పకడ్బందీ ఏర్పాట్లు.. పక్కా వ్యూహాలు

Sun,September 2, 2018 02:02 AM

-ప్రగతి నివేదన సభకు పూర్తి బందోబస్తు
-అంతా సీసీ కెమెరాల నిఘాలో
-లా అండ్ ఆర్డర్ సహా ఇతర ఫోర్స్‌తో బందోబస్తు
-ట్రాక్టర్ల తిరుగు ప్రయాణం సోమవారం తెల్లవారుజామున
-ఔటర్‌రింగురోడ్డుపై ఈ రోజు అసాధారణ రద్దీ
-ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే
-ప్రత్యామ్నాయాలు వాడుకోవాలన్న పోలీసులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/సిటీబ్యూరో/ ఆదిబట్ల: హైదరాబాద్ శివారు కొంగర్‌కలాన్‌లో ఆదివారం నిర్వహించే ప్రగతినివేదన సభకు రాష్ట్ర పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లుచేశారు. సభకు వచ్చేవారి వాహనాలు ఏయే మార్గాల్లో సభాస్థలికి చేరుకోవాలి? ఎక్కడ వాహనాలు పార్కింగ్ చేయాలి? సభ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణం సహా అన్ని అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు పక్కా వ్యూహాలు రూపొందించారు. కొంగరకలాన్ సభకు సంబంధించి డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా ఎనిమిదిమంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సభ ఓవరాల్ కోఆర్డినేటర్‌గా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) జితేందర్‌ను నియమించారు. అధికారులతో ఎప్పటికప్పుడు డీజీపీ సమన్వయం చేస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు.

అంతా సీసీ కెమెరాల నిఘాలో

సభాస్థలికి చేరుకున్నవారికి వంట, ఇతర సదుపాయాలకు పోలీసులు సహకారం అందించారు. ఐపీఎస్‌స్థాయి నుంచి ఎస్పీలు, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ వరకు కలిపి మొత్తం 20వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లుచేశారు. లా అండ్ ఆర్డర్, ఏపీఎస్పీ, ట్రాఫిక్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్, షీ టీమ్స్ ఇలా పలు విభాగాల సిబ్బందితో పోలీసు ఉన్నతాధికారులు మోహరించారు. సభాస్థలితోపాటు పార్కింగ్‌స్థలాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

మధ్యాహ్నం రెండుగంటలకల్లా ప్రాంగణంలోకి చేరుకోవాలి

ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల కల్లా ప్రజలు సభాప్రాంగణానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇప్పటికే ట్రాక్టర్ల ద్వారా చేరుకున్న వారు నేరుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు.

ట్రాక్టర్లలో వచ్చిన వాళ్ల్లు సోమవారం తెల్లవారుజామున బయలుదేరాలి

ప్రగతి సభకు వచ్చే వారంతా క్షేమంగా తిరిగి ఇండ్లకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సభ ట్రాఫిక్ ఇన్‌చార్జి, నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. సభకు ట్రాక్టర్లలో వచ్చేవారిని శనివారం అర్ధరాత్రివరకే అనుమతిస్తున్నట్టు చెప్పారు. సభ పూర్తయిన తర్వాత వారంతా (ట్రాక్టర్లలో) సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణం ప్రారంభించాలని సూచించారు.

ఆదివారం ఔటర్‌పై ప్రయాణాలు వద్దు

ఆదివారం ఔటర్ రింగురోడ్డును సాధారణ ప్రజలు ఉపయోగించకపోవడమే మేలని రంగనాథ్ సూచించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సినవారు, అక్కడినుంచి నగరానికి వచ్చేవారు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, చార్మినార్, పురానాపూల్ రోడ్లను ఉపయోగించుకోవాలని సూచించారు. నగరంలోని కూకట్‌పల్లి, గచ్చిబౌలి, పటాన్‌చెరువు, ఎల్బీనగర్, సాగర్‌రోడ్లు కూడా సభకు వెళ్లే వారితో రద్దీగా ఉంటాయి కనుక సాధారణ ప్రజలు విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌లు, శుభకార్యాలయాలకు వెళ్లి వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కోరారు.

రక్షణ కవచంగా ఆక్టోపస్

అత్యాధునిక ఆయుధాలతో పహారా
ప్రగతి సభ బందోబస్తులో ఆక్టోపస్ బృందం కూడా ఉన్నది. అత్యవసర పరిస్థితులను సునాయాసంగా ఎదుర్కొనే నిష్ణాతులైన 60 మంది సిబ్బందిని సభ వేదిక వద్ద భద్రతకు కేటాయించారు. గత నాలుగు రోజుల నుంచే ఆక్టోపస్ బృందం గస్తీ, భద్రత ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆక్టోపస్ బృందం దేశంలోనే అత్యాధునిక ఆయుధమైన కోల్ట్‌వెపన్‌ను వాడుతుంది.

పూర్తి సురక్షిత వాతావరణం కల్పించాం: డీజీ జితేందర్

DG-Jitender
సభకు వచ్చే వారందరికీ కొంగరకలాన్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి సురక్షిత వాతావరణాన్ని కల్పించామని రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. శనివారం ప్రగతి సభ ప్రాంగణంలో ఆయన భద్రతా ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. పోలీసులు సూచించిన మార్గాలు, రోడ్లపై ఏర్పాటుచేసిన సూచిక బోర్డులను పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని స్పష్టంచేశారు. సభకు 20 వేల మంది సిబ్బందితో బందోబస్తును నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారికి పోలీసులు సహకరిస్తారని, అంబులెన్సులకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని స్పష్టంచేశారు. సీసీ కెమెరాల ద్వారా మొత్తం ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు.

ఆదివారం ట్రాక్టర్లకు అనుమతి లేదు

ఆదివారం సభాప్రాంగణానికి ట్రాక్టర్లను అనుమతించటం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ తెలిపారు. ట్రాక్టర్లు తక్కువ వేగంతో ప్రయాణించే విషయాన్ని గమనంలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. టాక్టర్లకు తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీ ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. సైబరాబాద్ పరిధి నుంచి సభకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.

2324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles