వాస్తవిక బడ్జెట్

Tue,September 10, 2019 04:37 AM

-మాంద్యంలోనూ సంక్షేమానికి దన్ను
-తక్కువ అంచనా.. ఎక్కువ కార్యసాధన
-భారీగా బడ్జెట్ అంచనాలు తగ్గింపు
-వ్యవసాయం, సంక్షేమానికి పెద్దపీట
-పక్కా లెక్కలతో రాష్ట్ర బడ్జెట్
-ఆర్థికమాంద్యం ఉన్నా రెవెన్యూమిగులు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం, జీడీపీ వృద్ధిరేటులో పతనాన్ని పరిగణనలోకి తీసుకుని భారీ అంచనాలకు అస్కారంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్‌ను ఉభయసభలలో ప్రవేశపెట్టింది. తక్కువ అంచనా.. ఎక్కువ కార్యసాధన (అండర్ ప్రామిస్.. ఓవర్ పర్ఫార్మెన్స్) అన్న సూత్రంతో పక్కాలెక్కలతో బడ్జెట్‌ను రూపొందించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే సుమారు రూ.35 వేలకోట్ల మేర అంచనాలను తగ్గించింది. గతంలో మాదిరిగానే బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమానికి, సాగునీటికి, వ్యవసాయానికి పెద్దపీటవేస్తూ, ప్రజలపై ఎలాంటి పన్నుభారం మోపకుండా రూ.1,46,492.30 కోట్లతో సమతుల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీకి సమర్పించారు. రైతులు, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో వాస్తవపరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్న ముఖ్యమంత్రి.. వచ్చేరోజుల్లో పరిస్థితి మెరుగుపడితే అంచనాలు సవరించుకుంటామని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు యథాతథంగా అమలవుతాయన్నారు. పలు రాష్ర్టాల ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉన్నా.. మన పరిస్థితి కొంతలో కొంత నయంగానే ఉన్నదని చెప్పారు. దేశ, రాష్ట్ర ఆర్థికవ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న సమయంలో 2019-20 ఆర్థికసంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఆర్థికమాంద్యం నేపథ్యంలో పక్కా లెక్కలు

గత ఆర్థిక సంవత్సరం 2018-19లో రూ.1.74 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా సవరించిన అంచనాల్లో అది రూ.1.61 లక్షల కోట్లకు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రూ.1.82 లక్షల కోట్లతో ఉన్నా.. ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్‌లో 20% మేరకు తగ్గించారు. దేశవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ అంచనాలకు పోకుండా బడ్జెట్‌ను వాస్తవిక దృష్టితో రూపొందించారు. పైసాపైసాను పక్కాగా లెక్కించి కనీసస్థాయిలో అంచనాలను వేశారు. ప్రగతిపద్దు (స్కీమ్ ఎక్స్‌పెండిచర్) కింద రూ.75,283 కోట్లు, నిర్వహణ పద్దు (ఎస్టాబ్లిష్‌మెంట్ ఎక్స్‌పెండిచర్) కింద రూ.71,229.06 కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగానికి రూ.22వేల కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.53 వేల కోట్లు కేటాయించారు. ఇది ప్రగతిపద్దులో 65 శాతంగా ఉండటం విశేషం. దీనిలో ఆసరా పెన్షన్లు, రుణమాఫీ, రైతుబీమా విద్యుత్‌సబ్సిడీ, రైతుబంధు, ఉపకారవేతనాలు, ఆరోగ్యశ్రీ- ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, కల్యాణలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా సంక్షేమం కలిసి ఉన్నాయి.

విద్యుత్‌రంగానికి గతేడాది రూ.5338.40 కోట్లు కేటాయించగా ఈసారి రూ.8,289.77 కోట్లకు పెంచారు. పెట్టుబడివ్యయం కూడా బాగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం పెట్టుబడి వ్యయం రూ.26 వేల కోట్లవరకు ఉండగా ఈసారి రూ.17,274 కోట్లకు కుదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడా తగ్గించకుండా, ప్రజలపై పన్ను భారం లేకుండా ముఖ్యమంత్రి వాస్తవాలను ప్రతిఫలించే బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అన్ని కోణాల్లో ఆర్థిక పరిస్థితులను అంచనావేసి, ఎలాంటి భేషజాలు లేకుండా వాస్తవాన్ని ప్రతిఫలించేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు సీఎం ప్రకటించారు. జాతీయస్థాయిలో ఆర్థికమాంద్యం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. రాష్ట్ర మొత్తం రాబడులు, సొంత రాబడుల వృద్ధిరేటును కూడా తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2020 మార్చి) ముగిసేసరికి మొత్తం రెవెన్యూ రాబడులు రూ.1,13,099.92 కోట్లు ఉంటాయని అంచనావేశారు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లుగా చూపారు. ప్రస్తుత బడ్జెట్‌లో మొత్తంగా రెవెన్యూ మిగులు రూ.2,044 కోట్లుగా చూపారు. ఓటాన్ అకౌంట్‌లో రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లుగా ఉంటుందని అంచనావేయగా, పూర్తిస్థాయి బడ్జెట్‌లో దానిని సవరించి, రూ.2,044 కోట్లకు కుదించారు. మధ్యంతర బడ్జెట్‌లో రూ.27,749 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటును ఇప్పుడు రూ.24,081.74 కోట్లకు తగ్గించారు.

తగ్గనున్న కేంద్ర పన్నుల వాటా

ఆర్థికమాంద్యం కారణంగా ఈసారి రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధిరేటు గతం కంటే 5 శాతం వరకు మాత్రమే పెరిగే అవకాశం ఉన్నదని బడ్జెట్‌లో అంచనావేశారు. వాస్తవానికి ప్రతి ఏటా తెలంగాణ ఆర్థికవృద్ధిరేటు 17% నుంచి 19% వరకు ఉంటున్నది. కానీ కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో 22% వృద్ధి ఉంటుందని అంచనా వేయగా, కేవలం 2% కంటే తక్కువకు పడిపోవడంతో దాని ప్రతికూల ప్రభావం రాష్ట్రంపై కూడా ఉంటుందని అధికారులు లెక్కించి ఈ అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరం 2018-19 వార్షిక బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం.. రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.66,749.75 కోట్లు సమకూరగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.69,328.57 కోట్లు రావచ్చని అంచనావేశారు. కనీసస్థాయిలో వృద్ధిరేటును అంచనా వేశామని, డిసెంబర్ తర్వాత పరిస్థితి మెరుగై వృద్ధిరేటు పెరిగినా ఆశ్చర్యం లేదని అధికారులంటున్నారు. ఇక పన్నేతర రాబడి గత ఆర్థిక సంవత్సరం రూ.6,347 కోట్లుగా ఉండగా.. అది రూ.15,875 కోట్లకు పెరుగవచ్చని అంచనావేశారు. మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర పన్నుల వాటాలో రాష్ర్టానికి రూ.20,583.05 కోట్లు వస్తాయని అంచనా వేయగా పూర్తిస్థాయి బడ్జెట్‌లో దానిని రూ.19,718.57 కోట్లకు తగ్గించి చూపారు. గడిచిన నాలుగునెలల్లో జీఎస్టీతోపాటు ఇతర పన్నుల వాటాలో రూ.900 కోట్ల వరకు తగ్గింది. దానికి అనుగుణంగా బడ్జెట్‌లో అంచనాను తగ్గించారు.

వరుసగా బడ్జెట్ మిగులు

రాష్ట్రం ఆవిర్భవించిన మరుసటి ఏడాదినుంచి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన తెలంగాణ.. వరుసగా రెవెన్యూ మిగులును సాధిస్తున్న అతికొద్ది రాష్ర్టాల సరసన చేరింది. ఈసారికూడా బడ్జెట్‌లో రూ.2,044 కోట్ల మిగులును అంచనావేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,385 కోట్ల మిగులు సాధించగా, 2017-18లో రూ.3,459.37 కోట్లు, 2018-19లో రూ.72.19 కోట్లు మిగులు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు రూ.1,13,099.92 కోట్లు ఉండగా ఖర్చులు రూ.1,11,055.84 కోట్లుగా అంచనా వేశారు.
budget

ముఖ్యమైన కేటాయింపులు రూ. కోట్లలో..

బియ్యం సబ్సిడీ 2,287

cm-kcr13

రైతుబంధు 12,000, రైతుబీమా 1,137

cm-kcr7

విద్యుత్ సబ్సిడీ 8,000

cm-kcr12

ఆసరా పింఛన్లు 9,402

cm-kcr8

ఆరోగ్యశ్రీ-ఈహెచ్‌ఎస్ 1,336

cm-kcr2

కల్యాణలక్ష్మి 1,540

cm-kcr10

రుణమాఫీ 6,000

cm-kcr5

ఉపకారవేతనాలు 3,257

cm-kcr4

వ్యవసాయరంగానికి రూ.22వేల కోట్లు

cm-kcr9

ప్రత్యేక అభివృద్ధి నిధులు 10,000

cm-kcr14

*

సంక్షేమ పథకాలకు రూ.53వేల కోట్లు



*

ప్రగతిపద్దులో సంక్షేమానికే 65%

2150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles