సైబర్‌ నేరాలపై డేగకన్ను

Wed,December 4, 2019 02:47 AM

- అన్ని జిల్లాల్లో అత్యాధునిక సైబర్‌ల్యాబ్స్‌
- రాష్ట్రవ్యాప్తంగా సిబ్బందికి నిరంతర శిక్షణ
- విదేశీ ప్రతినిధులతో ప్రత్యేక తరగతులు
- విద్యార్థులకు అవగాహన సమావేశాలు
- ‘హద్దు’దాటేవారిపై అడుగడుగునా నిఘా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సమాజంలో నేరాల తీరు రోజురోజుకూ మారుతున్నది. చోరీలకు ముందుగానే ప్లాన్లువేసి, ఎవరికంటా పడకుండా దోచుకెళ్లే దొంగలకు ఇప్పుడు హాయిగా ఏసీ గదుల్లో కూర్చొని చిన్నపాటి కంప్యూటర్‌తో మన ఖాతాలోని సొమ్మంతా కొల్లగొట్టే సైబర్‌ నేరగాళ్లు తోడయ్యారు. ఇలాంటి నేరగాళ్లలో కొందరు యువతులు, మహిళల ఫోన్‌నంబర్లు సంపాదించి అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలతో వారిని మానసికంగా క్షోభపెడుతున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లను కట్టడిచేసేందుకు తెలంగాణ పోలీసులు పటిష్ఠ వ్యూహాలను అమలుచేస్తున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ తరహాలో అన్ని జిల్లాల్లో ప్రత్యేక సైబర్‌ల్యాబ్స్‌ ఏర్పాటుకు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి చొరవ తీసుకొన్నారు. కొత్తతరహా నేరాల సరళిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ సైబర్‌ నేరపరిశోధనలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉండేలా డీజీపీ కార్యాలయంలోని లెర్నింగ్‌ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు.

విదేశీ నిపుణులతో ప్రత్యేక శిక్షణ

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో సుమారు రూ.70 కోట్లతో సైబర్‌ల్యాబ్స్‌ను ఏర్పాటుచేశారు. వీటిలో అడిషనల్‌ ఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ స్థాయి వరకు కలిపి 165 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ సైబర్‌టూల్స్‌ వాడకం, సైబర్‌ నేరపరిశోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, మెళకువలపై అత్యాధునిక పద్ధతుల్లో నిరంత శిక్షణ ఇస్తున్నారు. వీరికి తెలంగాణ పోలీస్‌ విభాగంలోని సైబర్‌ క్రైం నిపుణులతోపాటు రష్యా, చెక్‌రిపబ్లిక్‌ తదితర దేశాల నిపుణులు తర్ఫీదునివ్వడంతోపాటు డీఎస్‌సీఐ (డాటా సెక్యురిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) బృందం అవగాహన తరగతులు నిర్వహించింది. సైబర్‌ నేరపరిశోధనలో అత్యంత కీలకమైన మొబైల్‌ ఎనాలసిస్‌, డాటా రికవరీ, వీడియో ఎన్‌హాన్స్‌మెంట్‌, సెల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ తదితర పలు టూల్స్‌ వినియోగంలో తెలంగాణ పోలీసులు నైపుణ్యం సాధించారని, అన్ని జిల్లాల్లో నమోదైన సైబర్‌ నేరాలను డీజీపీ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు సైబర్‌ నేరాలపై సమాజంలో అవగాహన పెంచేందుకు సైబర్‌ల్యాబ్స్‌ సిబ్బంది అన్ని జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయి, అధికారుల ముసుగులో నేరగాళ్లు మన బ్యాంకు ఖాతాలను ఎలా కొల్లగొడుతున్నారన్న విషయాలను రాష్ట్రవ్యాప్తంగా 60 వేలమంది విద్యార్థులకు వివరిస్తున్నారు. సైబర్‌ నేరాలపై విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

సోషల్‌ మీడియా పోకిరీలపై సైబర్‌ల్యాబ్స్‌ నిఘా

సోషల్‌ మీడియాద్వారా వదంతులు వ్యాప్తిచేసేవారితోపాటు వ్యక్తిగత దూషణలకు దిగేవారిపై అన్ని జిల్లాల్లోని సైబర్‌ల్యాబ్స్‌ సిబ్బంది నిఘాపెడుతున్నారు. ఏదైనా సంఘటనపై హద్దుదాటి ప్రవర్తించేవారితోపాటు ఇతరులను కించపర్చేలా వ్యాఖ్యలు పెట్టేవారిపై కఠినచర్యలు తీసుకొంటున్నారు. తాజాగా ‘దిశ’ ఘటనపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలుచేసిన నిజామాబాద్‌ జిల్లా యువకుడు శ్రీరాంను హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు.

800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles