అన్నదమ్ములే ఆక్రమణదారులు


Sat,May 25, 2019 02:45 AM

Ahmadhi Unni bhagam is the victim of Ramagundam who returned to Dharmaganta

-సహకరించిన రెవెన్యూ సిబ్బంది
-వాస్తవాలు చూడకుండా రికార్డుల మార్పిడి
-సోదరికి అన్యాయంచేసి భూముల ఆక్రమణ
-ధర్మగంటను ఆశ్రయించిన రామగుండంకు చెందిన బాధితురాలు అహ్మదీ ఉన్నీసాబేగం

ఒక పెద్ద కుటుంబం.. తండ్రి ఎంతోకొంత భూమిని కొనిపెట్టాడు. కొంత భూమిని అమ్ముకొన్నా.. మరికొంతభూమిని పిల్లలకు ఉంచి కాలంచేశాడు. ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది. తండ్రి ఇచ్చిన భూమి అక్కచెల్లెళ్లకు దక్కకుండా అన్నదమ్ములు ప్రణాళికలు వేశారు. న్యాయంగా రావాల్సిన వాటాను దిగమింగేశారు. తండ్రి జీవించి ఉండగా ఇతరులకు అమ్మిన భూమిని సైతం కాజేశారు. ఒక సోదరికి తండ్రి బహుమానంగా ఇచ్చిన భూమిని సైతం కబ్జాచేసి అమ్మేశారు. మరికొంత భూమిని ఆక్రమించారు. ఈ అన్నదమ్ములకు రెవెన్యూ శాఖలోని కిందిస్థాయి సిబ్బంది యథేచ్ఛగా సహకరించారు. దీంతో ఉన్నవాటితోపాటు లేని భూములూ ఆ అన్నదమ్ములపేర్లమీదకు మారిపోయింది. తండ్రి దగ్గర కొన్నవాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు తమకు దక్కాల్సిన వాటాకోసం ఓ సోదరి కోర్టు మెట్లు ఎక్కి పోరాడాల్సి వస్తున్నది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కైన ఇద్దరు సోదరులు చేస్తున్న భూదందా ఇది.

కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగాం శివారులోని అడ్డగుంటపల్లె వద్ద ఖాజా హమీదుద్దీన్ చందూమియా అనే రైతుకు దాదాపు 24 సర్వే నంబర్లలో (476, 496, 589, 592, 596, 597/బీ, 598/సీ, 600, 601,604/బీ, 629/బీ, 630/ఏ, 631, 632, 640/ఏ, 646, 649, 650, 662, 663, 664, 665, 668, 669) సుమారు 68 ఎకరాల భూమి ఉండేది. ఆయన జీవించి ఉన్నప్పుడు యాభైశాతానికి పైగా భూమిని ఇతరులకు అమ్మేశారు. మరోవైపు తన కూతుళ్లలో ఒకరైన అహ్మదీ ఉన్నీసాబేగంకు సర్వే నంబర్ 589లో 4 గుంటలు, సర్వే నంబర్ 640 ఏలో 30 గుంటల స్థలంతోపాటు, సర్వే నంబర్ 596లో ఒక ఇంటిని కూడా గిఫ్ట్ డీడ్‌చేసి బహుమానంగా ఇచ్చారు. 1996లో చందూమియా చనిపోయారు. అప్పుడే అసలు కథ మొదలైంది.

తండ్రి బతికి ఉండగా ఆస్తి పంపకం జరుగకపోతే.. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆస్తిని కొడుకులకు రెండుభాగాలు, కూతుళ్లకు ఒక భాగం పంచి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. అహ్మదీ సోదరులు రఫీకుద్దీన్, సాదికుద్దీన్ మొత్తం భూమిని రెవెన్యూ అధికారులతో మిలాఖత్ అయి తమ పేర్లమీదకు మార్పిడి చేసుకున్నారు. విచిత్రమేమంటే.. తమ తండ్రి చందూమియా అమ్మిన భూములను సైతం తమ పేర్లపైకి మార్పిడిచేసుకొన్నారు. వివిధ సర్వే నంబర్లలో చందూమియా నుంచి భూములను కొన్నవారు.. తమ పేర్లపైకి మ్యుటేషన్ చేసుకోలేదు. దీంతో రికార్డుల్లో చందూమియా పేరే వస్తుండటంతో చందూమియాపేరుతో ఉన్న పహాణీ, వన్ బీలను మార్చేసి సదరు భూమిని మొత్తం రెవెన్యూ అధికారులు విరాసత్‌చేశారు. ఒక ఆస్తికి సంబంధించిన రికార్డులను మారుస్తున్నప్పుడు సంబంధీకులందరికీ నోటీసులిచ్చి విచారణ జరిపి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రెవెన్యూ సిబ్బంది ఇవేవీ చేయకుండానే భూమార్పిడిచేశారు.

దీంతో చందూమియా ద్వారా సంక్రమించిన భూమితోపాటు అతను అమ్మిన దాదాపు 40 ఎకరాల భూమి కూడా కొడుకులపేరుమీదకు వచ్చేసింది. మరోవైపు చట్టప్రకారం కూతుళ్లకు ఇవ్వాల్సిన ఒక వాటా ఆస్తిని ఇవ్వలేదు. పైగా అహ్మదీకి తండ్రి ఇచ్చిన గిఫ్డ్ భూమిలో 4 గుంటల భూమి (సర్వేనంబర్ 589)ని ఆమెకు చెప్పకుండానే అమ్మేశారు. మరో సర్వే నంబర్ 640 ఏలోని 30 గుంటల భూమిని ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేశారు. విచిత్రమేమంటే ఈ 30 గుంటల భూమిలో అహ్మదీ ఏడు గుంటలను వేరేవాళ్లకు అమ్మేశారు. ఆమె సోదరుడు రఫీక్ మాత్రం మొత్తం 30 గుంటల్లో కంచెపాతి ఆక్రమించుకోజూశారు. సర్వేనంబర్ 596లో ఉన్న పెంకుటింటిని కూల్చేసి ఓపెన్ ల్యాండ్‌గా చూపించి దాన్నీ అమ్మేశారు.
Sabegam
అన్నదమ్ములు చేసిన ప్రతి పనిపైనా అహ్మదీ కోర్టులో కేసులు వేస్తూపోయారు. దీంతోపాటు తమకు తండ్రి ఆస్తిలో వాటా ఇప్పించాలంటూ.. పెద్దపల్లి సివిల్ కోర్టులో 1996 పార్టిషన్ సూట్ (నంబర్ ఓఎస్ 33/96) వేసి ఇంజక్షన్ ఆర్డర్ పొందారు. ఓ వైపు కోర్టులో కేసు నడుస్తుండగానే.. రఫీక్, సాదిక్‌లు రెవెన్యూశాఖలో మంత్రాంగం నెరిపారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డులు మార్పించేసుకొన్నారు. వీళ్లవల్ల సోదరి తనతోపాటు చందూమియా దగ్గర భూములు కొన్న చాలామంది ఇబ్బందులు పడ్డారని అహ్మదీ ఆవేదన వ్యక్తంచేశారు.

వాస్తవాలను పరిగణనలోకి తీసుకోని అధికారులు

ఇదంతా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా.. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు రికార్డులను మార్చడం వల్ల నెలకొన్న సమస్య ఇది. రికార్డుల్లో జరిగిన అక్రమాలపై 2009లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు అహ్మదీ తన భర్తతో కలిసి ఫిర్యాదుచేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ అప్పటి రామగుండం తాసిల్దార్ భుజంగరావును విచారించాలని ఆదేశించారు. విచారణ జరిపిన తాసిల్దార్ (లేఖ నంబర్ బీ/1482/2008 తేదీ:24-4-2010) ఆర్డీవోకు నివేదిక సమర్పించారు. రఫీక్, సాదిక్‌ల పేర్లు 640/ఏలో బై మిస్టేక్‌గా ఎంట్రీ అయ్యాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన ఆర్డీవో ఫైలును తొక్కిపెట్టారని అహ్మదీ చెప్పారు. దీంతో తన సోదరులు 640 ఏ లోని 30 గుంటల భూమిని ఆక్రమించుకొనే ప్రయత్నాలు మరింత ముమ్మరంచేశారని పేర్కొన్నారు. ఆస్తిలో వాటా గురించి రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ను కూడా రెండుసార్లు ఆశ్రయించామని, పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్, రామగుండం తాసిల్దార్‌కు గత ఫిబ్రవరితోపాటు.. తాజాగా మే 17న ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఏ అధికారీ స్పందించలేదని చెప్పారు.

తనకు జరిగిన అన్యాయంపై ఈ ఏడాది జనవరిలో సీసీఎల్‌ఏకు కూడా ఫిర్యాదు చేశామని.. చర్యలు తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు వెళ్లినా జిల్లా కలెక్టర్ స్పందించలేదని వాపోయారు. మోఖామీదకు వెళ్తుంటే తమను రానివ్వకుండా బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలంటూ రామగుండం కమిషనరేట్ పోలీసులకు పదులసార్లు దరఖాస్తులు పెట్టుకొన్నా వారి నుంచి ఎటువంటి సహకారం అందడంలేదని తెలిపారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ధర్మగంటను ఆశ్రయిస్తున్నామని, న్యాయబద్ధంగా తన భూమి తనకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అహ్మదీ చెప్పారు.


పాస్‌బుక్ కోసం ఏడాదిగా ఎదురుచూపు


అట్ల సుఖేందర్‌రెడ్డి

మాది హైదరాబాద్. 2014లో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ శివారులో సర్వేనంబర్ 340లో 20 గుంటలు, 348లో 20 గుంటలు మొత్తం ఎకరం భూమిని ఆ ఊరికే చెందిన గడ్డం సుదర్శన్‌రెడ్డి అనే రైతు నుంచి కొనుగోలు చేశాను. అదే ఏడాది భూమిపై 35/014 అమెండ్‌మెంట్ రికార్డుల్లో పేరు నమోదుచేసిన అధికారులు.. నాకు టైటిల్ డీడ్, పాస్‌పుస్తకాన్ని అందజేశారు. కానీ, గతేడాది భూరికార్డుల ప్రక్షాళనలో నా పేరు నమోదు చేయలేదు. దీంతో కొత్తగా డిజిటల్ పాస్‌పుస్తకం రాలేదు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందించే ఆర్థికసాయం అందలేదు. ఏడాదిగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నాకు కొత్త పాస్‌పుస్తకం ఇప్పించండి.
- అట్ల సుఖేందర్‌రెడ్డి, రైతు, హైదరాబాద్

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్


జోగిరిపెల్లి మోహన్‌రావు

రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలుచేస్తూ సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతు బాంధవుడు అయ్యారు. ఏండ్లుగా పేరుకుపోయిన రైతుల భూసమస్యల పరిష్కారానికి నమస్తే తెలంగాణలో ధర్మగంటను ప్రారంభించి కృషిచేస్తున్నారు. భవిష్యత్‌లో కూడా భూరికార్డుల్లో తప్పులు దొర్లకుండా ఉండేందుకు ధర్మగంటను కొనసాగించాలని రైతులు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. రెవెన్యూశాఖ ప్రక్షాళన, భూరికార్డుల సవరణ, వీఆర్వోల వ్యవస్థను సరిచేయడం వంటి చర్యలను స్వాగతిస్తున్నాం. రెవెన్యూశాఖలోని అవినీతిని రూపుమాపాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అభినందనీయం.
- జోగిరిపెల్లి మోహన్‌రావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, రాజన్న సిరిసిల్ల

భూ సమస్యలు అనేకం


గూడెపు ఆగయ్య

గ్రామాల్లో మాలాంటి పేద రైతుల భూసమస్యలు ఎన్నో ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళనచేపట్టినా పరిష్కారం కాని భూసమస్యలు ఇప్పటికీ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఏండ్ల తరబడి భూసమస్యలతో అనేక బాధలు పడుతున్నాం. మాలాంటి పేద రైతులు భూసమస్యల పరిష్కారం కోసం ధర్మగంటతో నమస్తే తెలంగాణ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉన్నది. భూముల ధరలు పెరుగుతుండటంతో గ్రామాల్లో రోజురోజుకూ భూతగాదా లు పెరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా సమస్యలన్నింటినీ పరిష్కరించాలి.
- గూడెపు ఆగయ్య, రైతు, మల్యాల, కరీంనగర్ జిల్లా

రెవెన్యూ చట్టంలో మార్పులు రావాలి


కే సాంబశివరెడ్డి

చిన్న, సన్నకారు రైతులు ఏండ్లకొద్దీ సాగుచేసుకుంటున్నారే తప్ప ఏనాడూ ఆ భూమి ఏ సర్వే నంబర్‌లో ఉన్నది.. సరిహద్దులు ఏమిటన్న విషయం వారికి తెలియదు. సాగుచేసుకుంటున్న భూమి వారి పేరు మీద ఉన్నదో? లేదో? అనే విషయం చాలా మంది రైతులకు తెలియదు. రైతులు పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లో అప్పుల కోసం పహాణీలు తీసినప్పుడుగానీ, వారికి అసలు విషయం అర్థం కావడంలేదు. భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కానీ వారి పనులు కావడంలేదు. రైతులకు భూ చట్టాలు, సర్వే నంబర్లపై అవగాహన కల్పించాలి. ఈ పనులు జరుగాలంటే రెవెన్యూ చట్టంలో మార్పులు రావాలి.
- కే సాంబశివరెడ్డి, రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్, ఇల్లందకుంట, కరీంనగర్ జిల్లా

ప్రక్షాళన ఎంతో అవసరం


ఎస్ సాయిప్రసాద్

రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం సరైనదే. రెవెన్యూ అధికారులుచేసిన తప్పిదాలకు బాధితులు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్‌లో జరిగే తప్పిదాలకు రెవెన్యూ ఉద్యోగులనే బాధ్యులనుచేసి వారిలో జవాబుదారీతనం పెంచాలి. ఆ విధంగా చట్టాలను రూపొందించి అమలుచేయాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది.
- ఎస్ సాయిప్రసాద్, అంబర్‌పేట, హైదరాబాద్

అవినీతి అంతం కావాలి


దిలిప్‌రాజ్

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అంతం కావాలి. సర్కారు ఉద్యోగంచేస్తూ అవినీతికి పాల్పడటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది. రెవెన్యూ, మున్సిపల్‌శాఖలో ప్రక్షాళన వల్ల బాధితులకు న్యాయం జరుగుతుంది. సమస్యలు వెలికితీయడంతోపాటు వారికి సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి మా వంతు సహకారం అందిస్తాం. బాధితులను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం.
- దిలిప్‌రాజ్, అంబర్‌పేట, హైదరాబాద్

మార్పుదిశగా చట్టం రావాలి


కుర్నమోని జయేందర్

రెవెన్యూశాఖలో అవినీతిని రూపుమాపడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రెవెన్యూ వ్యవస్థలో మార్పు దిశగా కొత్త చట్టం రావాలి. ఈ చట్టంతోనైనా వ్యవస్థలో మార్పురావాలి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. కొత్త చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నా.
- కుర్నమోని జయేందర్, దాసర్లపల్లి, కందుకూరు, రంగారెడ్డి జిల్లా

రైతులకు మేలుచేసే చట్టాలు ఉండాలి


తల్లోజు లకా్ష్మణాచారి

ప్రస్తుతం ఎన్ని చట్టాలున్నా రైతులకు సరైన న్యాయం జరుగడం లేదు. భూసమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. సకాలంలో రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు సతాయిస్తున్నారు. రెవెన్యూశాఖలో జరుగుతున్న అవినీతిని రూపుమాపడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదే. రెవెన్యూ అధికారుల పనితీరులో మార్పు రావాలి. కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషం.
- తల్లోజు లకా్ష్మణాచారి కొత్తగూడ, కందుకూరు, రంగారెడ్డి జిల్లా

1928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles