంలో వర్షాలు, 24 గంటల కరంట్, రైతుబంధు వంటి పథకాలు రాష్ట్రంలో ధాన్యం దిగుబడికి ప్రధాన కారణాలని, గత ఏడాది 16 లక్షల టన్నులు కొనుగోలుచేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 38 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌరసరఫరాల కమిషనర్ అకున్‌సబర్వాల్ వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధరకాల బకాయిలు, మార్కెట్ రుసుం, ఆర్డీసెస్ కమీషన్, ఇతర అంశాలకు సంబంధించి ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర అధికారిని ఆయన కోరారు. పోర్టబిలిటీ విధానాన్ని లబ్ధిదారులు పెద్దఎత్తున ఉపయోగించుకుంటున్నారని, పదినెలల్లో 1,13,74,000 లావాదేవీలు జరిగాయని తెలిపారు. బయోమెట్రిక్ ద్వారా సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో త్వరలో ఐరిస్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్‌షాపుల్లో అమలులోకి తెస్తామని చెప్పారు.

కేంద్ర అధికారి ప్రశ్నలకు రైతుల స్పందన ఇది..

నాలుగు రోజుల్లోనే డబ్బులు మా పొలానికి దగ్గర సర్కారు ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం ఉన్నది. అక్కడికి ధాన్యం తీసుకొచ్చి అమ్ముకున్న. క్వింటాల్‌కు రూ.1,870 రేటుతో కొనుగోలు చేశా రు. నాలుగు రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ప్రభుత్వం పెట్టిన కొనుగోలు కేంద్రంలో అమ్మితేనే గిట్టుబాటు ధర వస్తున్నది. తూకంలో కూడా ఎలాంటి తేడా ఉండటం లేదు.
- మల్లారెడ్డి, రైతు భూపాలపల్లి

రైతుబంధు పైసలతో పొలం చేశా

నాకు మూడెకరాల పొలం ఉన్నది. రైతుబంధు పథకం కింద రూ.12 వేలు వచ్చా యి. మరోవైపు కరంట్ కోతలు లేవు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టి పొలం చేశా. పంట బాగా పం డింది. పంట అమ్ముకోవాలంటే గతంలో ఎన్నో సమస్యలు ఉండేవి. కానీ, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు.
- రహీం, రైతు వరంగల్

రేషన్ తీసుకోవడం సులువు

ఐరిస్ మిషన్ ద్వారా రేషన్ తీసుకోవడం చాలా సులువైంది. పోర్టబిలిటీ వల్ల ఎక్కడైనా సరుకులు తీసుకొనే అవకాశం కలుగుతున్నది. సమయం ఆదా అవుతున్నది. ఇదొక మంచి పరిణామం.
-వెంకటేశ్, రేషన్ లబ్ధిదారుడు, మంచిర్యాల

2789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles